దోచుకునే వాళ్లం మేం కాదు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:48 AM
తాము అధికారాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణి సంస్థను దోచుకునేవాళ్లం కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
సింగరేణిపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు
డిపెండెంట్ జాబ్‌లపై తప్పుడు ప్రచారం
వనరులను దోచుకున్నందుకే గద్దె దిగిన బీఆర్‌ఎస్
కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా కల్పించిందే కాంగ్రెస్ పార్టీ
హరీశ్, కిషన్‌రెడ్డి కలిసి మీనాక్షికి రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకున్నారు: భట్టి విక్రమార్క
335 మంది కార్మికుల వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత
మంచిర్యాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): తాము అధికారాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణి సంస్థను దోచుకునేవాళ్లం కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ మనుగడకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పదేళ్లపాటు సంస్థ వనరులను దోచుకున్నందుకే బీఆర్‌ఎ్‌సను ప్రజలు గద్దె దించారని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి సింగరేణిపై కుట్రలు చేస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం సాయంత్రం మంచిర్యాలలో 335 మంది సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరికొందరు కూడా ఈ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని, దరఖాస్తులు పరిశీలించిన తరువాత త్వరలోనే వారికి కూడా నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణి నుంచి కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిపెండెంట్ల ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఇప్పుడు అబద్ధాలతో పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సింగరేణికి మేలు ఏమిటో చెప్పాలన్నారు. సింగరేణికి రావాల్సిన రెండు బొగ్గు బ్లాకులను రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. దీంతో సింగరేణికి మొత్తంగా రూ.2,624 కోట్ల లాభం రాకుండా పోయిందన్నారు. పదేళ్లలో సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
మెడికల్ బోర్డును కొనసాగిస్తాం..
సింగరేణిలో న్యాయబద్ధంగా మెడికల్ బోర్డును కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అలాగే మారుపేర్ల విషయంలో భవిష్యత్తులో న్యాయ సమస్యలు తలెత్తకుండా అధికారులు, యూనియన్ నాయకులతో కమిటీ వేస్తామని తెలిపారు. దోపిడీదారులను సంస్థలో చేరనివ్వబోమని ప్రకటించారు. హరీశ్‌రావు, కిషన్‌రెడ్డి కూడబలుక్కొని మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఆలయాల అభివృద్ధికి కృషి...
బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ కోసం రూ.802 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్ట వద్ద రూ.133 కోట్ల అంచనా వ్యయంతో గూడెం ఆలయం అభివృద్ధితో పాటు నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు.