Share News

73.01శాతం పోలింగ్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:00 AM

పురపోరు కోసం ఓటర్లు పోటెత్తారు. పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు.. గొడవలు, వాగ్వాదాలతో అక్కడక్కడా కాస్త ఉద్రిక్తతలు నెలకొన్నా ఓటర్లు పెద్ద ఎత్తున బూత్‌లకు తరలివచ్చి ఓటు వేశారు.

73.01శాతం పోలింగ్‌

  • మునిసిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91శాతం .. 59.68శాతం తో నందికొండలో అత్యల్పంగా

  • కార్పొరేషన్లలో అత్యధికంగా నల్లగొండలో 77.36శాతం

  • అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12శాతం పోలింగ్‌

  • ఓటు హక్కు వినియోగించుకున్న 38,09,406 మంది

  • మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ ఏజెంట్లపై కర్రలు, రాడ్లతో

  • కాంగ్రెస్‌ వర్గీయుల దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం

  • కామారెడ్డిలో కాంగ్రెస్‌ నేతలతో బీజేపీ నేతల గొడవ

  • రాళ్లదాడితో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తకు తీవ్రగాయాలు

హైదరాబాద్‌, పిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌): పురపోరు కోసం ఓటర్లు పోటెత్తారు. పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు.. గొడవలు, వాగ్వాదాలతో అక్కడక్కడా కాస్త ఉద్రిక్తతలు నెలకొన్నా ఓటర్లు పెద్ద ఎత్తున బూత్‌లకు తరలివచ్చి ఓటు వేశారు. మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలకు చెందిన 2,569 వార్డు కౌన్సిలర్లు, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల ఎన్నిక కోసం బుధవారం పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73.01 శాతం పోలింగ్‌ నమోదైంది. పురుషులకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం విశేషం. మునిసిపాలిటీల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో అత్యధికంగా 91.91శాతం, అత్యల్పంగా నల్లగొండ జిల్లా నందికొండ మునిసిపాలిటీలో 59.68శాతం పోలింగ్‌ నమోదైంది. కార్పొరేషన్లవారీగా చూస్తే.. నల్లగొండ కార్పొరేషన్‌లో అత్యదికంగా 77.36శాతం అత్యల్పంగా నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 59.12శాతం పోలింగ్‌ నమోదైంది. 8,203 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రారంభంలో మందకొడిగా సాగినా.. ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు చేరకున్నారు. ఫలితంగా మధ్యాహ్నం ఒంటిగంటకు 48.54శాతం, 3 గంటలకు 62.09శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5గంటల వరకే ఓటు వేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. అప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని క్యూలో నిల్చున్న వారికి ఓటువేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 52,17,413 మంది ఓటర్లకు గాను 38,09,406 మంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఓటువేశారు. వీరిలో పురుషులు 18,51,829, మహిళలు 19,57,226 ఇతరులు 351 మంది ఉన్నారు. శుక్రవారం (13వ తేదీన) ఓట్ల లెక్కింపు జరగనుంది.


అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకుగాను 12 వార్డులు ఏకగ్రీమయ్యాయి. ఒకవార్డులో ఎన్నిక వాయిదా పడటంతో 2,569 వార్డుల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 414 డివిజన్‌లకుగాను రెండుచోట్ల ఏకగ్రీవం కాగా.. 412 స్థానాలకు పోలింగ్‌ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ కమిషనర్‌ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్‌ పూర్తికావడంతో బ్యాలెట్‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ 137 స్ట్రాంగ్‌రూంలకు తరలించామని చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. 16న మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుందని, అదేరోజు వారంతా ప్రమాణస్వీకారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండలోని 25వ డివిజన్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గాంధీనగర్‌లో టీఆర్పీ (తెలంగాణ రాజ్యాధికార పార్టీ), కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్పీ నాయకులు గొడవకు దిగడంతో ఇరుపార్టీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. గద్వాల 8, 19 వార్డుల్లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని, వాళ్లను తీసుకొచ్చిన వ్యక్తులను గుర్తించి చితకబాదారు. కామారెడ్డిలోని 9వ వార్డులోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు నిలదీయడంతో ఘర్షణ జరిగింది. కొందరు రాళ్లతో దాడి చేయడంతో బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ 20వ వార్డు రెడ్డి కాలనీలో పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గీయులు దాడికి దిగారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రె్‌సపార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ పార్టీకి చెందిన ఎయిర్‌టెల్‌ అశోక్‌ అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్త గాయపడ్డాడు.


గొడవలు, ఘర్షణలు

మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా గొడవలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాంపేట్‌ 7వ వార్డులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రచారం ముగిశాక ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఇరువర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒకదశలో బీఆర్‌ఎ్‌సకు చెందిన మంచిరెడ్డి ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని తమ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారంటూ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బయట వ్యక్తులు బస్తీల్లో తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి సీతారాంపేట్‌ గేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. బయట వ్యక్తులు ఎవరున్నా పంపించేస్తామని పోలీసులు సర్దిచెప్పి పంపారు. నల్లగొండలోని 37వ డివిజన్‌లోని రవీంద్రనగర్‌ ప్రాంతంలో పోలింగ్‌ పూర్తయ్యాక బాక్సులు తరలించే విషయంలో వివాదం నెలకొంది. ఏజెంట్ల సమక్షంలో బాక్సులు తరలించకుండా పాఠశాల వెనుకనుంచి బాక్సులను తీసుకెళుతున్నారంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయిజ 19వ వార్డులో స్వస్తిక్‌ ముద్ర ఇచ్చే అధికారి చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు సూచిస్తుండటంతో విఽధుల నుంచి తొలగించారు.


మిర్యాలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి వీరంగం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ బూత్‌లో బీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమి తరఫున ఏజెంట్లుగా వ్యవహరించిన షేక్‌ మస్తాన్‌, షేక్‌ జమీన్‌, షేక్‌ బడేమియాపై పోలింగ్‌ అనంతరం కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థి జావేద్‌, ఆయన సోదరులు తమ అనుచరులతో కలిసి కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మస్తాన్‌, జమీన్‌, బడేమియాకు తీవ్రగాయాలయ్యాయి. వారిని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మస్తాన్‌, జమీన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండలోని ఆస్పత్రికి తరలించారు. అయితే జావేద్‌ అనుచరులు ఆ ఆస్పత్రికి చేరుకుని మరోమారు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు నల్లమోతు సిద్ధార్థ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో అతనిపైనా దాడికి యత్నించారు.

ఎంపీ అర్వింద్‌పై కేసు

ఎన్నికల సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడారనే ఆరోపణలపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్లు టౌన్‌-1 ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హరిచరణ్‌ మార్వాడి స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌ వద్దకు అరవింద్‌ తన అనుచరులతో కలిసి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్న గుర్రం నారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ సలీం, పోలీస్‌ కానిస్టేబుల్‌ బి.గోవర్ధన్‌, మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శ్రీనివా్‌సను పరుష పదజాలంతో అరవింద్‌ దూషించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘287 పోలింగ్‌ బూత్‌ ఎక్కడ? అభ్యర్థిని ఎవరు బయటకు పంపారు? తన్నులు తింటారా?’ అంటూ పోలీసులపై అరవింద్‌ విరుచుకుపడటమే కాకుండా, తన కార్యకర్తలను లోపలికి వెళ్లండంటూ ఆయన ప్రేరేపించారని డ్యూటీలో ఉన్న పోలీసులు ఆరోపించారు. పోలీసులు వారించినా వినకుండా 285, 286, 287 బూత్‌లలోకి ప్రవేశించి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎంపీ అర్వింద్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

3.jpg2.jpg6.jpg5.jpg

Updated Date - Feb 12 , 2026 | 03:00 AM