క్రిటికల్ మినరల్స్ రంగంలో కీలక అడుగు.. భాగస్వాములుగా మోనాష్, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి
ABN , Publish Date - Sep 01 , 2026 | 08:25 PM
తెలంగాణ క్రిటికల్ మినరల్స్ రంగంలో కీలక అడుగులు పడుతున్నాయి. మోనాష్, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి భాగస్వామ్యులుగా ఏర్పడి పరిశోధనలు చేయనున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబరు 1: తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ పరిశోధనలో కీలక అడుగులు పడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఇందుకోసం ముందుకొచ్చింది. మోనాష్-ఐఐటీ హైదరాబాద్- సింగరేణి మూడు సంస్థలూ కలిసి త్రిముఖ భాగస్వాములుగా ఏర్పడి క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనలు చేస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇకపై ఖనిజ అన్వేషణ, వెలికితీత, శుద్ధి సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్ రికవరీ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ పరిశోధనలు సఫలమైతే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ల ముడి పదార్థాల కొరతను అధిగమించగలమని పేర్కొన్నారు.
క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క అన్నారు. అలాగే ఐఐటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వాణిజ్య స్థాయిలో విస్తరించే సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామన్నారు.