Share News

ప్రభుత్వ ఉద్యోగాలకు..వయో పరిమితి పెంపు

ABN , Publish Date - May 20 , 2026 | 03:45 AM

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు..వయో పరిమితి పెంపు

  • జనరల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచిన సర్కారు

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 49 ఏళ్లు.. దివ్యాంగులకు 54 ఏళ్లు

  • ఏడాది పాటు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తింపు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచింది. గతంలో పెంచిన వయో పరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో... తాజాగా మళ్లీ పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. ‘తెలంగాణ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌’లోని 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ఠ వయో పరిమితి వర్తిస్తుంది. పోలీసు, ఎక్సైజ్‌, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ తదితర యూనిఫాం సర్వీసుల్లోని ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 8న వయోపరిమితిని పెంచింది. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. మళ్లీ పదేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా ఈ నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఇటీవల శాసనసభ, మండలి విప్‌లు సీఎం రేవంత్‌ను కలిసి ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచాలని కోరారు. ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్‌ కూడా డిప్యూటీ సీఎం భట్టిని కలిసి ఇదే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

Updated Date - May 20 , 2026 | 03:45 AM