Share News

యాప్‌ల ద్వారానే ఎరువులు కొనండి.. రైతులకు అవగాహన కల్పించిన రైతునేస్తం

ABN , Publish Date - Sep 01 , 2026 | 10:02 PM

రైతునేస్తం105వ ఎపిసోడ్‌లో రైతులకు ఎరువుల యాప్‌లు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. యాప్‌ల ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

యాప్‌ల ద్వారానే ఎరువులు కొనండి.. రైతులకు అవగాహన కల్పించిన రైతునేస్తం

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు(మంగళవారం) జరిగిన కార్యక్రమంలో రైతులకు ఎరువుల సరఫరాపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళవారం నిర్వహించే కార్యక్రమం నేటితో 105వ ఎపిసోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ అవగాహన కార్యక్రమంలో రైతులకు ఎరువుల సరఫరాపై అవగాహన కల్పించారు. ఎరువుల కొనుగోలును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఎరువుల యాప్ ఎఫ్‌ఎఫ్ఎస్(Framework for Fertilizer Sale) ద్వారానే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ యాప్‌తో ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.

కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టే లక్ష్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ కొత్త యాప్‌ల ద్వారా ఎరువులను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ యాప్‌ల వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. అంతేకాకుండా, సన్నరకాల విత్తన కొనుగోలు వివరాలను డీలర్ల వద్ద ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాలని రైతులకు తెలియజేశారు. నమోదు చేయని యెడల సన్నరకాల ధాన్యానికి అందించే రూ.500 బోనస్ వర్తించదని తెలిపారు. డీలర్ల వద్ద కొనకుండా సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు స్వీయ ధృవీకరణ ఇవ్వాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు.. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో తక్కువ వర్షపాతం ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో నీటి వనరులను మితంగా వినియోగించాలని, భూగర్భ జలవనరులపై ఎక్కువగా ఆధారపడకూడదని రైతులకు సూచించారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన 10 జిల్లాల్లో బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని.. ఇప్పటివరకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా 59.78 లక్షల బస్తాల యూరియా బుకింగ్ కాగా, 41.68 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ ద్వారా ఇప్పటివరకు 33.97 లక్షల మంది రైతులు 141.93 లక్షల బస్తాల యూరియాను బుకింగ్ చేసుకోగా, 128.93 లక్షల యూరియా బస్తాల కొనుగోలు జరిగిందని వెల్లడించారు.

Updated Date - Sep 01 , 2026 | 10:02 PM