Share News

ఆర్థిక వ్యవస్థలకు మీరే వెన్నెముక

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:36 AM

తెలంగాణతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక వంటివారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలకు మీరే వెన్నెముక

  • తెలంగాణ పునర్‌ నిర్మాణం, సంస్కృతి, అభివృద్ధిలో భాగస్వాములు

  • ఆర్యవైశ్య సామాజిక వర్గానికి టీ ప్రభుత్వంలో సముచిత స్థానం

  • రోశయ్య జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నాం

  • శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించిన వాసవి పారాయణం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక వంటివారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యులది కీలక పాత్ర అని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో సీఎం మాట్లాడారు. ‘ఆర్యవైశ్య సోదరులు ఊరికి ఒక్కరున్నా.. ఊరంతా వారి చేతిలో ఉంటుంది. రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలకు మీరు వెన్నెముక. తెలంగాణ పునర్‌ నిర్మాణంలోనే కాదు.. తెలంగాణ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. మీరు ఆనాటి నుంచి రాజకీయంగా అవకాశాలు వచ్చినా, రాకపోయినా మౌనంగా ఉండి.. అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు తప్ప మరోలా వ్యవహరించలేదు. మీ క్రమశిక్షణే దేశం, రాష్ట్రం ఎదుగుదలకు, మీ గుర్తింపునకు కారణం’ అని ప్రశంసించారు.


ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో సముచిత స్థానం

ఆర్యవైశ్య వర్గానికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించినట్లు సీఎం తెలిపారు. ఈ వర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి, ఆత్మార్పణ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కాల్వ సుజాత చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తనకు ఇష్టమైన నాయకుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొనిజేటి రోశయ్య ఒకరని చెప్పారు. రోశయ్య మంత్రిగా, సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయనతో వాదించటాన్ని గౌరవంగా భావించేవాడినని అన్నారు. వయసులో చాలా చిన్న వాడినైన తనను వ్యక్తిగతంగా పిలిచి రోశయ్య సూచనలు ఇచ్చేవారని తెలిపారు. లక్డీకాపూల్‌ చౌరాస్తాలో రోశయ్య విగ్రహం ఏర్పాటుచేయడంతోపాటు.. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. టీజీ వెంకటే్‌షది తనలాంటి మనస్తత్వమేనని, కర్నూలు జిల్లాలో అందరినీ ఎదిరించి రాజకీయంగా ఎదిగారని చెప్పారు. ఆయన తనయుడు టీజీ భరత్‌ అదే బాటలో పయనిస్తూ ప్రస్తుతం ఏపీ మంత్రిగా మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్‌ రచించిన 102 చరణాలతో కూడిన శ్రీ వాసవి పారాయణాన్ని ఈ సమావేశంలో ఆలపించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు సంపాదించారు. అందుకు ఆర్యవైశ్యులను సీఎం అభినందించారు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి అహింసా మార్గంలో దేశానికి విముక్తి కల్పించి ప్రపంచానికి శాంతిమార్గం చూపిన మహాత్ముడు వైశ్య జాతితోపాటు దేశానికే గర్వకారణమని అన్నారు. తెలంగాణ, ఏపీ మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, టీజీ భరత్‌, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తా, కర్ణాటక ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 04:38 AM