పోలీసుశాఖ బలోపేతానికి పూర్తి సహకారం
ABN , Publish Date - May 21 , 2026 | 03:44 AM
బాధ్యతాయుతమైన పోలీసింగ్ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పోలీసుశాఖ బలోపేతానికి అన్ని.....
అవినీతిని మాత్రం సహించను.. బాధ్యతాయుత పోలీసింగ్ లక్ష్యం
ఎస్పీలు, ఐజీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
రాష్ట్రంలో మరిన్ని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు
పోలీసు వాహనాలన్నీ ఇకపై ఈవీలే
విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు: సీఎం రేవంత్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): బాధ్యతాయుతమైన పోలీసింగ్ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పోలీసుశాఖ బలోపేతానికి అన్ని విధాల సహకరిస్తానని, అవినీతిని మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లోని బోధి పెవిలియన్‌లో సీఎం బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనలను పంచుకోవాలన్నదే ఈ సమావేశ ఉద్దేశమని చెప్పారు. పోలీసుశాఖలో జవాబుదారీతనం మరింత పెరగాలని, వ్యవస్థలో అందరూ భాగస్వామ్యులేనన్నారు. ఎవరైనా హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లాలంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. జిల్లా ఎస్పీలు, ఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. పోలీసుశాఖలో ఉన్న అన్ని వాహనాలను త్వరలో ఈవీకి మార్చాలని సీఎం ఆదేశించారు. ఫొరెన్సిక్ విభాగాన్ని వచ్చే పదేళ్ల అవసరాలకు అనుగణంగా బలోపేతం చేయాలని, డ్రోన్ పోలిసింగ్‌ను, సీసీ కెమెరాలను పెంచుకోవాలని తెలిపారు. ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచడం కోసం ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని గుర్తు చేశారు. రహదారి భద్రత, ట్రాఫిక్ విభాగాలను ఒకే యూనిట్ కిందికి తీసుకురావాలని, ఆహారకల్తీ నివారణకు ప్రత్యేక చట్టం అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులపై కొరడా ఝుళిపించాలని, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలపై విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ చెప్పారు. విజిలెన్స్ విభాగానికి మరిన్ని అధికారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సైబర్ క్రైం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై అధ్యయనం చేసి ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పోలీసు రిక్రూట్‌మెంట్, శిక్షణ దశలోనే సైబర్ క్రైం నిపుణులు పోలీసు శాఖలోకి వచ్చే విధంగా నూతన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో సైబర్ క్రైంపై ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ అమ్మకాలను పూర్తిగా అడ్డుకోవాలని, డ్రగ్స్ బాధితుల కోసం డీ అడిక్షన్ సెంటర్లను పెంచాలని సీఎం సూచించారు. పోలీసుశాఖలో ఎస్సై నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తర్వాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పని చేయాలని, ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపకశాఖ ప్రణాళిక రూపొందించుకుని అడుగులు వేయాలని సీఎం పేర్కొన్నారు. పురపాలకశాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని వచ్చే నెల 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అగ్నిమాపకశాఖను ఆదేశించారు. నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్‌తో సమన్వయం చేసుకోవాలని, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, మునిసిపల్ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే సంబంధిత విభాగాలు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాత్రి పూట గస్తీని మరింత పెంచాలని, విజబుల్ పోలీసింగ్‌లో ఇది అత్యంత ముఖ్యమని చెప్పారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.