తారాలోకంతో కరువుపై చైతన్యం!
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:50 AM
ఎల్‌నినో రక్కసి తెచ్చిన కరువు పరిస్థితులు.. నీటికి, విద్యుత్‌కు కటకట.. దేనికైనా పొదుపు మంత్రమే పరిష్కారం.. ప్రభుత్వం, ప్రకటనలు చేసినా, నేతలు పిలుపు ఇచ్చినా చూపే ప్రభావం ఓ మోస్తరు మాత్రమే..
ఎల్‌నినో ప్రభావంపై సినీనటులతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ
మరోవైపు కళాజాతాలతో పల్లెల్లో ప్రదర్శనలు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో రక్కసి తెచ్చిన కరువు పరిస్థితులు.. నీటికి, విద్యుత్‌కు కటకట.. దేనికైనా పొదుపు మంత్రమే పరిష్కారం.. ప్రభుత్వం, ప్రకటనలు చేసినా, నేతలు పిలుపు ఇచ్చినా చూపే ప్రభావం ఓ మోస్తరు మాత్రమే.. అదే జనంలో ఆకర్షణ ఉండే సినీతారలతో చెప్పిస్తే.. వారితో సందేశాలతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. చైతన్యం కలిగించగలిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర సర్కారు ఇప్పుడా దిశగానే అడుగులు వేస్తోంది. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు టాలీవుడ్‌ను రంగంలోకి తెస్తోంది. నీరు, విద్యుత్ పొదుపు, భూగర్భ జలాల సంరక్షణ, వనరుల సమర్థ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా.. సినీహీరోలు, హీరోయిన్‌లు, ప్రముఖులతో సందేశాలను రూపొందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సందేశాలను సినిమాహాళ్లు, ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్‌మీడియా వేదికల ద్వారా ప్రచారం చేయనుంది. ఇప్పటికే నటుడు నాగార్జున ఒక అంశంపై తన సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం అది ఎడిటింగ్ దశలో ఉందని, త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక నటుడు విజయ్ దేవరకొండ తన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై సందేశం ఇచ్చారు. మరికొందరు సినీహీరోలు, హీరోయిన్లతోనూ సందేశాలు ఇప్పించేలా టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ బాధ్యతను తీసుకున్నారు. ఆ సందేశాలకు స్ర్కిప్ట్, ఏయే విఽభాగాల్లో సందేశాలు కావాలనే వివరాలను ఆ డైరెక్టర్‌కు చలనచిత్ర అభివృద్ధి మండలి అందించినట్టు తెలిసింది.
కొందరు నటీనటులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే సందేశాలు విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సాంస్కృతిక సారథి నేతృత్వంలోనూ పల్లెల్లో కళాజాతాలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్‌నినో పరిస్థితి, వర్షాభావం, పంట నష్టాలు, కరెంటు ఆదా, నీటి పొదుపు, పంటల మార్పిడి అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో అధికారులకు సీఎం రేవంత్ ప్రత్యేకంగా సూచనలు చేసిన విషయం తెలిసిందే.