ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:53 AM
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు
‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో భారీ సభ
న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఇటీవల చేపట్టిన ర్యాలీ తరహాలో.. సర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోనూ భారీ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో మహేశ్ గౌడ్ మంగళవారం కలిశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 12-14 తేదీల్లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్--2026’కు రాహుల్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై నివేదికను సమర్పించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించిన మెమోరియల్ పార్కుకు సంబంధించిన పుస్తకాన్ని రాహుల్‌కు అందజేశారు. రాహుల్ గాంధీతో దాదాపు అరగంట సేపు భేటీ అయిన మహేశ్ గౌడ్ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఆ వివరాలను వెల్లడించారు. భారత్ సమ్మిట్ కోసం రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతోనూ సమావేశమవుతారని తెలిపారు. పార్టీ, ప్రభుత్వంలో ఓబీసీల ప్రాతినిధ్యంపైనా చర్చించినట్లు చెప్పారు. ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.
అయితే, పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, పంచాయితీలపై ఎలాంటి చర్చ జరగలేదని దాటవేశారు. ఆ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఇక, నర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోనూ భారీ సభను ఏర్పాటు చేస్తామని, ఆ ర్యాలీకి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ఈ సభ తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఇక, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోనియా ఆత్మకథ పుస్తకం కోసం మాట్లాడుతూ రాహుల్ భావోద్వేగానికి గురయ్యారని మహేశ్ గౌడ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ
ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ