Share News

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కష్టాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:51 AM

తెలంగాణ జెన్‌కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది.

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు కష్టాలు

  • రాష్ట్రంలో రెండు యూనిట్లను మూసివేసిన జెన్‌కో

  • యాదాద్రి, కేటీపీపీలలో ఒక్కో యూనిట్‌ మూత

  • రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉత్పత్తి నిలిపివేత

  • చెల్లింపులు సరిగా చేయకపోవడంతో జెన్‌కోకు బొగ్గు సరఫరా తగ్గించిన సింగరేణి

  • అప్రాధాన్య జాబితాలో చేరుస్తూ నిర్ణయం

  • థర్మల్‌ కేంద్రాల్లో భారీగా తగ్గిన బొగ్గు నిల్వలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్‌కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థ ర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎస్)లో ఒక యూనిట్‌, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(కేటీపీపీ)లో మరో యూనిట్‌లో సోమవారం నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా రెండు యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. సింగరేణి నుంచి జెన్‌కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో జెన్‌కోకు బొగ్గు సరఫరాను అప్రాధాన్య జాబితాలో చేర్చింది. 2025 నవంబరు నాటికే సింగరేణికి జెన్‌కో రూ.17,882 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గులో సింహభాగం జెన్‌కోకే సరఫరా చేస్తున్నా.. చెల్లింపులు శూన్యంగా ఉండటంతో వేతనాలకు కూడా ఆ సంస్థ పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో బొగ్గు సరఫరా తగ్గిపోయి విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు మూతపడే పరిస్థితి తలెత్తింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను తెలంగాణ జెన్‌కో నిర్మిస్తోంది. అయితే యూనిట్‌-1, 2, 3, 4లలో మాత్రమే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. మరోవైపు యాదాద్రిలో నాలుగు యూనిట్లకుగాను మూడు యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో ఒక యూనిట్‌ను, కేటీపీపీ(భూపాలపల్లి)లో మరో 500 మెగావాట్ల యూనిట్‌ను బొగ్గు కొరత కారణంగా మూతపెట్టేశారు. వాస్తవానికి యాదాద్రిలో యూనిట్‌ 3, 5లలో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సింగరేణి ఇదివరకే తేల్చిచెప్పింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్‌ జ్యోతి జెన్‌కోకు లేఖ కూడా రాశారు. ఇలా రెండు సంస్థల మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడింది. జెన్‌కో వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉండగా.. ప్రస్తుతం 5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని జెన్‌కో చెబుతోంది. ఇందులో 2.5 లక్షల టన్నులు మాత్రమే థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించుకోగలమని అంటోంది. వాస్తవానికి జెన్‌కోతో ఇంధన ఒప్పందం ప్రకారం జీ-9, 10 రకాల బొగ్గును మాత్రమే అందించాలి. కానీ, థర్మల్‌ ప్లాంట్‌లకు జీ-15, 16 రకాల బొగ్గు వస్తుందని జెన్‌కో గుర్తించింది. దీని వల్ల ఒక్కో దశలో ఆయిల్‌ను కూడా వినియోగించి విద్యుత్‌ ఉత్పాదన చేశారు. తాజాగా నిల్వలు లేకపోవడంతో ప్లాంట్లు మూతపెట్టుకునే దిశగా జెన్‌కో అడుగులు పడ్డాయి.


థర్మల్‌ కేంద్రాల్లో తగ్గుతున్న నిల్వలు..

రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు గణనీయంగా పడిపోయి... రెడ్‌ క్యాటగిరీలోకి చేరాయి. కోల్‌బెల్ట్‌లో ఉన్న పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఐదో, ఆరో దశ యూనిట్లలో, యాదాద్రిలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో కేవలం ఆరు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి మరోవైపు పాల్వంచలోని కేటీపీఎస్‌ ఏడో దశ పిట్‌హెడ్‌ ప్లాంట్‌ అయినప్పటికీ 9 రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ఇక భూపాలపల్లిలోని కేటీపీపీ రెండు యూనిట్లలో.. 500 మెగావాట్ల యూనిట్‌ను బొగ్గు నిల్వలు లేక మూతపెట్టారు. 600 యూనిట్ల ప్లాంట్‌కు తాడిచర్లలో క్యాప్టివ్‌ (సొంత) బొగ్గు గని ఉంది. కాగా, మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో 8 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. కోల్‌బెల్ట్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 6 రోజుల్లో నిల్వలన్నీ కరిగిపోనున్నాయి. మానవ వనరుల కొరత, కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌లో లోపాల కారణంగా సరిపడా బొగ్గు ప్లాంట్‌కు అందడం లేదు.

బొగ్గు ఇచ్చేందుకు కేంద్రం రెడీ..

ఈ వ్యవహారం కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు చేరడంతో.. ఛత్తీస్‌గఢ్‌లోని ఎస్‌ఈసీఎల్‌(సౌత్‌ ఈస్ట్నర్న్‌ కోల్‌ ఫీల్డ్‌)కు చెందిన కోర్బా నుంచి బొగ్గును షార్ట్‌ లింకేజి కింద ఇప్పిస్తామని కేంద్రం ఆఫర్‌ ఇచ్చింది. అయితే సింరగేణికి చెల్లింపులు చేసినా, చేయకపోయినా బొగ్గు లభించే అవకాశాలు ఉండగా, ఎస్‌ఈసీఎల్‌కు మాత్రం చెల్లింపులు సకాలంలో చేస్తేనే బొగ్గు లభిస్తుంది. అయితే సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఎస్‌ఈసీల్‌లో లభిస్తుంది. చెల్లింపులు సరిగా చేస్తే సింగరేణి బొగ్గు కన్నా ఎస్‌ఈసీఎల్‌ బొగ్గే చవకగా దొరుకుతుంది. టన్నుకు దాదాపు రూ.800 కన్నా ఎక్కువే మిగులుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 04:51 AM