Share News

కనీస వేతనాలు పెంచాం

ABN , Publish Date - May 22 , 2026 | 04:07 AM

రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం వారి కనీస వేతనాలను పెంచామని, దీంతో, కోటీ 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

కనీస వేతనాలు పెంచాం

  • కార్మికులకు ఇది మేడే కానుక.. 1.11 కోట్ల మందికి ప్రయోజనం: సీఎం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం వారి కనీస వేతనాలను పెంచామని, దీంతో, కోటీ 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కనీస వేతనాల పెంపు కోసం నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘పరిశ్రమల యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, కార్మికులతో చర్చించి వేతనాలు పెంచాం. కార్మికులను నాలుగు విభాగాలుగా చేశాం. వారిని జోన్లవారీగా విభజించాం. గతంలో అర్బన్‌, రూరల్‌ జోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్లున్న ప్రాంతాలను జోన్‌-1గా, మున్సిపాలిటీల పరిధిలోనివి జోన్‌-2గా, గ్రామీణ ప్రాంతాలను జోన్‌-3గా విభజించాం. దీని ప్రకారం అన్‌స్కిల్డ్‌ వారికి కనీస వేతనం గతంలో రూ.12,750 ఉంటే రూ.16 వేలు చేశాం. సెమీ స్కిల్డ్‌ వారికి రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్‌ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్‌ వారికి రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచాం’’ అని వివరించారు. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల పెరుగుదల, ఇంటి అద్దెలతోపాటు అన్ని అంచనాలను పరిశీలించాకే వేతనాలను పెంచామన్నారు. పెంచిన వేతనాలు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఇది ఒకరకంగా మేడే కానుకని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం ఇది మొదటి నిర్ణయం. గత ప్రభుత్వ హయంలో దీనిని వదిలేసింది. పెంచిన వేతనాలు సరిగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు ఉంటాయి’’ అని వివరించారు. ఇక్కడ కంపెనీలుపెట్టే వారికి తెలంగాణ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నామని చెప్పారు.


ఏఐ తుపానులో కొట్టుకుపోనున్న అమెరికా

‘‘ఏఐ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఏఐ తుపానులో అమెరికాలాంటి దేశం కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ, బ్లూ కాలర్‌ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్‌ చేయలేదు. అమెరికాలాంటి దేశంలో ఉపయోగపడ్డ మనవాళ్ల నైపుణ్యాలు.. జర్మనీ, జపాన్‌, సింగపూర్‌ లాంటి దేశాల్లో మరింత అవసరం. కేవలం కంప్యూటర్‌, ఐటీ, అమెరికానే భవిష్యత్తు అనుకోవద్దు. అమెరికా కంటే మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ఇతర దేశాలు చాలా ముందున్నాయి. నైపుణ్యంతో ఉన్న యువత మనదగ్గర ఎక్కువ’’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. యువత నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేశామని, టాటా సంస్థ సహకారంతో వివిధ రంగాలు, విభాగాల్లో నైపుణ్య పెంపు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలున్న వారికి నెలకు రూ.2లక్షల వరకు వేతనం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే, యువత సాంకేతికతపై దృష్టి సారించాలని సూచించారు.

గల్ఫ్‌ ఏజెంట్లుగా చేసిన వారు పెద్ద పోస్టుల్లో..

గతంలో గల్ఫ్‌ ఏజెంట్లుగా చేసిన చాలామంది పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చారని, అభివృద్ధి పథంలోకి వెళ్లారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల బారిన పడకుండా, వారి చేతుల్లో మోసపోకుండా త్వరలో ప్రత్యేక పాలసీ తీసుకువస్తామన్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక పాలసీ తీసుకురాబోతున్నట్టు తెలిపారు. దేశంలో ఎన్నికలు పూర్తవ్వగానే మోదీ ఇంధన ధరలు పెంచారని, తమకు మాత్రం కార్మికుల సంక్షేమమే ముఖ్యమని స్పష్టంచేశారు. యుద్ధం, ప్రజల సమస్యలను మోదీ రాజకీయ కోణంలోనే చూస్తారని అన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని, కానీ, భవిష్యత్తే ప్రధాన అంశంగా తాము ముందుకెళ్తున్నామని తెలిపారు.

సింగరేణిలో 80 శాతం స్థానికులే: వివేక్‌

రాష్ట్రంలో ఉన్న కార్మికులకు కనీస వేతనాలను సవరించామని, దాదాపు కోటి 11 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివేక్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కార్మికుల కనీస వేతన అంశాన్ని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో అన్‌స్కిల్డ్‌ 75 లక్షల మంది, సెమీ స్కిల్డ్‌ 21 లక్షలు, స్కిల్డ్‌ 15.64 లక్షల మంది ఉన్నారని తెలిపారు. అలాగే, సింగరేణిలో 80 శాతం స్థానిక యువతకే ఉద్యోగ అవకాశం ఇచ్చేలా సీఎం రేవంత్‌ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అలాగే, భవిష్యత్‌లో సింగరేణిలో పని చేసే వారి వేతనాలు కూడా పెంచే అంశంపై ఆలోచిస్తున్నామని, త్వరలో దీనిపై నిర్ణయం తీసకుంటామని అన్నారు.

Updated Date - May 22 , 2026 | 04:07 AM