Share News

సమయానికి రారు.. సమాచారం ఇవ్వరు!

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:33 AM

సీఎం, మంత్రులతో సమీక్షలు, సమావేశాలకు సంబంధించి.. ఐఏఎస్‌ల నిర్లక్ష్యంపై అటు సచివాలయంలో, ఇటు విభాగాధిపతుల కార్యాలయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కనీసం ప్రాథమిక సమాచారం కూడా లేకుండానే ..

సమయానికి రారు.. సమాచారం ఇవ్వరు!

  • కొందరు ఐఏఎస్‌ల నిర్లక్ష్యంపై విమర్శలు

  • కనీస సమాచారం లేకుండానే సమీక్షలకు

  • భేటీల్లోనే ఎజెండా, ప్రణాళికపై హైరానా

  • సీఎం హెచ్చరించినా మారని తీరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సీఎం, మంత్రులతో సమీక్షలు, సమావేశాలకు సంబంధించి.. ఐఏఎస్‌ల నిర్లక్ష్యంపై అటు సచివాలయంలో, ఇటు విభాగాధిపతుల కార్యాలయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కనీసం ప్రాథమిక సమాచారం కూడా లేకుండానే శాఖాపరమైన సమీక్షలు, సమావేశాలకు హాజరవడం.. మంత్రులు, సీఎస్‌ వంటివారు ఏవైనా వివరాలు అడుగుతారేమో, ముందే సిద్ధమవ్వాలన్న ఆలోచన లేకపోవడం.. భేటీలో ఏవైనా వివరాలు అడిగితే హైరానాపడడం కొందరు ఐఏఎ్‌సలకు అలవాటుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్షలు, సమావేశాలకు చేతులూపుకొంటూ వచ్చి, భేటీలో ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే అప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులను సంప్రదించి, వారిని హడావుడి పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఏ శాఖపై సమీక్ష జరిగితే.. ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు (హెచ్‌వోడీ) సంబంధిత ఎజెండా అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలి. కనీసం ప్రాథమిక సమాచారమైనా వారి వద్ద ఉండాలి. ఆ సమాచారాన్ని పీపీటీల రూపంలో తయారు చేసి పెట్టుకోవాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే.. దానికి సంబధించిన ప్రణాళిక, కార్యాచరణ, వనరులు, యంత్రాంగం వంటి పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలి.

సీఎం, మంత్రులు, సీఎస్‌ అడిగినప్పుడు ఆ ప్రణాళికను ఎలా అమలు చేయవచ్చో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వివరించగలగాలి. కానీ.. కొందరు అధికారులు సమావేశాలు, సమీక్షలకు పూర్తి సమాచారంతో రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఉదాహరణకు.. ట్రాఫిక్‌ సమస్యలు, పరిష్కారాలపై ఇటీవల సచివాలయంలో సీఎస్‌ వద్ద ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దీనికి పురపాలక, పట్టణాభివృద్ధి, పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. కానీ... వారి వద్ద సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రతిపాదినలు, ప్రణాళికలు, సమాచారం ఏవీ లేవని.. సమావేశానికి వచ్చిన తర్వాత సమస్యపై ఆ అధికారులు చర్చించుకోవడం కనిపించిందని సమాచారం. దీంతో సీఎస్‌ సంజయ్‌ జాజు వారిపై సీరియస్‌ అయ్యారని.. ఎలాంటి సమాచారం, పక్కా ప్రణాళిక లేకుండా ఎందుకు వచ్చారంటూ మందలించినట్లు తెలిసింది. కేంద్ర సర్వీసుల్లో సుదీర్ఘ కాలం పాటు పని చేసి, ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన జాజు.. కేంద్ర ప్రభుత్వ సమావేశాలు, సమీక్షల గురించి అధికారులకు వివరించారట. అక్కడ జరిగే సమీక్షలు, సమావేశాలకు మూడు రోజుల ముందే సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో ప్రణాళికను పంపిస్తారని చెప్పారట. ఇక్కడ మూడు రోజులు ముందు కాకపోయినా.. కనీసం సమావేశం రోజైనా సిద్ధమై రాకుండా, సమావేశంలోనే హైరానా పడడం, చర్చించుకోవడమేమిటని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇలాగే అధికారులను అప్రమత్తం చేశారు. సమావేశాలు, సమీక్షలకు వచ్చే ముందు ఐఏఎస్‌ అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో రావాలని చెప్పారు. ఇలా సీఎం హెచ్చరించినా, సీఎస్‌ మందలించినా... ఐఏఎ్‌సలలో మార్పు రావడం లేదన్న అభిప్రాయాలున్నాయి.

సమయానికి రారు..

సమాచారం మాట అటుంచితే... కొంత మంది అధికారులు సమయ పాలన కూడా పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సీఎం, మంత్రులు, సీఎస్‌ సమావేశాలకు కొంత మంది ఐఏఎ్‌సలు ఆలస్యంగా వస్తున్నారని చెబుతున్నారు. నిజానికి ఆయా భేటీలు ప్రారంభం కావడానికి ముందే ఐఏఎస్‌ అధికారులు సచివాలయానికి చేరుకోవాలి. కానీ.. కొంతమంది ఐఏఎ్‌సలు సీఎం, సీఎస్‌ వచ్చి కూర్చున్న తర్వాత నిదానంగా వస్తున్నారని సమాచారం. ఇటీవల మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై సీఎస్‌ వద్ద జరిగిన సమీక్ష సమావేశానికి ఒక శాఖ ముఖ్య కార్యదర్శి ఆలస్యంగా వచ్చారు. సీఎస్‌ ఆయనను ప్రశ్నించగా... మంత్రి పిలిస్తే వెళ్లానని ఆయన సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘అర్జెంట్‌ అయితే తప్ప సమావేశానికి ఆలస్యంగా రావొద్దు’ అని సీఎస్‌ ఆయనకు చెప్పారు.

Updated Date - Jul 29 , 2026 | 08:33 AM