కేబీఆర్ పార్క్ పరిధిలో చెట్లు నరకొద్దు
ABN , Publish Date - May 19 , 2026 | 05:06 AM
హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం 25-35 మీటర్ల బఫర్ జోన్...
25-35 మీటర్ల పరిధిలో ఎలాంటి పనులూ చేపట్టొద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపుపై నివేదిక ఇవ్వాలని నోటీసులు
హైదరాబాద్‌కు కేబీఆర్ పార్క్ ఊపిరి
19 వేలమంది అభ్యంతరాలనూ పట్టించుకోలేదు: పిటిషనర్ వాదన
న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణ పనుల కోసం 25-35 మీటర్ల బఫర్ జోన్ (ఎకో సెన్సిటివ్ జోన్-ఈఎస్జడ్) పరిధిలో చెట్లను నరకొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌లో చెట్ల నరికివేతపై స్టే విధించాలని కోరుతూ సేవ్ కేబీఆర్ ప్రచారకర్త కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి నియంత్రణ లేని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పర్యావరణానికి శాశ్వత నష్టం జరగకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, హైకోర్టు తక్షణ స్టే ఇవ్వడానికి బదులుగా.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఏయే పనులకు అనుమతి ఉంది? వేటిని నియంత్రించాలి? లేదా నిషేధించాలి? అనే అంశాలపై పరిశోధన చేసి వివరాలు సమర్పించాలని పిటిషనర్లనే ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. దాంతో, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కాజల్ మహేశ్వరి 22 ఏప్రిల్ 2026న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్ రెడ్డి, న్యాయవాదులు మిథున్‌శశాంక్, మనీశ్ తివారీ హాజరయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం- 1972లోని సెక్షన్ 35 కింద నోటిఫై చేసిన కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి గుండెకాయ, పచ్చటి ఊపిరితిత్తి (గ్రీన్ లంగ్) వంటిదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యంత అరుదైన పర్యావరణ ప్రాంతమని తెలిపారు. 2012-15 మధ్య కాలంలో పార్కు చుట్టూ (హెఎండీఏ అభివృద్ధి చేసిన గ్రీన్ బఫర్ ఏరియాతో కలిపి) 25 నుంచి 35 మీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని, రోడ్లు, ఇతర ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పరిధిని క్రమంగా తగ్గించారని ఆరోపించారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవల్‌పమెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీఏ) నిర్మాణం కోసం, భూేసకరణ వ్యయాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ జోన్‌ను 2020 అక్టోబర్ 27న కేవలం 3 నుంచి 29.8 మీటర్లకు కుదించిందని ఆరోపించారు. ఎలాం టి శాస్త్రీయ, పర్యావరణ అంచనాలు లేకుండా ఈ కుదింపు జరిగిందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ‘షాక్ అబ్జార్బర్’గా పనిచేయాల్సిన ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు సరికాదని, ఇది అసలు ఆ జోన్ ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
19వేల అభ్యంతరాలను పట్టించుకోలేదు
ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపునకు ఎలాంటి ప్రజాభిప్రాయ ేసకరణ జరగలేదని గతంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిందని న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. కానీ, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్‌లో మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు తప్పుగా పేర్కొన్నారని తెలిపారు. పర్యావరణ నిబంధనల సడలింపును వ్యతిరేకిస్తూ 19 వేల మంది స్వచ్ఛందంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంతకాలు చేశారని, వాటినీ పట్టించుకోలేదని తప్పుబట్టారు. అసలైన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో యథేచ్ఛగా పనులు చేస్తున్నారని, చెట్లను నరికేస్తున్నారని నివేదించారు. తక్షణమే అడ్డుకోకపోతే పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ బఫర్ జోన్ అయిన 25-35 మీటర్ల పరిధిలో చెట్ల నరికివేత చేపట్టరాదని తేల్చిచెప్పింది. ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
ఆదేశాలు అందాకే నిర్ణయం
జీహెచ్‌ఎంసీ అధికారి
మరోసారి సందిగ్ధంలో పడిన ప్రాజెక్టు పనులు
కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణానికి మరోసారి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. పార్కు చుట్టూ 25-35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎ్‌సజడ్) పరిధిలో చెట్లు నరకొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పనులు ముం దుకు సాగుతాయా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. పార్కు చుట్టూ 6 జంక్షన్లలో రూ.1090 కోట్లతో వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహరాజ అగ్రసేన్, కేబీఆర్ పార్కు ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలోని ముగ్ధ జంక్షన్ వద్ద పనులు మొదలయ్యాయి. కేన్సర్ ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్, అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్ మార్గంలో సెంట్రల్ మీడియన్‌లో ఉన్న చెట్లను తొలగించారు. కొన్నిటిని ట్రాన్స్‌లొకేషన్ చేశామని అధికారులు చెబుతున్నారు. సుప్రీం ఆదేశాలు వెలువడినా.. అగ్రసేన్ జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి. అండర్ పాస్ కోసం చెట్లు తొలగించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. కోర్టు ఆదేశాల ప్రతులు అందిన అనంతరం పనుల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఒకరు తెలిపారు. చెట్ల తొలగింపు ఆపాలని చెప్పిందా? మొత్తం పనులు నిలిపి వేయమన్నదా? అన్నది స్టే ఆర్డర్‌లో ఉంటుందని, దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కాగా, పార్కు చుట్టూ ఏడేసి వంతెనలు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉండగా.. అగ్రసేన్ జంక్షన్ వద్ద పనులకు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఆస్తుల సేకరణపై 50కిపైగా కేసులు విచారణలో ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్జీటీ అభ్యంతరంతో పనులు నిలిచిపోయాయి.