Share News

440కి 434 మార్కులొస్తే గొప్పా?

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:43 AM

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఆ విద్యార్థికి 440 మార్కులకు 434 మార్కులొచ్చాయి! అయినా తమ లెక్చరర్‌, తనకన్నా ఒక మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో ..

440కి 434 మార్కులొస్తే గొప్పా?

  • నీకన్నా మరో విద్యార్థికి ఒక మార్కు ఎక్కువే వచ్చిందిలే

  • ఇంటర్‌ బాలుడిని తూలనాడి చెంపదెబ్బకొట్టిన మహిళా లెక్చరర్‌

  • ఆత్మహత్య చేసుకున్న బాలుడు

  • గద్వాల జిల్లాలో విషాద ఘటన

గద్వాల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఆ విద్యార్థికి 440 మార్కులకు 434 మార్కులొచ్చాయి! అయినా తమ లెక్చరర్‌, తనకన్నా ఒక మార్కు ఎక్కువగా వచ్చిన విద్యార్థితో తననుపోల్చుతూ తీవ్ర అవమానకరంగా మాట్లాడారని, తనను చెంపదెబ్బ కొట్టారని ఆ అబ్బాయి లోలోపల బాధపడ్డాడు. తన ఆవేదననంతా మూడు పేజీల్లో రాసిపెట్టి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. గద్వాల రూరల్‌ కొత్తపల్లికి చెందిన 17ఏళ్ల నేతిబొట్టు తరుణ్‌ గద్వాలప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో తరుణ్‌ జిల్లాలో రెండో స్థానంలో నిలిచాడు. శనివారం కాలేజీలో తరుణ్‌కు వచ్చిన మార్కులను జిల్లాలో మొదటి ర్యాంకర్‌కు వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్‌ అతడిని అవమానించారు. ఇలా పోల్చడం, అవమానించడం చాలా తప్పు మేడం అంటూ తరుణ్‌ ఆమెతో అన్నాడు. దీనికి ఆమె అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘నీవేమైన మంత్రి కొడుకువా? అంతకన్నా గొప్పవాడివా? అంటూ చెంప మీద కొట్టింది. ఈ ఘటనతో క్లాసులోని తరుణ్‌ తోటి విద్యార్థులు ఘొల్లున నవ్వారు.

లెక్చరర్‌ తన పట్ల ప్రవర్తించిన తీరును తరుణ్‌ తీవ్ర అవమానంగా భావించాడు. ప్రిన్సిపల్‌ వీరన్నకు విషయం తెలియడంతో సోమవారం కాలేజీకి వచ్చిన తరుణ్‌కు బాధపడొద్దంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మంగళవారం తరుణ్‌ కాలేజీకి రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పునకు ఉరివేసుకున్నాడు. పొలం నుంచి తిరిగొచ్చిన తల్లిదండ్రులు బుచ్చన్న, రేణమ్మ.. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో కనిపించిన కుమారుడిని చూసి భోరుమన్నారు. తనకు జరిగిన అవమానంపై తరుణ్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. ‘‘విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రొత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదు. ఆమె(లెక్చరర్‌) చర్యల వల్ల నేను బాధపడ్డాను. కుంగిపోయాను. ఇది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సూసైడ్‌ నోట్‌ రాస్తున్నాను. ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలి. అవమానకర ఘటన అనేది ఒక సున్నిత మనస్కుడైన విద్యార్థిని ఎలా బాధిస్తుందో ఆమెకు అర్థం కావాలి’’ అని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Jul 29 , 2026 | 07:43 AM