బడ్జెట్ 3.20 లక్షల కోట్లు!?
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:18 AM
రాష్ట్ర రాబడి మార్గాలు, ఆదాయ-వ్యయాలు, అప్పులు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందిస్తోంది.
వాస్తవ రాబడుల ఆధారంగా 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. 5ు మేర పెంచే అవకాశం!
20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సర్కారు
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాబడి మార్గాలు, ఆదాయ-వ్యయాలు, అప్పులు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందిస్తోంది. గాల్లో మేడలు కట్టకుండా.. అనవసర ఆడంబరాలకు పోకుండా.. వాస్తవ రాబడుల ఆధారంగా బడ్జెట్‌ను తీర్చిదిద్దనుంది. కాలేజీ విద్యార్థినులకు ఈ-స్కూటర్ల పంపిణీ, చేయూత పింఛన్ల పెంపు, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద రూ.50 వేల వరకు నగదు పెంపు వంటి కొత్త వరాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటూఇటుగా కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 20న సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి , మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
5 శాతం పెంచే అవకాశం?
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. దానికి మరో 5 శాతం పెంచి 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సమాచారం. కొత్త రాబడులు లేకపోవడం, పన్నేతర రాబడిపై ఆశలు సన్నగిల్లడం, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు కనిపించకపోవడంతో ప్రభుత్వం గొప్పలకు పోకుండా.. తక్కువ శాతం పెంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌కు 5 లేదా 7 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. అంటే రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటూఇటుగా ప్రవేశపెడుతుందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యయాలు చేస్తూ వస్తోంది. ద్రవ్య లోటును బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా పూడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,63,486 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించింది. కానీ, జనవరి నెలాఖరుకు 73.37 శాతం అంటే.. రూ.1,93,313 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగింది. మొత్తం మీద ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రభుత్వ వ్యయం రూ.2.50 లక్షల కోట్లకు పైగా చేరవచ్చని అధికార వర్గాల అంచనా. ఇలా బడ్జెట్ వ్యయాలను భారీగా ప్రతిపాదించడం.. వాస్తవ వ్యయాలు వాటిని అందుకోకపోవడం పరిపాటిగా మారింది. పైగా, ద్రవ్య లోటు భారీగా నమోదవుతోంది. ఈ సారి రూ.54,009 కోట్ల ద్రవ్య లోటును అంచనా వేసిన ప్రభుత్వం.. దాన్ని పూడ్చుకోవడానికి బహిరంగ మార్కెట్ నుంచి అంతే మొత్తంలో రుణాలు తెస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, మార్కెట్ రుణాలు దానికంటే మించిపోయాయి. రూ.54,009 కోట్ల స్థానంలో జనవరి నాటికే .69,187 కోట్ల మేర రుణాలు (125.53ు) తెచ్చింది.
వీటి పైనే ఆశ..
కొత్త రాబడి మార్గాలు లేకపోయినా.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాపై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈసారి స్థానిక సంస్థలు, విపత్తుల నిర్వహణ గ్రాంట్లు పెరగనున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటా సొమ్ము కాస్త పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,195 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఈ జనవరి నాటికి రూ.16,496 కోట్లు(77.83ు) వచ్చాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర పన్నుల వాటాను 1.102 శాతం నుంచి 1.174 శాతానికి పెంచడం వల్ల రూ.33,180 కోట్లు రానున్నాయి. ఇలా కేంద్రం నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల మేర అదనపు రాబడి రానుంది.
సాగు, సంక్షేమానికి పెద్ద పీట..
ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా వ్యసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయనుంది. రైతు భరోసా, సన్నాలకు రూ.500 చొప్పున బోనస్, రైతు బీమా, ఆయిల్‌పామ్ సాగు వంటి పథకాలకు నిధులు కేటాయించనుంది. సంక్షేమ రంగంలో కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్, చేయూత పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యమివ్వనుంది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఈసారి పెంచవచ్చని తెలిసింది. ప్రస్తుతం రూ.1,00,116 అందిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సాయానికి మరో రూ.50 వేలు పెంచి రూ.1,50,116 చొప్పున అందించనుందని, దీనికి బడ్జెట్‌లో నిధులను ప్రతిపాదించనుందని తెలిసింది. ఇక చేయూత పింఛన్లను కూడా పెంచవచ్చని సమాచారం. ప్రస్తుతం రూ.2,016 చొప్పున పింఛను అందిస్తోంది. 500 పెంచి, రూ.2,516 చొప్పున ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థినులకు ఈ-స్కూటీలను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈసారి బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీని కింద రూ.1600 కోట్లు కేటాయించవచ్చని తెలిసింది. ఇలా అన్ని రకాలుగా కేటాయింపులు జరిపి.. రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటూఇటుగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సమాచారం.
సర్.. హౌ ఆర్ యూ..
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబుతో పాడి కౌశిక్‌రెడ్డి 45 నిమిషాల మాటామంతి
కాంగ్రెస్‌పై నిత్యం నిప్పులు చెరిగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన తరువాతి నుంచి దాదాపు 40-45 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సుదీర్ఘంగా మాట్లాడారు. కొద్దిసేపు భట్టితో మాట్లాడి వచ్చిన కౌశిక్.. మంత్రి దుద్దిళ్ల పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడారు. ఈ మధ్యలో వచ్చిన ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ కౌశిక్ సరదాగా ముచ్చటించారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గరకు కూడా వెళ్లి మాట్లాడారు.
అన్నా.. నమస్తే
మంత్రి శ్రీధర్‌బాబుతో ఎమ్మెల్యే తలసాని
సభ ప్రారంభమైన తరువాత కొద్దిసేపటికి.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. కౌశిక్‌రెడ్డి మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరినుంచి వెళ్లిన తరువాత తలసాని వెళ్లి అన్నా.. నమస్తే అంటూ శ్రీధర్‌బాబుతో ముచ్చటించారు.
సీఎం చెప్పినా సభ్యులు రావట్లే..
అసెంబ్లీ నిర్వహించే సమయంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ఎమ్మెల్యేలు సభకు కచ్చితంగా హాజరుకావాల్సిందే. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా పలుమార్లు సభ్యులకు స్పష్టంచేశారు. అయినా శాసనసభకు వచ్చే విషయంలో కాంగ్రెస్ సభ్యుల తీరు మారడంలేదు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రతిపాదనపై చర్చ ప్రారంభమైన తరువాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. వారికి కేటాయించిన కుర్చీలన్నీ దాదాపు ఖాళీగానే దర్శనమిచ్చాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులదీ ఇదే పరిస్థితి. సభ్యుల హాజరు అంశం అసెంబ్లీలో చర్చనీయాంశంమైంది.