మా అనుమతి లేకుండాకూల్చివేతలొద్దు!
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:34 AM
జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలను తమకు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది....
ఎస్‌వోపీ మార్గదర్శకాలు సమర్పించేవరకూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టవద్దు
ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తోంది
అమీన్‌పూర్ కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలను తమకు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని పేర్కొంది. అయితే చెరువుల పునరుద్ధరణ, నాలాలు, రోడ్ల ఆక్రమణల తొలగింపు వంటి పనులు చేయవచ్చని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 165, 166 తదితరాల్లో ఉన్న 36 ఎకరాల్లో జరుగుతున్న కూల్చివేతలపై యథాతథ స్థితి పాటించాలని హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది. హైడ్రా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిందని పేర్కొంటూ ఎంఏ షరీఫ్ హైకోర్టులో సోమవారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ శనివారం ఉదయం 4.30 గంటలకు భారీగా సిబ్బందితో హైడ్రా, రెవెన్యూ, పోలీసు విభాగాలు కూల్చివేతలు ప్రారంభించాయని తెలిపారు.
వెయ్యి ఎకరాల ఆక్రమణ
అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. కోర్టు ఉత్తర్వుల పేరుతో పిటిషనర్ వెయ్యి ఎకరాలు ఆక్రమించారని, ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చిందని పేర్కొన్నారు. అక్కడ జరిపిన నిర్మాణాలకు అనుమతులు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్న వీడియోలు పరిశీలించామని.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం ఆందోళనకరమని పేర్కొంది. ‘అంత పెద్ద నిర్మాణాలు చేపట్టడానికి అసలు అనుమతులు ఎలా ఇచ్చారు? నిర్మాణాలు జరిగిన తర్వాత అవి అక్రమమని, ప్రణాళికకు విరుద్ధంగా నిర్మించారంటే ఎలా? అక్రమ నిర్మాణాలు అయినా సరే సహజ న్యాయసూత్రాలు పాటించాలి. అంత పెద్ద నిర్మాణాలు కూలుస్తున్న దృశ్యాలు చూడటం బాధాకరంగా ఉంది. ఏదో యుద్ధం జరుగుతున్నట్లు హైడ్రా ప్రవర్తిస్తోంది. నిబంధనలు, మార్గదర్శకాలకు హైడ్రా కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. కూల్చివేతలపై యథాతథ స్థితి విధిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మరో కేసులో.. కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలో కొన్ని ప్లాట్లకు హైడ్రా కంచె వేసి బోర్డు పెట్టడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులు కోర్టులు పెండింగ్‌లో ఉండగా కంచె వేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి కదా? అని హైడ్రాను పశ్నించింది. బోర్డును 48 గంటల్లో తొలగించాలని యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
చెరువును ఆక్రమించి ఒవైసీ కాలేజీ నిర్మాణం!
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా కాలేజీని సల్కం చెరువు పరిధిలోని భూమిలో నిర్మించినట్లు స్పష్టమవుతోందని, ఉపగ్రహ చిత్రాలు దీనిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ కాలేజీలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, 2026 విద్యాసంవత్సరానికి ఆ కాలేజీ ప్రవేశాలు కోర్టు ఇచ్చే తీర్పుతో ప్రభావితం అవుతాయని స్పష్టం చేసింది. సల్కం చెరువులో తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, సలార్ ఈ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ను తొలగించాలని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. మున్సిపల్‌శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకోవాలని, చెరువును నోటిఫై చేసి, ఆక్రమణలను గుర్తించాలని ఆదేశించింది.