కేసుల నమోదులో ఏసీబీ దూకుడు..
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:45 AM
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చరిత్ర సృష్టించారు. 1983లో ఏసీబీ ఏర్పాటు అయిన తర్వాత కేసులతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అత్యధిక కేసులు నమోదు చేశామని ఏసీబీ డీజీ చారుసిన్హా స్పష్టం చేశారు. ఏసీబీ కార్యాలయంలో మంగళవారం ఆమె త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి..
రెండో త్రైమాసికంలో 10 అక్రమార్జన, 34 ట్రాప్, 23 ఆకస్మిక తనిఖీ కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చరిత్ర సృష్టించారు. 1983లో ఏసీబీ ఏర్పాటు అయిన తర్వాత కేసులతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అత్యధిక కేసులు నమోదు చేశామని ఏసీబీ డీజీ చారుసిన్హా స్పష్టం చేశారు. ఏసీబీ కార్యాలయంలో మంగళవారం ఆమె త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, వివిధ యూనిట్ల పనితీరును సమీక్షించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 10 అక్రమార్జన కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సమీక్షలో వెల్లడైంది. అవినీతి నిరోధక చర్యల్లో అధికారులు క్షేత్రస్థాయిలో దూకుడుగా వ్యవహరించడం వల్ల ఈ రికార్డు సాధ్యమైందని చారుసిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినీతిపై రాజీ లేని పోరాటమే ఏసీబీ ప్రధాన లక్ష్యమని అన్నారు. అధికారులు చూపిన అప్రమత్తత, వృత్తి నిబద్ధత, సమన్వయంతో పనిచేసే విధానం వల్ల 43 ఏళ్ల ఏసీబీ చరిత్రలో రెండో త్రైమాసికానికి సంబంధించి అత్యధిక కేసులు నమోదు చేయగలిగామని ఆమె వివరించారు.
కేసుల నమోదు, దర్యాప్తు, అవినీతి నిరోధక చర్యల్లో విశేష కృషి చేసిన అధికారులను డీజీ ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు అందజేశారు. అవినీతి దేశాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని, నిజాయితీ, నిష్పక్షపాతం, చట్టబద్ధతతో అధికారులు విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. కేవలం కేసుల నమోదుతో సరిపెట్టుకోకుండా దర్యాప్తులో నాణ్యమైన విచారణకు పెద్దపీట వేయాలని, సాంకేతిక ఆధారాల సేకరణ, కోర్టుల్లో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసాన్ని కాపాడే సంస్థగా ఏసీబీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చారుసిన్హా వెల్లడించారు.