బహదూర్‌గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:50 PM
శంషాబాద్ మండలం, బహదూర్‌గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బహదూర్‌గూడ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
హైదరాబాద్, జులై 20: శంషాబాద్ మండలం, బహదూర్‌గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బహదూర్‌గూడ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాలు తమవేనంటూ నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది. సర్వే నంబర్లు 3, 4లో ఉన్న 28 ఎకరాల భూమిలో పిటిషనర్లు 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పిటిషనర్లుగా ఉన్న నలుగురు రైతుల పాస్ పుస్తకాల్లో అధికారుల సంతకాలు లేవని, కొన్నేళ్లుగా అక్కడ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టే తమ భూమి అంటున్నారని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఆ భూమి ప్రభుత్వ భూమి అని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నలుగురు రైతుల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.