ఆయిల్‌పామ్ సాగుకు అత్యంత ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:12 AM
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ.. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు.
ఈ సాగులో దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ..
ఉమ్మడి జిల్లాల్లో తొలుత ప్రాసెసింగ్ యూనిట్లు,
ప్రస్తుతం నాలుగు, ఏడాదిలోగా
మరో 6 మిల్లులు ప్రారంభం
శాసనసభలో మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ.. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, జారె ఆదినారాయణ, తోట లక్ష్మీకాంతరావు, కడియం శ్రీహరి, కుందూరు జయవీర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు అవసరమైన మొక్కలు, ఎరువులు, మల్చింగ్, షేడ్‌నెట్, ఫామ్‌పాండ్లు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర ేసద్యం వంటి సదుపాయాలను నిబంధనల ప్రకారం 40-90శాతం వరకు రాయితీపై అందిస్తున్నామని వివరించారు. 2026-27లో మొక్కలు, మల్చింగ్, షేడ్‌నెట్, కోత అనంతర నిర్వహణ సదుపాయాలు, శీతల గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ, శాశ్వత పందిళ్ల కోసం రూ.150 కోట్లు, బిందు, తుంపర సేద్యం కోసం రూ.243 కోట్లు, ఆయిల్‌పామ్ అభివృద్ధికి రూ.261 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తుమ్మల చెప్పారు. రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు మొక్కలు, డ్రిప్, మొదటి నాలుగేళ్లకు ఎరువులు, అంతర పంటల సాగు తదితరాలకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
ఫామ్‌పాండ్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ చట్టం-1993 ప్రకారం ఫ్యాక్టరీ జోన్ కేటాయించిన ప్రతి ఆయిల్‌పామ్ కంపెనీ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రతి నెలా ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర ఉందన్నారు. కనీస హామీ ధర (ఎంజీపీ) ప్రకటించాల్సిన అంశం కేంద్రం పరిధిలోనిదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని, మరో ఆరు మిల్లుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
10 వేల ఎకరాల్లో పంట అవసరం..
ఒక ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేయాలంటే కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట హార్వెస్టింగ్ దశకు రావాల్సి ఉంటుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అన్ని ఉమ్మడి జిల్లాల్లో మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరు నెలల్లో ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కనీసం 10-15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తే అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీలు, చిన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు సబ్సిడీలు అందిస్తున్నామని చెప్పారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను సోలార్ వ్యవస్థ వైపు మళ్లించి, ఉద్యాన పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.