Share News

పాలమూరు, సీతమ్మ సాగర్‌కు లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 05:26 AM

రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ బ్యారేజీ, డిండి ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి రిజర్వాయర్‌ల పర్యావరణ అనుమతులు పొందడానికి మార్గం సుగమమైంది. ముందస్తు పర్యావరణ...

పాలమూరు, సీతమ్మ సాగర్‌కు లైన్‌ క్లియర్‌

  • పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమం

  • 2017 మినహాయింపు నోటిఫికేషన్‌ చెల్లుబాటుకు సుప్రీం ఓకే

  • పనులు ప్రారంభించిన తర్వాతా అనుమతులు పొందవచ్చు

  • భవిష్యత్తులో మాత్రం ముందస్తు అనుమతులు తప్పనిసరి

  • 2021 నాటి ‘పోస్ట్‌ ఫ్యాక్టో’ ఆఫీస్‌ మెమోరాండం చెల్లదు

  • కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను దాటవేయలేరు

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల హర్షం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/కొత్తగూడెం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ బ్యారేజీ, డిండి ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి రిజర్వాయర్‌ల పర్యావరణ అనుమతులు పొందడానికి మార్గం సుగమమైంది. ముందస్తు పర్యావరణ అనుమతులు (ఈఐ) లేకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులు.. ఆ తరువాత అనుమతులు పొందే విషయంలో సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి 2017 నాటి మినహాయింపు నోటిఫికేషన్‌ చెల్లుబాటును సమర్థించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిపాలన ఉత్తర్వులు ఇవ్వకుండా కేంద్రంపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత అనుమతులు (ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో) మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆఫీస్‌ మెమోరాండం (ఓఎం)ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, ఈఐఏ నోటిఫికేషన్‌-2006ను దాటవేస్తూ.. నిరంతరం అమల్లో ఉండేలా ఇటువంటి మినహాయింపు విధానాన్ని తీసుకొచ్చే అధికారం కార్యనిర్వాహక వర్గానికి లేదని తేల్చి చెప్పింది. తొలుత పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ‘వనశక్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సీజేఐ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. అయితే, ముందస్తు అనుమతి పొందే నిబంధనే ప్రాథమికమైనప్పటికీ.. అత్యంత అరుదైన, తీవ్రమైన ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న పరిస్థితుల్లో చట్టంలోని సెక్షన్‌ 3 కింద పరిమిత కాలానికి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్లు జారీ చేేస అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పుతో తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్‌, డిండి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు అడ్డంకులు తొలగినట్లయింది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్


మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల హర్షం..

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో రాష్ర్టానికి అత్యంత ప్రాధాన్యమున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని మంత్రులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు తెలంగాణ జలవనరుల చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. సాగునీటి విస్తరణతోపాటు విద్యుత్‌ ఉత్పత్తి, వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపు వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్రాజెక్టు అందిస్తుందని చెప్పారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేేస సామర్థ్యం ఏర్పడుతుందని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత లభిస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందులో 3.28 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. అలాగే నాగార్జునసాగర్‌లో నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో, కరువు పరిస్థితుల్లో 3.45 లక్షల ఎకరాల నాగార్జునసాగర్‌ ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నదికి ఇరువైపులా సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుందని అన్నారు. అలాగే గోదావరి వెంట కరకట్టల నిర్మాణం ద్వారా అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పంటలు, గ్రామాలు వరద ముప్పు నుంచి రక్షణ పొందుతాయని వివరించారు. రాష్ట్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల కోసం కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌, అధికారులకు మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారులు తదుపరి చర్యల కోసం ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. అన్ని అనుమతులు మంజూరై సీతమ్మసాగర్‌ పనులు పునఃప్రారంభం కావడానికి రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.


2024 నుంచి నిలిచిన సీతమ్మసాగర్‌ పనులు

సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గ్రామసభల ఆమోదం, నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించకుండా, పర్యావరణ అనుమతులు పొందకుండా పనులు చేపట్టారని దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన ఇద్దరు నిర్వాసితులు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. దీనిపై ఎన్‌జీటీ క్షేత్రస్థాయి పరిశీలనకు ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ.. కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇవ్వటంతో పనులు వెంటనే నిలిపి వేయాలని ఆదేశిస్తూ ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. దీంతో 2024 నుంచి సీతమ్మసాగర్‌ పనులు నిలిచిపోయాయి. ఓవైపు ఎన్‌జీటీలో అనుమతులకోసం ప్రయత్నిస్తునే, సుప్రీంకోర్టు అనుమతులకోసం ప్రభుత్వం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఊరట లభించడటంతో ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు పడనుంది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 05:28 AM