Share News

కిమ్‌ రాజ్యమే బీజేపీ లక్ష్యం!

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:24 AM

ఇన్నాళ్లు మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేను ఆదర్శంగా తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ఆదర్శంగా తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

కిమ్‌ రాజ్యమే బీజేపీ లక్ష్యం!

  • ప్రజల ఓట్లతో పనిలేకుండా గెలిచే ప్రయత్నం

  • మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. ఆ కుట్రే

  • గాంధీ 8 గాడ్సే రాజకీయాలు పోయాయి

  • గాంధీ 8 కిమ్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి

  • నితిన్‌ నబీన్‌తో రిటర్నింగ్‌ అధికారి కుమ్మక్కు

  • కోర్టులో పిటిషన్‌ వేసి ఆ సీటు గెల్చుకుంటాం

  • ఆర్వో చేసింది రైటని సుప్రీంకోర్టు చెప్పలేదు

  • దేశంలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే

  • పవన్‌ తెలంగాణకు వచ్చి పోటీ చేయొచ్చు

  • ఈటలపై బ్యానర్లు కిషన్‌రెడ్డి మనుషుల పనే

  • గూఢచర్యమే కేసీఆర్‌ను ముంచింది

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌ రెడ్డి

ఉత్తర కొరియాలోనూ ఎన్నికలు ఉంటాయి. కానీ, పోలింగ్‌ బూత్‌లో కిమ్‌ పార్టీకి సంబంధించిన బటన్‌ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలోనూ అటువంటి దుస్థితే ఏర్పడింది. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, కేవలం గెలుపు కోసం ఎంతకైనా తెగించే విధానాలను బీజేపీ అవలంబిస్తోంది. బీజేపీకి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదర్శంగా మారారు.

- రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేను ఆదర్శంగా తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ఆదర్శంగా తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఓట్లు వేయకపోయినా అక్రమ పద్థతులతో ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ను అక్రమంగా తిరస్కరించడం ద్వారా బీజేపీ దేశ ప్రజాస్వామ్యానికి, మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని మండిపడ్డారు. గాంధేయవాది అయిన మీనాక్షిని రాజ్యసభలో అడుగు పెట్టకుండా చేయడం ద్వారా దేశంలో గాంధేయ సిద్ధాంతాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకొని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాస్తూ, ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. ఓటు చోరీ నుంచి సీటు చోరీ వరకు బీజేపీ దిగజారిందని చెప్పారు.


శుక్రవారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉత్తర కొరియాలో కూడా పేరుకు ఎన్నికలు ఉంటాయని, ప్రజలంతా ఓటేస్తారని, పోలింగ్‌ బూత్‌లో కిమ్‌ పార్టీకి సంబంధించిన బటన్‌ మాత్రమే ఉంటుందని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం కూడా అదే దుస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా విజయం కోసం ఎంతకైనా తెగించే విధానాలను బీజేపీ అవలంబిస్తోందని చెప్పారు. ఆ పార్టీకి కిమ్‌ ఆదర్శమని అన్నారు. ఇన్నాళ్లు దేశ రాజకీయాలు గాంధీ వర్సెస్‌ గాడ్సే విధానంలో నడిచాయని, ఇప్పుడు దాన్ని బీజేపీ క్రమంగా గాంధీ వర్సెస్‌ కిమ్‌ పద్ధతిలోకి తీసుకెళ్లిందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో మధ్యప్రదేశ్‌ రిటర్నింగ్‌ అధికారి పూర్తిగా బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా లేనిచోట రాజ్యసభ స్థానాన్ని ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. రిటర్నింగ్‌ అధికారి బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో కుమ్మక్కు అయ్యారని అన్నారు. బీజేపీ ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నానా అవస్థలు పడుతోందని అన్నారు. ఇదంతా దేశం చూస్తూనే ఉందని చెప్పారు. ఈ అక్రమంపై న్యాయపోరాటం చేస్తామని, ఎలక్షన్‌ పిటిషన్‌ మీద విచారణను ఆర్నెల్లలో ముగించాలని నియమం ఉందని, అక్కడ గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఎన్నికల పిటిషన్‌ వేయమని చెప్పిందే తప్ప రిటర్నింగ్‌ అధికారి చేసింది ఒప్పేనని ఎక్కడా అనలేదని ప్రస్తావించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంత అడ్డగోలుతనం ఎక్కడా చూడలేదని, ఇది ప్రజాస్వామ్యానికే తలవంపు అని వ్యాఖ్యానించారు.


మోదీకి 1000 నోటీసులిస్తే అన్నీ అఫిడవిట్‌లో పెడతారా?

2022లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీకి 2025లో ఇన్‌చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్‌కు ఏం సంబంధం అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌ లేదు, ఛార్జిషీట్‌ లేదు, అసలు కేసే లేదు. అలాంటప్పుడు ఎలక్షన్‌ అఫిడవిట్‌లో ఏమని మెన్షన్‌ చేయాలి? నోటీసులు ఇచ్చినా అఫిడవిట్‌లో మెన్షన్‌ చేయాలనే అంశమే ఎలక్షన్‌ ఫామ్‌లో లేదు. ఎవరు ఎవరిపై ప్రైవేట్‌ కంప్లయింట్‌ ఇచ్చినా కోర్టు నోటీసులు ఇష్యూ చేస్తుంది. వివరణ విన్నాక నిర్ణయిస్తుంది. మరి ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా 1000 ప్రైవేట్‌ ఫిర్యాదులు నమోదైతే, కోర్టు నోటీసులిస్తే.. మోదీ తన అఫిడవిట్‌లో ఆ 1000 నోటీసుల వివరాలు పొందుపరుస్తారా?’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్‌ అంశంలో తెలంగాణ కాంగ్రెస్‌ను ముద్దాయిని చేయాలని బీజేపీ వాళ్లు కుట్ర పన్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు తాను ఉమ్మడి శత్రువునని, అందుకే తనను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసికట్టుగా మాటల యుద్థం చేస్తున్నారని అన్నారు. సీటు చోరీని పక్కదారి పట్టించేందుకే రెండు పార్టీలు కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగాయన్నారు. కాంగ్రెస్ లో ఏ పార్టీ ఎమ్మెల్యేలూ చేరలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ పది మందీ తాము బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమేనని చెబుతున్నారని తెలిపారు. ఫిరాయింపులు ఎలా చేయాలో దేశానికి చెప్పిందే కేసీఆర్‌ అన్నారు. బీజేపీకి కూడా ఆయనే ఆదర్శం అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పార్టీల విలీనం ఉంటుంది కానీ, శాసనపక్షం విలీనం ఉండదని, కేసీఆర్‌ రాజ్యాంగానికే కొత్త సిద్ధాంతం నేర్పారని అన్నారు.


పవన్‌ తెలంగాణలో పోటీ చేయొచ్చు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు రావచ్చు, మాట్లాడవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని రేవంత్‌ అన్నారు. ఆ హక్కు వారికి ప్రజాస్వామ్యం కల్పించిందని చెప్పారు. అందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాం అంటే మాత్రం తెలంగాణ వాళ్లూ అదే విధంగా స్పందిస్తారన్నారు. ‘‘పవన్‌ అన్నారు, పొన్నం కౌంటర్‌ ఇచ్చారు. అంతటితోనే ఆ కథ ముగిసిపోయింది. సభకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నది పోలీసుల ఇష్టం. నా ప్రమేయం ఏముంటుంది? తెలంగాణలో అనేక మంది ేస్వచ్ఛగా మాట్లాడుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. వారందరికీ లభించిన అనుమతులు పవన్‌ కల్యాణ్‌కే ఎందుకు లభించలేదంటే అది పోలీసుల నిర్ణయం. ఏపీలో జగన్‌కు పవన్‌ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ వాళ్లను ఇంటి నుంచి బయటికే రాకుండా చేశారని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అణచివేత విధానాలను ఎప్పుడూ అవలభించదని చెప్పారు. హైడ్రా అనే పదానికి మూలం హిట్లర్‌ హయాంలోని జర్మనీ నుంచి వచ్చిందని చెబితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీఎం అన్నారు. రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశం అసలు చర్చకే రాలేదని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోని 66 మంది ఎమ్మెల్యేలూ మంత్రి పదవులకు అర్హులేనన్నారు. గురువారం ప్రధాని మోదీని కలిసినపుడు ఆయనే స్వయంగా తన చేయి పట్టుకుని, తెలంగాణ అభివృద్థికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారని ముఖ్యమంత్రి వెల్లడించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో తన పక్కనే కూర్చున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కుశల ప్రశ్నలే తప్ప ఇంకేం చర్చించలేదన్నారు. ఇటీవలి ఎన్నికల విజయంపై మరోసారి అభినందనలు తెలిపానన్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సీఎం అన్నారు. మెట్రో రెండో దశ వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పేరు వస్తుందని కిషన్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఈటలకు వ్యతిరేకంగా నగరంలో బ్యానర్లు వేసింది కూడా కిషన్‌రెడ్డి అనుచరులేనని చెప్పారు. 2023లో ప్రధాని మోదీనే స్వయంగా మెట్రో రెండోదశ ప్రాజెక్టును ప్రకటించారని, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సహకారం అందలేదని చెప్పారు.


రేవంత్‌రెడ్డి ఏం అడిగినా ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి కేంద్రంలో చెబుతున్నారని, ఆయన ఎవరితో చెబుతున్నారో వాళ్లే తనకు చెబుతున్నారని అన్నారు. తానే ప్రాజెక్టులు ఆపించానని ఇటీవలే కేటీఆరే స్వయంగా అన్నారని ప్రస్తావించారు. అంటే, కేటీఆర్‌ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి ఆడుతున్నారని భావించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణకు ఈ ప్రాజెక్టు ఇవ్వండి అని ఎప్పుడైనా మోదీకి కిషన్‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఐఆర్‌ఎఫ్‌సీ లోన్‌ ఎందుకు ఇవ్వడం లేదు? జూన్‌ 30నరావాల్సిన డబ్బులు ఎందుకు ఆపేశారు? ఆర్‌ఆర్‌ఆర్‌లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? కేంద్రమంత్రిగా ఫడ్నవీస్‌తో మాట్లాడి తుమ్మిడిహెట్టి కోసం 1500ల ఎకరాలు ఇప్పించలేరా? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి చేతగాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, మరో సమర్థుడు కేంద్ర మంత్రిగా వచ్చి తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేస్తారని అన్నారు. తుమ్మిడిహెట్టి గురించి తానే ఫడ్నవీస్‌తో మాట్లాడానని, జూలైలో సమావేశం పెట్టుకుందామన్నారని వెల్లడించారు. మోదీ కూడా ఫడ్నవీస్‌తో ఒక మాట చెబుతానన్నారని వెల్లడించారు. కిషన్‌రెడ్డి సహా మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయని వ్యాఖ్యానించారు. పోలవరం కోసం భద్రాచలం నుంచి 7 మండలాలు ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేస్తానని చంద్రబాబు చెబితే మోదీ తలొగ్గారని ప్రస్తావించారు. కిషన్‌ రెడ్డితోపాటు 8 మంది బీజేపీ ఎంపీలు మోదీ దగ్గరికి పోయి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం అని చెప్పడం లేదు? అని అడిగారు. కిషన్‌రెడ్డి ఈ సారి కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లినపుడు వెంట తనను కూడా తీసుకెళ్లాలని అడిగారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరు కానని కిషన్‌రెడ్డి చెప్పగలరా? అని సవాల్‌ విసిరారు.


దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న ఆరు మెట్రోల్లో ఒకటైన హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధానిని కోరానని వెల్లడించారు. ఫోర్త్‌ సిటీలోనే స్కిల్‌ యూనివర్సిటీ సహా అన్ని కీలక విభాగాలు ఉంటాయని ముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. బాలానగర్‌ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ఇప్పటికే కమిటీలు ఉన్నాయని చెప్పారు. చెరువుల కబ్జాలను విడిపిస్తుంటేనే ఎన్నో మాటలు పడుతున్నామని, స్కూళ్ల ఫీజుల జోలికిపోతే ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులకు చెప్పుకోండి. సబ్‌ కమిటీ సిఫార్సులను తీసుకువేస్త మీరు టీ తాగే లోపు మినిట్స్‌ రాసి, కేబినెట్‌లో ఆమోదిస్తాం. సొసైటీ పేరుతో కాకుండా వ్యక్తిగతంగా ఇస్తాం. గతంలో మీరెన్ని ఇబ్బందులు పడ్డారో నేను స్వయంగా చూశా. అందుకే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jun 13 , 2026 | 06:16 AM