పీఆర్సీ ఫిట్‌మెంట్ 51శాతం ప్రకటించండి
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:14 AM
తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ)ల నేతలు గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వేర్వేరుగా కలిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు
పెండింగ్ డీఏల్లో మూడింటిని తక్షణమే ఇవ్వండి
బిల్లుల క్లియరెన్స్‌కు నెలకు రూ.2వేల కోట్లు ఇవ్వాలి
సీఎం, స్పీకర్‌ను కోరిన టీజీఈజేఏసీల నేతలు
హైదరాబాద్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ)ల నేతలు గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వేర్వేరుగా కలిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ దామోదర్‌రెడ్డి, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డా.ముజీబ్ తదితరులు స్పీకర్‌ను కలిశారు. మరో టీజీఈజేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్, నేతలు ఎస్.రాములు, పాక రమేశ్, బాణాల రాంరెడ్డి, గరికె ఉపేంద్రరావు... సీఎం, స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పీఆర్సీ చైర్మన్ శివశంకర్ నుంచి పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి, 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగులకు సంబంధించి 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే 3 డీఏలను విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రూ.10 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి క్లియరెన్స్‌కు ప్రతి నెలా రూ.2వేల కోట్లను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ సంఘాల గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ... పీఆర్సీ నివేదికను కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీకి లేఖ పంపిందని, నివేదిక రాగానే... అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. ‘మీరు ఎప్పుడైనా నన్ను కలవొచ్చు.
నా ఆఫీసు రచ్చబండ. రాత్రి సమయంలోనూ వచ్చి కలవొచ్చు’ అని సీఎం చెప్పినట్లు వారు వివరించారు. కాగా... ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పీకర్ చెప్పారని వారు తెలిపారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు లచ్చిరెడ్డి, రాజశేఖర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చెప్పినట్లు వారు వివరించారు.