Share News

ఎకరం రూ.237 కోట్లభూమి వేలంపై స్టే

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:13 AM

ఇటీవల రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన భూమి వేలం, భూమి అందజేత ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు ఎలాంటి చర్యలు ...

ఎకరం రూ.237 కోట్లభూమి వేలంపై స్టే

  • ఎస్బీఐ పిటిషన్‌తో 3 వారాల పాటు తదుపరి చర్యలు వద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన భూమి వేలం, భూమి అందజేత ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)లను ఆదేశించింది. వివరణ తెలియజేయాలంటూ వేలంలో భూమి దక్కించుకున్న గౌరా వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలోని ఈ భూమిని ఉమ్మడి రాష్ట్రం లో తమకు కేటాయించారని, తమ పొజిషన్‌లో ఉన్న భూమిని వేలం వేయడం చెల్లదంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) హైకోర్టులో వేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం-టీజీఐఐసీ, ఎస్బీఐ న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభు త్వం, టీజీఐఐసీ న్యాయవాదులకు ప్రశ్నలు సంధించింది ‘భూములు అమ్ముకుని డబ్బు సంపాదించడమే ప్రభుత్వం ప్రధాన వృత్తా? భూములు కేటాయించేది ఉద్యోగాల సృష్టి కోసం కాదా? ప్రస్తుత భూమిని వేలం వేసిన ఉద్దేశమేంటి? ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా రెండున్నర ఎకరాలు కేటాయిస్తామని ప్రభు త్వం, టీజీఐఐసీ చెప్తోంది. దీనికి ఎస్బీఐ అంగీకరించిందా? ఎస్బీఐ అంగీకరించినట్లు ఆధారా లు ఏమున్నాయి? భవన నిర్మాణాలకు ఎస్బీఐకి ప్రభుత్వ విభాగాలు ఎప్పుడు అనుమతులు ఇచ్చాయి?’ అని ప్రశ్నించింది. గౌరా వెంచర్స్‌ సదరు భూమితో ఏం చేస్తుందని, అది రియల్‌ ఎస్టేట్‌ కంపెనీయే కదా అడిగింది. ప్రభుత్వ న్యాయవాదులు సమాధానమిస్తూ ప్రజాప్రయోజనం కోసం పారద్శకంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ వేలం ద్వారా భూమి అమ్మినట్లు పేర్కొన్నారు.


తొలుత టీజీఐఐసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ నిరంజన్‌ రెడ్డి వాదనలు మొదలుపెట్టారు. ‘పరిశ్రమలు, వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2010లో అప్పుడు ఉన్న మార్కెట్‌ ధరలో మూడో వంతుకు ఎకరం రూ.13.33 కోట్లకు ఎస్బీఐకి ప్రభుత్వం, టీజీఐఐసీ భూమి కేటాయించింది. రెండేళ్లలో ఎస్బీఐ తలపెట్టిన కార్పొరేట్‌ కార్యాలయ నిర్మాణాలు పూర్తి చేయాలన్న షరతు ఉంది. లేదంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా భూకేటాయింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి, టీజీఐఐసీకి ఉంది. తాజాగా అదే ప్రాంతంలో రూ.500కోట్ల విలువైన రెండున్నర ఎకరాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవడానికి ఎస్బీఐ ప్రతినిధి మౌఖికంగా అంగీకరించారు. దీంతో పాటు ఎస్బీఐకి టీజీఐఐసీ, ప్రభుత్వం పంపిన ఈ-మెయిల్‌ విషయాన్ని ఎస్బీఐ ఎందుకు దాచింది? ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమే’నని పేర్కొన్నారు. ‘16 ఏళ్లపాటు నిర్మాణాలు చేపట్టకుండా ఉంటే ఊరుకుంటారా అని అడిగారు. మూడు ఏటీఎంలు, సెక్యూరిటీ గార్డుల కోసం రూ.1,100 కోట్లు విలువైన భూమి అవసరమా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్లు నచ్చిన బెంచ్‌ వద్దకు వచ్చేందుకు ఎస్బీఐ ‘బెంచ్‌ హంటింగ్‌’కు పాల్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ తేరా రజినీకాంత్‌ రెడ్డి వాదించారు. ‘ప్రభుత్వం ఎవరికీ ఉచితంగా, రాయితీపై భూములు కేటాయించరాదని, బహిరంగ వేలం ద్వారానే విక్రయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టని, ఉద్యోగాలు కల్పించని పరిశ్రమల భూములు తిరిగి తీసుకోవాలని ఇదే హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దాన్నే మేం అమలు చేస్తున్నాం. పంచనామా చేసి ఎస్బీఐ వద్ద నుంచి భూమి స్వాధీనం చేసుకున్నాం. గౌరా వెంచర్స్‌కు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌(ఎల్‌వోఏ) ఇచ్చేశామ’ని కోరారు.


ఎస్బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, వెంకట్రామన్‌ వాదించారు ‘ప్రభుత్వం ఎస్బీఐకి అవకాశం ఇవ్వలేదు. ఐకియా, ఫోనిక్స్‌, డెలాయిట్‌ వంటి సంస్థలు నిర్మాణాలు చేపట్టడానికి అడిగినంత గడువు ఇచ్చారు. తమకు మాత్రం 2021లో భూకేటాయింపు రద్దు చేశారు. ఆరేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్బీఐ చేసిన న్యాయ పోరాటంలో అన్నిసార్లు ఎస్బీఐనే గెలిచింది. వేలం ఆపాలని ఎస్బీఐ కోర్టును ఆశ్రయించిందని.. ఆ పిటిషన్‌ విచారణకు వస్తుందని తెలిసి.. పబ్లిక్‌ హాలిడే రోజైన బక్రీద్‌నాడు వేలం నిర్వహించారు. దీన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించింది టీటీఐఐసీ, ప్రభుత్వం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ ఐదెకరాల భూమికి ప్రత్యామ్నాయంగా రెండున్నర ఎకరాల భూకేటాయింపు ప్రతిపాదనకు ఎస్బీఐ మౌఖికంగా అంగీకరించినట్లు చెబుతున్నది అబద్ధమని చెప్పారు. వేలం వేసిన తర్వాత మెయిల్‌ పెడితే అంగీకరించినట్లు అవుతుందా?అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్నారు. కాగా తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jun 19 , 2026 | 03:13 AM