విద్యుత్ ప్రమాదంలో చనిపోతే 8 లక్షల పరిహారం
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:05 AM
విద్యుత్ శాఖకు సంబంధం లేనివారు విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబాలకిచ్చే పరిహారాన్ని పెంచుతూ టీజీఎస్పీడీసీఎల్ (దక్షిణ డిస్కమ్-హైదరాబాద్) నిర్ణయం తీసుకుంది. ఇదివరకు రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా..
రూ.5 లక్షల నుంచి 8 లక్షలకు పెంపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖకు సంబంధం లేనివారు విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబాలకిచ్చే పరిహారాన్ని పెంచుతూ టీజీఎస్పీడీసీఎల్ (దక్షిణ డిస్కమ్-హైదరాబాద్) నిర్ణయం తీసుకుంది. ఇదివరకు రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా ఇకపై రూ.8 లక్షలు అందించనున్నారు. పెరిగిన పరిహారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇటీవలే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను టారిఫ్ ఉత్తర్వులు విడుదల చేస్తూ.. విద్యుత్ ప్రమాదాలను తగ్గించాలని, పరిహారం పెంచాలని డిస్కమ్‌లను ఆదేశించింది. ఈఆర్‌సీ ఆదేశాలపై ఈ నెల 2వ తేదీన జరిగిన డిస్కమ్ పాలకమండలి సమావేశంలో అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం సీఎండీ జితేష్ వి.పాటిల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పరిహారంలో రూ.7.20 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో చట్టబద్ధమైన వారసుల పేరుతో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ.80 వేలను నగదు రూపంలో చెల్లిస్తారు. ఇక పశువులు (ఆవులు, గేదెలు, దున్నపోతులు) చనిపోతే రూ.40 వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7 వేలను పరిహారంగా ఇస్తారు.