Supreme Court: మీకిదే చివరి చాన్స్!
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:52 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి
4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి
విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి
శాసనసభ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు తేల్చిచెప్పింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ రెండు వారాల్లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్‌కు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీ్‌హల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న సుప్రీంకోర్టు స్పీకర్‌కు గడువు విధించింది. అయితే, ఆ గడవులోగా స్పీకర్ స్పందించలేదని.. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం, శాసనసభ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్; పిటిషనర్లు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి తరఫున దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావు హాజరయ్యారు. స్పీకర్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. 10 అనర్హత పిటిషన్లలో ఏడింటిని పరిష్కరించారని, ఎనిమిదో పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉందని, మిగిలిన పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరారు. స్పీకర్ కంటికి శస్త్రచికిత్స జరిగిందని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారని.. అందువల్ల కొంత జాప్యం జరిగిందని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరఫున శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలకు స్పీకర్ విలువ ఇవ్వడం లేదని, ప్రతిసారీ వాయిదాలు కోరుతున్నారని అన్నారు.
ఒక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి అధికార పార్టీలో చేరి, ఆ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని స్పీకర్ ఇప్పటివరకు ముట్టుకోలేదని, మళ్లీ ఎనిమిది వారాలు గడువు కావాలంటే ఎలాగని ప్రశ్నించారు. స్పీకర్ తీరుతో కోర్టు గౌరవానికి భంగం కలుగుతోందన్నారు. స్పందించిన జస్టిస్ మసీహ్.. స్పీకర్ తీరును తప్పుపట్టారు. ‘‘స్పీకర్ ఇప్పటివరకు చేసిందేమీ లేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సమయం ఇచ్చాం. అయినా వినియోగించుకోలేదు. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? ఇదే మీకు చివరి అవకాశం. రెండు వారాల్లోగా తేల్చాల్సిందే’’ అని స్పష్టం చేశారు. కౌంటర్, రిజాయిండర్ దాఖలు చేయడానికి, రికార్డులను పరిశీలించడానికి తమకు కనీసం 4-6 వారాల సమయం కావాలని అభిషేక్ సింఘ్వీ పదేపదే కోరారు. ముకుల్ రోహత్గీ కూడా కనీసం నాలుగు వారాల సమయం కావాలని అడిగారు. దీంతో రెండు వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.