ఆమెపై క్యాన్సర్ పంజా!
ABN , Publish Date - May 18 , 2026 | 03:11 AM
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 18,235 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికం
మొత్తం బాధితుల్లో 59.82 శాతం స్త్రీలే..
ప్రతి లక్షలో 62 మంది ఆడవాళ్లకు మహమ్మారి
మగవారిలో ప్రతి లక్షలో 42 మంది బాధితులు
వయసు పెరిగేకొద్దీ పెరుగుతున్న ముప్పు
మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులే అధికం
రాష్ట్రంలో ఏటా సగటున 18,235 కొత్త కేసులు
హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధికం
క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణలో వెల్లడి
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 18,235 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే, క్యాన్సర్ బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. మొత్తం క్యాన్సర్ బాధితుల్లో మహిళలు 59.82శాతం మంది ఉండగా పురుషులు 40.18శాతం ఉన్నారు. ప్రతి లక్ష మంది ఆడవారిలో 62 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే ప్రతి లక్ష మంది మగవారిలో 42 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో ఏడాదికి సగటున 7,327 కొత్త కేసులు నమోదవుతున్నాయి. పురుషులలో 62 ఏళ్లు పైబడిన వారు(1,834 మంది), 39-48 ఏళ్ల మధ్య వయస్కులు (1,533 మంది) ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గత 66 నెలల కాలం లో (2020 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబరు వరకు) రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. ఏటా సగటున ప్రతి లక్ష మంది జనాభాలో 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ సలహాదారుడిగా ఉన్న ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేసిన ‘క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ’ నివేదిక ఆందోళన కలిగించే ఈ విషయాలను వెల్లడించింది. 2020-25 మధ్య కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదైన క్యాన్సర్ కేసుల గణాంకాలను విశ్లేషించి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణను రూపొందించారు.
హన్మకొండ, హైదరాబాద్‌లో అత్యధిక కేసులు!
రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థా యిలో ఉందని క్యాన్సర్ అట్లాస్ పేర్కొంది. మొత్తం 33 జిల్లాలకుగాను ఏకంగా 25 జిల్లాల్లో క్యాన్సర్ కేసుల రేటు లక్ష జనాభాకు 45 కంటే ఎక్కువగా ఉంది. కేవలం నాలుగు జిల్లాల్లోనే ఈ రేటు 40 కంటే తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా హన్మకొండ జిల్లాలో ఏటా ప్రతి లక్ష మందికి 79 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత లక్షకు 72 కేసులతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత కరీంనగర్ (65), పెద్దపల్లి (63), రాజన్న సిరిసిల్ల (63), జగిత్యాల (60) జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. ఇక, గడిచిన ఐదేళ్ల ట్రెండ్‌ను గమనిస్తే 2021--22 ఏడాది నుంచి రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా 2022--23లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ ఏడాది కొత్తగా నమోదైన కేసు ల రేటు లక్ష జనాభాకు 66.29 కాగా మొత్తం బాధితుల రేటు లక్షకు 83.50గా రికార్డయ్యింది.
వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతున్న ముప్పు
క్యాన్సర్ ప్రభావం 33 ఏళ్ల వయస్సు దాటిన వారిలో గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 39-48 ఏళ్ల వయస్సు వారిలో అత్యధికంగా 24,004 కేసులు నమోదయ్యాయి. 62 ఏళ్లు పైబడిన వృద్ధులలో 22,787 కేసులు నమోదయ్యాయి. యువతలో (19-25 ఏళ్లు) కేసుల సంఖ్య అత్యల్పంగా (2,311) ఉంది. 33 ఏళ్లు పైబడిన అన్ని వయో సమూహాలలోనూ పురుషుల కంటే మహిళా రోగుల సంఖ్యే భారీగా ఉంటోంది. ముఖ్యంగా 39-48 ఏళ్ల వయస్సు గల మహిళా బాధితులు అత్యధికంగా (15,573) ఉన్నారు.
చికిత్సల్లో మెడికల్ ఆంకాలజీదే హవా..
ఆరోగ్యశ్రీ పథకం కింద అందుతున్న క్యాన్సర్ చికిత్సలను విశ్లేషిస్తే.. శస్త్రచికిత్సలు (సర్జికల్), రేడియేషన్ కంటే కీమోథెరపీతో కూడిన మెడికల్ ఆంకాలజీ చికిత్సలనే రోగులు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మెడికల్ ఆంకాలజీ విభాగంలోనే అత్యధిక సంఖ్యలో రోగులకు ేసవలు అందుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి ఏకంగా 34,256 మందికి చికిత్స అందించి రాష్ట్రంలోనే అతిపెద్ద క్యాన్సర్ కేర్ హబ్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి (21,508 మంది), నిమ్స్ ఆస్పత్రి (8,641 మంది), కరీంనగర్ ఒమేగా సుశ్రుత ఆస్పత్రి (6,563 మంది) ఉన్నాయి. కాగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న మొత్తం క్యాన్సర్ రోగులలో దాదాపు 90శాతం మంది ప్రైవేట్ నాన్-మెడికల్ కాలేజీ ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య సంస్థల ద్వారానే సేవలు పొందుతుండటం గమనార్హం. క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఆస్పత్రుల్లో నమోదైన వివరాల ప్రకా రం.. వ్యాధి చివరి దశకు చేరిన వారికి అందించే ’పాలియేటివ్’ చికిత్సలే అత్యధికంగా (36,754) నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే చాలామంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రాడికల్ రేడియోథెరపీ (27,981), రొమ్ము క్యాన్సర్ (15,909), బ్లడ్ క్యాన్సర్ (12,304), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (11,844), అడ్జువంట్ థెరపీ (11,539), బ్రాకీథెరపీ (8,838), తల, మెడ క్యాన్సర్ (8,139), ప్యాకేజీ ఎం15.2.1 కింద పురుషులు (7,884) కొలొరెక్టల్ (పేగు) క్యాన్సర్ (6,478) చికిత్సలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యూహాలు మారాలి
రాష్ట్రంలో ఐదేళ్లకుపైగా సేకరించిన ఈ సమ గ్ర డేటా భవిష్యత్తు ప్రజారోగ్య ప్రణాళికలకు ఎంతో కీలకమని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న హన్మకొండ, హైదరాబాద్ వంటి జిల్లాలపై ప్ర భుత్వం ప్రత్యేకదృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. అవగాహనసదస్సులు, రొమ్ము, గర్భాశయముఖద్వార క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంపు లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. 33 ఏళ్లు దాటిన వారందరికీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని క్యాన్సర్ చికిత్సా నిపుణులు చెబుతున్నారు.