గ్రూప్-1 నియామకాలు సక్రమమే
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:49 AM
తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పుతో తెరపడింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలను సవాలు.....
తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం
టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం సరిగానే ఉంది
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కలుగజేసుకోలేం
జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పుతో తెరపడింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో కమిషన్ అనుసరించిన ‘ట్రిపుల్ వాల్యుయేషన్’ విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతను పాటించామని, గోప్యత కోసమే బార్ కోడ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశామని కమిషన్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ‘‘నియామక ప్రక్రియలో రాజ్యాంగబద్ధ సంస్థ అనుసరించిన విచక్షణను తప్పుబట్టలేం. హైకోర్టు ఇప్పటికే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించినందున, మరోమారు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. గ్రూప్ -1 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పుతో అప్పటికే ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సహా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. అయితే, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఈ ఏడాది మార్చి 9న 2026న పి.ఆదిత్య, అవినాశ్ యాదవ్ సహా మరికొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పారదర్శకంగా మూల్యాంకనం..
గ్రూప్-1 నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ అత్యంత పారదర్శక విధానాలను అనుసరించిందని కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకూ కమిషన్ ఎంతో పకడ్బందీగా, పటిష్ఠ ప్రణాళికలతో వ్యవహరించిందని తెలిపారు. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు అత్యంత శాస్ర్తీయమైన ‘ట్రిపుల్ వాల్యుయేషన్’ (మూడంచెల మూల్యాంకనం) పద్ధతిని అమలు చేసినట్లు చెప్పారు. ‘‘సాధారణంగా మూల్యాంకనం చేసేవారిలో కొందరు మార్కులు వేసేటప్పుడు కఠినంగా ఉంటారు. మరికొందరు ఉదారంగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి వ్యత్యాసాలను పూర్తిగా తొలగించి, అభ్యర్థులందరికీ సమాన న్యాయం చేకూర్చేందుకే ఈ వినూత్న విధానాన్ని పాటించాం’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో మూల్యాంకనమే సరిగా జరగలేదనడం సరికాదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభ్యర్థులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు తెలుగులో మరింత తక్కువగా మార్కులు వచ్చాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు పేపర్ల మూల్యంకన బాధ్యతలు తెలుగు లెక్చరర్లకే అప్పగించాలనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇంగ్లిష్, తెలుగు రెండు సబ్జెక్టులు బోధించగలిగేలెక్చరర్లు అనేకమంది ఉన్నారని తెలిపారు. మూడంచెల విధానంలో పేపర్ల వాల్యుయేషన్ చేపట్టినా, ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వాదించారు.
మూడో విడతలో బార్ కోడ్ లేదు..
గ్రూప్ -1 పరీక్ష పత్రాల మూల్యాంకనం తీరు పలు సందేహాలకు తావిస్తోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సహా ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. మూడో విడత మూల్యాంకనంలో బార్ కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆన్సర్ కీలోనూ లోపాలు ఉన్నాయని తెలిపారు. కాగా, పిటిషనర్లు లేవనెత్తిన బార్ కోడ్ అంశంపై నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు. మొదటి రెండు విడతల మూల్యాంకనంలో బార్ కోడ్ విధానాన్ని కచ్చితంగా పాటించినట్లు తెలిపారు. మూడో విడతలో మాత్రం అభ్యర్థి వివరాలు మూల్యాంకనం చేసేవారికి తెలియకుండా ఉండటంతోపాటు గోప్యతను కాపాడటం కోసమే బార్ కోడ్ వినియోగించలేదని, దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా.. మూల్యాంకన విధానం, బార్ కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై ధర్మాసనం స్పష్టత కోరింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘హైకోర్టు వెలువరించిన తీర్పు, ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. దీని ప్రకారం.. దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్‌పీ)ని కొట్టివేస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర దరఖాస్తులన్నీ పరిష్కారమైనట్లే భావించాలి’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో.. ఇప్పటికే విధుల్లో చేరిన గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనకు తెరపడినట్టయింది.