పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న యువత
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:35 AM
ఆందోళన కలిగించే ఒక పెద్ద మార్పు వైపు తెలంగాణ సమాజం నిశ్శబ్దంగా అడుగులు వేస్తోంది. అదేంటంటే.. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. యువత సంఖ్య తగ్గుతోంది.
వేగంగా మారుతున్న రాష్ట్ర జనాభా ముఖచిత్రం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో వెల్లడి
రాష్ట్ర జనాభాలో వృద్ధులు..14.1 శాతం మంది
జాతీయ సగటు 12.9 శాతం కంటే ఎక్కువ
వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ టాప్.. ఎనిమిదో స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో15 ఏళ్లలోపువారు 21.3 శాతం
2019-21సర్వేలో వారి సంఖ్య 22.5 శాతం
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు
భవిష్యత్తులో శ్రమశక్తి కొరత, ఆర్థిక భారం
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఆందోళన కలిగించే ఒక పెద్ద మార్పు వైపు తెలంగాణ సమాజం నిశ్శబ్దంగా అడుగులు వేస్తోంది. అదేంటంటే.. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. యువత సంఖ్య తగ్గుతోంది. జననాలరేటు వేగంగా పడిపోతోంది. 2023-24కు సంబంధించి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 6)లో వెల్లడైన వాస్తవాలివి. 2019-21 నాటి ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స -5 సర్వే ప్రకారం రాష్ట్రంలో వృద్థుల (60 ఏళ్లు పైబడిన వారు) జనాభా 12.7 శాతం ఉండగా.. తాజా సర్వేలో అది 14.1 శాతానికి పెరిగింది. ఇక, జాతీయ సగటు గత సర్వేలో 11.8 శాతం ఉండగా ప్రస్తుతం 12.9 శాతానికి పెరిగింది. అంటే రెండేళ్ల వ్యవధిలో 1.1 శాతం పెరిగింది. తెలంగాణలో వృద్ధుల జనాభా జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే.. ఉపాధి, చదువుల కోసం యువత పట్టణాలకు వలస వెళ్తుండటంతో గ్రామాల్లో వృద్ధులు, నగరాల్లో యువత ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నారనే కీలక విషయం ఈ సర్వే ద్వారా బయటపడింది. సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.9 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 2.0గా కావడం గమనార్హం.
కేరళలో 20.7 శాతం
దేశంలో... వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో 20.7 శాతం మంది.. 60 ఏళ్లు పైబడినవారే. అంటే.. కేరళలో ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే. ఆ తర్వాత.. 17.2శాతం వృద్ధ జనాభాతో గోవా రెండో స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ (16.4శాతం), తమిళనాడు (16.3శాతం), ఒడిశా (15.6శాతం), కర్ణాటక (14.6శాతం), మహారాష్ట్ర, పంజాబ్ (14.4 శాతంతో) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 14.1 శాతంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, త్రిపుర ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఇక.. 13.9 శాతం మంది వృద్ధులతో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గడం, వైద్య సదుపాయాలు పెరగడంతో సగటు జీవిత కాలం పెరగడం వల్ల ఈ రాష్ట్రాల్లో వృద్ధ జనాభా శాతం చాలా వేగంగా పెరుగుతోందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది. కాగా దేశంలో అత్యల్ప సంఖ్యలో వృద్ధులు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ మొత్తం జనాభాలో వృద్ధుల సంఖ్య కేవలం 6.8 శాతమే. ఇక, జనాభాలో పదిహేనేళ్లలోపు వారి సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 15 ఏళ్లలోపువారు ఏకంగా 35.6 శాతం ఉన్నారు. ఈ విషయంలో.. మేఘాలయ (34.1శాతం), ఝార్ఖండ్ (30.4శాతం), ఉత్తరప్రదేశ్ (29.3శాతం), అసోం (25.7శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. 15 ఏళ్లలోపువారు తెలంగాణలో 21.3 శాతం మంది (గత సర్వేలో వీరి వాటా 22.5శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 21.1శాతం (గత సర్వేలో 22.2శాతం) మంది ఉన్నారు.
గూడు ఖాళీ అయ్యి..
పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గడం, యువతకు స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో వారు నగరాలకు తరలిపోతున్నారు. ఫలితంగా గ్రామాల్లో వృద్థులు మాత్రమే మిగిలిపోతున్నారని సర్వేలో వెల్లడైంది. దీంతో అనేక గ్రామాల్లో వృద్ధులకు చేదోడుగా ఉండే వారు కరువయ్యారు. సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పండుటాకుల శాతం 14.9 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో వారి సంఖ్య 11.9 శాతంగా ఉంది. ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య గత సర్వేలో 7.5 శాతం ఉండగా.. ఇప్పుడది 7.1 శాతానికి తగ్గింది. మారుతున్న జీవనశైలి, ఆలస్యపు వివాహాలు, పెరుగుతున్న పిల్లల పెంపకం ఖర్చులు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలనే ధోరణి వల్ల సంతానోత్పత్తి రేటు బాగా పడిపోతోంది. అంటే రాష్ట్రంలో యువత, చిన్నారుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండగా.. వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఇలాగైతే ఎలా?
రాష్ట్ర జనాభాలో పెరుగుతున్న ఈ అసమతౌల్యం.. రాబోయే రోజుల్లో ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ప్రధానంగా శ్రమశక్తి కొరత ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గితే భవిష్యత్తులో ఉత్పాదక శక్తి తగ్గుతుంది. వ్యవసాయం, నిర్మాణ, పరిశ్రమ రంగాల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. దీనికితోడు డిపెండెన్సీ రేషియో పెరుగుతుంది. అంటే ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల కుటుంబాలపై, సమాజంపై ఆర్థిక భారం ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆరోగ్య రంగంపై పెను భారం పడనుంది. వృద్ధాప్య సమస్యలు, జీవనశైలి జబ్బులు (మధుమేహం, అధిక రక్తపోటు వంటివి) పెరగడం వల్ల వైద్యపరమైన మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు, ఉచిత వైద్యపథకాల వంటివాటి కోసం బడ్జెట్‌లో పెద్ద మొత్తాలను కేటాయించాల్సి వస్తుంది.
దక్షిణ భారతంలో..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స -6 జాతీయ గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య గతంలో 11.8 శాతం (2019-21) ఉండగా, ఇప్పుడు అది 12.9 శాతానికి పెరిగీంది. దేశవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య రెండేళ్ల వ్యవధిలో 1.1 శాతం పెరిగింది. జాతీయ సగటు పెరిగింది. ముఖ్యంగా దక్షిణాదిలో దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సంతానోత్పత్తి రేటు రీప్లే్‌సమెంట్ లెవెల్ (2.1) కంటే చాలా తక్కువకు పడిపోయింది. వృద్ధుల సంఖ్య పెరగడం, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ కావడం భారత ఆరోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఇప్పుడే వ్యూహాత్మక ప్రణాళికలు రచించాల్సి ఉంది. వారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు, ఉన్న యువతలో నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.