తెలంగాణ రహదారుల విస్తరణకు రూ.7,597 కోట్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:16 AM
తెలంగాణలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధికికేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-63, 563లను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.....
రెండు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
190.76 కిలోమీటర్ల పొడవున విస్తరణకు క్యాబినెట్ ఆమోదం
ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల,
జగిత్యాల-కరీంనగర్ రోడ్ల విస్తరణ
అధునాతన పద్ధతిలో నిర్మాణం
10 వేల కోట్లతో విమాన ఇంధన స్థిరీకరణ నిధి ఏర్పాటుకు క్యాబినెట్ ఓకే
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధికికేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-63, 563లను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ మెగా ప్రాజెక్టును రూ.7,597.16 కోట్ల భారీ అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. జనసాంద్రత, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు బైపాస్‌లు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన డిజైన్లు, ఓపెన్ టోలింగ్ విధానం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో ఈ రహదారుల విస్తరణ కీలక మైలురాయిగా నిలవనుంది.
ఆర్మూర్-జగిత్యాల మధ్య..
జాతీయ రహదారి-63 అభివృద్ధిలో భాగంగా.. ఆర్మూర్-జగిత్యాల మధ్య మొత్తం 63.600 కిమీల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా సాగే ఈ రహదారిలో అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల గుండా ప్రయాణం నరకంగా ఉంది. విస్తరణతో ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. ఈ దారి పొడవు 63.600కిమీలు కాగా 17.95 కిమీలు బ్రౌన్‌ఫీల్డ్ రహదారి (ఇప్పటికే ఉన్న రహదారిని విస్తరణ). మరో 45.65 కిమీల మేర కొత్త (గ్రీన్‌ఫీల్డ్)రహదారి నిర్మిస్తారు. ఖర్చు రూ.2,471.76కోట్లు. ఇందులో సివిల్ పనులకు రూ.1,266.58కోట్లు, భూసేకరణ, ఇతరాలకు రూ.504.26 కోట్లు ఖర్చు చేస్తారు. పనులను హ్యామ్ పద్ధతిలో చేపడతారు.
జగిత్యాల-మంచిర్యాల నడుమ..
జాతీయ రహదారి 63లోనే జగిత్యాల-మంచిర్యాల నడుమ 68.295 కిమీల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. ఇది జగిత్యాల, మంచిర్యాల జిల్లాలను కలుపుతుంది. కొత్త రహదారితో బొగ్గు గనులు, పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సులువవుతుంది. ఈ రహదారిలో బ్రౌన్‌ఫీల్డ్ కేవలం 2.05 కిమీలు. గ్రీన్‌ఫీల్డ్ రికార్డు స్థాయిలో 66.1 కిమీలు ఉంది. ఖర్చు రూ.2,730.72కోట్లు. సివిల్ పనులకు రూ.1,477.17 కోట్లు, భూసేకరణకు రూ.436.93కోట్లు కేటాయించారు. దీన్ని కూడా హ్యామ్ విధానంలోనే నిర్మిస్తారు.
జగిత్యాల-కరీంనగర్ నడుమ..
మూడో ప్యాకేజీ కింద.. జాతీయ రహదారి 563లో జగిత్యాల-కరీంనగర్‌ల నడుమ 58.866 కిమీల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ రహదారిలో 24.14 కిమీలు బ్రౌన్‌ఫీల్డ్ కాగా.. 34.96 కిమీల మేర కొత్త రహదారిని నిర్మిస్తారు. ఖర్చు రూ.2,394.68 కోట్లు కాగా, సివిల్ పనులకు రూ.1,455.01 కోట్లు, భూసేకరణకు రూ.394.53 కోట్లు వెచ్చించనున్నారు. ఈ విభాగాన్ని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ టోల్ (బీవోటీ టోల్) పద్ధతిలో 20 సంవత్సరాల రాయితీ కాలంతో (2.5 సంవత్సరాల నిర్మాణ కాలంతో కలిపి) చేపట్టనున్నారు. కాగా.. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ సూచనలకు అనుగుణంగా బహుముఖ ప్రయోజనాలను చేకూర్చేలా ఈ రహదారుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, వరంగల్ అర్బన్ సెజ్‌లు, నిజామాబాద్, సిద్దిపేట మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్ల ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్ వంటి ఐదు ఆర్థిక నోడ్‌లకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుంది. అలాగే, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంతోపాటు నాగునూర్ కోట, లోయర్ మానేరు డ్యామ్, ఖిల్లా కోట వంటి ఏడు సామాజిక నోడ్‌లకు ప్రయాణం సౌకర్యవంతం కానుంది. నిజామాబాద్, లింగంపేట్/జగిత్యాల, పెద్దపల్లి, కోరుట్ల, మంచిర్యాల, పొద్దూరు, గంగాధర, కరీంనగర్ వంటి 10 కీలక రైల్వే స్టేషన్ల (లాజిస్టిక్ నోడ్‌లు) అనుసంధానంతో సరకు రవాణా వేగవంతమై దేశ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మెరుగుపడుతుంది. ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంటన్నరపాటు.. జగిత్యాల-కరీంనగర్ మధ్య 45 నిమిషాలు తగ్గనుంది. ఈ భారీ నిర్మాణ పనుల ద్వారా స్థానికంగా 34.43 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి, 42.7 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి లభించనుంది.
కేంద్రానికి బండి కృతజ్ఞతలు
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563లను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.7,597 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఉత్తర తెలంగాణ ప్రజలకు శుభవార్త అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. ఈ రహదారుల విస్తరణతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు సరుకు రవాణా వేగవంతమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల కాలం పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ చరిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.