‘క్యూర్’ పరిధిలో లక్ష ఇళ్లు
ABN , Publish Date - May 30 , 2026 | 03:48 AM
పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ‘అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం’కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
70,000 ఎల్‌ఐజీ, 30,000 ఎంఐజీ ఫ్లాట్లు.. అఫర్డ్‌బుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాంకు శ్రీకారం
పైలట్ ప్రాజెక్టుగా తొలుత 12వేల ఇళ్ల నిర్మాణం
ఎల్‌ఐజీ లబ్ధిదారులకు భూమి ధరతోపాటు 5లక్షల సబ్సిడీ
హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సహా..పలు ప్రభుత్వ సంస్థల భూముల్లో నిర్మాణం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ‘అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం’కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని అల్ప, మధ్య ఆదాయ వర్గాల వారి కోసం లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి జీవో నెం 23ను శుక్రవారం జారీ చేసింది. ఈ నిర్ణయంతో క్యూర్ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం జరగనుంది. మొత్తం లక్ష ఇళ్లలో అల్పాదాయ (ఎల్‌ఐజీ) వర్గాలకు 70,000, మధ్య (ఎంఐజీ)ఆదాయ వర్గాలకు 30,000 ఇళ్లు కేటాయించనున్నారు. అయితే, పైలట్ ప్రాజెక్టు కింద ఈ లక్ష ఇళ్లల్లో తొలుత 12,000 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, ఎల్‌ఐజీ ఫ్లాట్లకు భూమి ధరను వేయరు, మరో రూ.5లక్షలు రాయితీ కూడా ఇస్తారు. ఎల్‌ఐజీ యూనిట్లకు ఇచ్చే అవిభాజ్య భూమి (యూడీఎ్‌స)విలువను ప్రభుత్వం లేదా హౌసింగ్ బోర్డు ఈక్విటీగా పరిగణిస్తారు. ఫ్లాట్‌తోపాటు భూమిలో ఇచ్చే యూడీఎ్‌సను అర్హులైన లబ్ధిదారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎల్‌ఐజీ వర్గాలకు భూమి ఉచితంగా ఇవ్వడంతోపాటు రూ.5లక్షలు రాయితీగా ఇవ్వనుండడంతో ఆ వర్గానికి లబ్ధి చేకూరనుంది. దాంతో లాటరీ విధానంలోనూ ఎల్‌ఐజీ వర్గాల నుంచి దరఖాస్తులు బాగానే వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. మరోపక్క, ఎంఐజీ వర్గాలకు భూమి ధరతో పాటు ఇంటి ధరను ఎంత నిర్ణయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు, దిల్(డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ భూములతో పాటు ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములను వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస యోజన-2.0, తెలంగాణ హౌసింగ్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను హౌసింగ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా సమకూర్చుకుంటుంది. నిధుల సమీకరణ కోసం పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మించడం, లబ్ధిదారులతో వాటాలు పెట్టించడం ఇలా పలు విధానాలను హోసింగ్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు.
10 అంతస్తుల భవనాలు, వాస్తుకు ప్రాధాన్యం : మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. 40-50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని స్పష్టంచేశారు. స్థానిక పరిస్థితుల మేరకు అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంటి హాలు, బెడ్ రూమ్, వంటగది, బాత్‌రూమ్‌ల విషయంలో వాస్తు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతీ డిజైన్‌లో పార్కింగ్, దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండాలన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలకే ఇళ్లను ఇవ్వాలన్నారు. ప్రజలు తమ జీవనం, ఉపాధికి దూరం కాకుండా నివాసాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తరువాత డిజైన్లను ఖరారు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేలా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.