Share News

నేడు క్యాబినెట్‌ భేటీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:37 AM

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది.

నేడు క్యాబినెట్‌ భేటీ

  • ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు,మెట్రో స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయాలకు అవకాశం

  • ఇందిరమ్మ కుటుంబ బీమా విధివిధానాల ఖరారు?

  • కోదండరాం, అజారుద్దీన్‌ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం, సీపెక్‌ సర్వే వివరాలపై మంత్రివర్గంలో చర్చ

  • ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక నిర్వహణపై కూడా..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు తీర్పుతోపాటు మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ, ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాల ఖరారు తదితర అంశాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేస్తున్న 32 సమస్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించి సమ్మె పరిష్కారానికి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కూడా మంత్రివర్గం చర్చిస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలు, పీఆర్సీ నివేదికలు, పెండింగ్‌ డీఏలు, ఫిట్‌మెంట్‌ ప్రకటించాలంటూ చేస్తున్న ఉద్యోగ సంఘాల డిమాండ్లపైనా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక, పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ అంశంలో తదుపరి చర్యలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇక, ఏప్రిల్‌ 30వ తేదీలోగా హైదరాబాద్‌లోని మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి చెల్లించాల్సిన బకాయిలు, ఇతరత్రా రుణాల కోసం రూ.13వేల కోట్లను రుణంగా తీసుకోనున్నారు. ఈ రుణం ఇచ్చేందుకు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. రుణ సేకరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత రుణాన్ని తీసుకుంటారు. మరోపక్క, రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. జూన్‌ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో పథకం విధివిధానాల ఖరారుపై మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలిసింది. ఇక, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా మంత్రిమండలి గురువారం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. జనగణన ప్రక్రియకు ఇబ్బంది లేకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జూన్‌ 2న నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలపైనా మంత్రులు చర్చించనున్నారు. అలాగే, సనత్‌నగర్‌ టిమ్స్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ భవనాల ప్రారంభానికి తీసుకోవాలని చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదేకాక, కోదండరాం, అజారుద్దీన్‌ను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ప్రతిపాదించగా.. దానిపై గవర్నర్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశముంది. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారం, ధాన్యంసేకరణతోపాటు ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే (సీపెక్‌)కి సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపు, సీఎ్‌సఆర్‌ ఫండ్‌ పెంపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 23 , 2026 | 04:37 AM