Share News

రాష్ట్రంలో ఈవీల జోరు!

ABN , Publish Date - May 20 , 2026 | 03:13 AM

తెలంగాణలో ఇప్పుడు విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం భారీగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్లు ఇప్పుడు రోడ్లపై గతం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఈవీల జోరు!

  • విద్యుత్తు వాహనాల అమ్మకాల్లో గణనీయ పెరుగుదల

  • గత ఆర్థిక సంవత్సరంలో 19 వేల కార్ల రిజిస్ట్రేషన్‌

  • ద్విచక్ర వాహనాల్లో 10 శాతం, కార్లలో 400 శాతం వృద్ధి

  • 47 రోజుల్లోనే 9,745 టూవీలర్లు; 3,409 కార్ల రిజిస్ట్రేషన్‌

  • తెలంగాణ విద్యుత్తు విధానానికి తోడు చార్జింగ్‌ స్టేషన్ల వంటి

  • మౌలిక సదుపాయాలు పెరగడమే కారణమంటున్న డీలర్లు

  • ఏడాదిన్నరలో రాష్ట్రంలో రూ.1090 కోట్ల పన్ను మినహాయింపు

  • తాజాగా పెట్రో ధరల పెరుగుదలతో ఈవీలవైపు మొగ్గు

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇప్పుడు విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం భారీగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్లు ఇప్పుడు రోడ్లపై గతం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లు నాలుగు రెట్లు పెరిగాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. 2025-26లో నెలకు సగటున 1,575 కార్ల రిజిస్ట్రేషన్‌ జరగగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ సంఖ్య రెండు వేల వరకూ చేరింది. మే నెలలో ఇప్పటికే 1500 వరకూ కార్ల రిజిస్ట్రేషన్‌ జరగడం విశేషం. ఇక, 2024-25లో కేవలం 5 వేలలోపు ఈవీ కార్ల రిజిస్ట్రేషన్‌ జరిగితే.. 2025-26లో 19 వేల వరకూ కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే, దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఇవన్నీ సొంత కార్లు. కాగా టాక్సీ కార్లు 2024-25లో 827, 2025-26లో 1,349 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. వీటిలో ఒకటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్తు వాహన విధానం. పర్యావరణంపై వాహన కాలుష్య ఉద్గారాల ప్రభావం తగ్గించేందుకు ఈవీలపై రిజిస్ట్రేషన్‌ పన్ను (రోడ్‌ ట్యాక్స్‌)ను వంద శాతం మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఈవీల కొనుగోలుకు ఊతమిచ్చింది. పన్ను మినహాయింపుతో కారు విలువను బట్టి రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు, ద్విచక్ర వాహనాలపై రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు కొనుగోలుదారులకు ఆదా అవుతోంది. ఏడాదిన్నరలో ఈవీలు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ పన్ను మినహాయింపుతో రూ.1018 కోట్ల లబ్ధి కలిగిందని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత నెలన్నరగా ఈవీల కొనుగోలుతో పొందిన లబ్ధి మరో రూ.70 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. ఇక, గతం కంటే చార్జింగ్‌ స్టేషన్లు, వాహనాల రేంజ్‌ పెరిగింది. సుప్రసిద్ధ లగ్జరీ కార్ల కంపెనీలు 500 కిలోమీటర్లకుపైనే రేంజ్‌ ఇస్తున్నాయి. ఫాస్ట్‌ చార్జింగ్‌ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈవీ వాహనాలు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో, ఈవీలపై సందేహాలుండేవి. ఇప్పుడు ప్రమాదరహిత వాహనాలు రావడమే కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈవీలు మార్కెట్లోకి వస్తున్నాయి.


తాజాగా, ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలు.. పొదుపు చర్యల్లో భాగంగా ఈవీలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం పిలుపునివ్వడమూ ఈవీ వాహన కొనుగోళ్లు పెరగడానికి కారణమే. లగ్జరీ కార్లలోనూ ఈవీలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గత నెలన్నర రోజులుగా ఈవీల విక్రయాలు గణనీయంగా పెరిగాయని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మే 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,745 ద్విచక్ర వాహనాలు, 3,409 కార్ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. గతంలో నెలకు టూ వీలర్ల అమ్మకాలు సగటున 5 వేలలోపు ఉండగా ఇప్పుడు అవి 5600లకు పెరిగాయి. గతంలో నెలకు 1,500 వరకు ఈవీ కార్ల రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇప్పుడు సగటున 2000లకుపైగా చేరాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 10 శాతం, కార్ల అమ్మకాలు 400 శాతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్తగా ద్విచక్ర వాహనాలు కొనేవారిలో 30 శాతం వరకూ ఈవీల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారని హిమాయత్‌నగర్‌లోని ఓ షోరూం మేనేజర్‌ తెలిపారు. ఇరాన్‌-అమెరికా యుద్ధం, ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో గత రెండు వారాలుగా కొనుగోళ్లు పెరిగాయని, షోరూంలకు వచ్చి వివరాలు తెలుసుకుంటున్న వారి సంఖ్య అధికమైందని ఓ షోరూం జనరల్‌ మెనేజర్‌ తెలిపారు.

పెట్రో వాత... ఈవీల బాట

పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రజల్లో క్రమంగా పెట్రోలు, డీజిల్‌ వాహనాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈవీలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులతో నడిచే వాహనాల నిర్వహణ , మైలేజీ ఖర్చులు అధికంగా ఉండటం ఇందుకు కారణమే. ఒక కిలోవాట్‌ అవర్‌ చార్జింగ్‌కు ఒక యూనిట్‌ విద్యుత్తు ఖర్చవుతుంది. ఉదాహరణకు, ఓ కంపెనీ కారు సామర్థ్యం 24 కిలోవాట్‌ అవర్‌. దానిని పూర్తిగా చార్జింగ్‌ చేయడానికి 24 యూనిట్లు ఖర్చవుతుంది. అలాగే, మరో కంపెనీ కారు సామర్థ్యం 45 కిలోవాట్స్‌ అనుకోండి. దానిని పూర్తిగా చార్జింగ్‌ చేయడానికి 45 యూనిట్లు ఖర్చవుతుంది. ఈ కారు రేంజ్‌ 500 కిలోమీటర్లు అనుకుంటే.. కిలోమీటరుకు దాదాపు రూపాయి పడినట్లు! అదే బయట చార్జింగ్‌కు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. వెరసి, ఈవీ కారులో ప్రయాణానికి కిలోమీటరుకు రూపాయి నుంచి రూ.2.50 ఖర్చవుతుంది. అదే పెట్రోల్‌ వాహనానికి రూ.7-8; డీజిల్‌ వాహనానికి రూ.5.50-6 వరకూ ఖర్చవుతుంది. సాధారణ పెట్రోల్‌ కారుతో పోలిస్తే ఈవీ ధర కాస్త ఎక్కువే. అయినా, కిలోమీటరుకు ఇంధన వ్యయం; నిర్వహణ ఖర్చులనుపరిగణనలోకి తీసుకుంటే ఈవీలు లాభసాటిగా ఉండటంతో ఇప్పుడు వాటి వెంట పడుతున్నారని అంటున్నారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 400 నుంచి 700 కిలోమీటర్లు.. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే కార్లూ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని, ఈవీలపై ఆసక్తికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. ‘‘ఈవీల అమ్మకాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి.


అలాగని, అవి పెట్రో, డీజిల్‌ వాహనాలను డామినేట్‌ చేస్తున్నాయని చెప్పం. కానీ, అమ్మకాల వాటాపరంగా 10 శాతానికి చేరుకోవడం అద్భుతమే! ఇప్పుడు మార్కెట్‌లో ఈవీలకు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. గతంలో బుక్‌ చేసుకున్న తరువాత 10-15 రోజులకు డెలివరీ అయ్యేది. వాహనం, వేరియంట్‌ను బట్టి ఇప్పుడు 30-60 రోజుల వరకూ సమయం పడుతోంది’’ అని ఈవీలపరంగా తెలంగాణలో మార్కెట్‌ లీడర్‌లలో ఒకటిగా కొనసాగుతున్న ఓ వాహన కంపెనీ డీలర్‌ వివరించారు. తెలంగాణలో ఈవీలపై పన్నులు సున్నా కావడంతో ఎక్కువ మంది లగ్జరీ కార్లు కొంటున్నారని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 108శాతం వృద్ధి కనిపిస్తోందని మాదాపూర్‌లోని ఓ కార్ల డీలర్‌ చెప్పారు. కొత్తగా కట్టే గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా ఇందుకు కారణమన్నారు.

జోరు పెరిగినా, ఇంకా బాలారిష్టాలే?!

ఇటీవలి కాలంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగం పెరిగినా ఇప్పటికీ వీటిపై అపోహలు, సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయని చెబుతున్నారు. ‘‘ఎంతగా ప్రచారం చేసినా ఈవీ కార్లు, బైక్‌లు కొనేది నగరాల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో వీటి విక్రయాలు తక్కువే. హైదరాబాద్‌లో కూడా ఐటీ కారిడార్‌లో ఈవీ మోటర్‌ సైకిల్స్‌, స్కూటర్ల అమ్మకాలు ఎక్కువ. ఈవీ కార్ల అమ్మకాలు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అంటే, అవగాహన ఉన్నవారే కొంటున్నారు. ఇప్పటికీ చాలామందికి ఈవీ వేసుకుని హైవే ఎక్కితే ఎక్కడ ఆగిపోతుందోననే భయం ఉంది’’ అని సుప్రసిద్ధ మోటర్‌ సైకిల్‌ బ్రాండ్‌ సేల్స్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. పైగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల దగ్గర క్యూలు వీటి విక్రయాలను కాస్త వెనక్కి లాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈవీల విక్రయాలు కాస్త నెమ్మదిగా ఉండటానికి చార్జింగ్‌ స్టేషన్ల కొరత, కొన్ని అపార్ట్‌మెంట్‌ అసొసియేషన్లు ఒప్పుకోకపోవడం, ఎంతగా రాయితీలు అందించినా వాహనాల ధరలు అధికంగా ఉండటం, రీ సేల్‌ వాల్యూ తక్కువగా ఉండటం, బ్యాటరీ మార్పిడి ఖర్చులు అధికంగా ఉండటం, ఏ చిన్న సమస్య వచ్చినా అధీకృత డీలర్‌ దగ్గరకే వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఇప్పటికీ ఈవీల అమ్మకాలు ఆశించినంత లేకపోవడానికి కారణాలుగా డీలర్లు చెబుతున్నారు. అయినా, రాబోయే కాలంలో వీటి విక్రయాలు మరింత పెరుగుతాయని, ఈ సంవత్సరాంతానికి ప్రతి పది మోటర్‌ సైకిల్‌, స్కూటర్‌ విక్రయాల్లో 2-3 ఈవీలే ఉండొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 03:13 AM