Share News

టీవీపీపీ ఆస్పత్రుల అభివృద్ధి

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:46 AM

రాష్ట్రంలోని సెకండరీ హెల్త్‌కేర్‌ హాస్పిటళ్లను కేంద్రప్రభుత్వం నిర్దేశించిన ‘ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌(ఐపీహెచ్‌ఎ్‌స)’ మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు

టీవీపీపీ ఆస్పత్రుల అభివృద్ధి
damodara

  • జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ లక్ష్యం

  • టీవీపీపీ ఆస్పత్రులపై సమీక్షలో మంత్రి దామోదర

హైదరాబాద్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సెకండరీ హెల్త్‌కేర్‌ హాస్పిటళ్లను కేంద్రప్రభుత్వం నిర్దేశించిన ‘ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌(ఐపీహెచ్‌ఎ్‌స)’ మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ లక్ష్య సాధనలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అందుకే ప్రతి హాస్పిటల్‌లో అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, తగినన్ని మందులు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం హాస్పిటళ్లలో ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, ఐపీహెచ్‌ఎస్‌ ప్రమాణాల ప్రకారం అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూసి, లోటుపాట్లను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న పోస్టులను అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు, అదనంగా అవసరమైన పోస్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం, సెక్రటేరియట్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌(టీవీవీపీ) పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సూచనలు చేశారు. ఏ హాస్పిటల్‌లో ఏ స్పెషలిస్ట్‌ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి? ఏయే విభాగాల్లో వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది అవసరం ఉంది? ఏయే వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్‌ సదుపాయాలు కల్పించాల్సి ఉంది? అనే అంశాలపై హాస్పిటళ్ల వారీగా సమగ్ర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆంకాలజిస్ట్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 07:03 AM