శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి ఆపండి
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:21 AM
రానున్న రోజుల్లో తాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖను ఏపీ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఆ రాష్ట్ర జలవ నరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు.
ఈ మేరకు తెలంగాణను ఆదేశించండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో తాగునీటి అవసరాల నేపథ్యంలో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖను ఏపీ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఆ రాష్ట్ర జలవ నరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణ జెన్‌కో ఈనెల 21వతేదీన 24 గంటల పాటు విద్యుదుత్పాదన చేస్తూ... 40,751 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసిందని గుర్తు చేశారు. జల విద్యుదుత్పత్తి కోసం పరిమితికి మించి నీటిని వినియోగిస్తుండటంతో శ్రీశైలంలో నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కృష్ణా నది యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ)కి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయని, ఏపీ తాగునీటి అవసరాల నేపథ్యంలో జలవిద్యుత్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. ఇదే అంశంపై తెలంగాణ ఈఎన్‌సీకి కూడా ఏపీ ఈఎన్‌సీ లేఖ రాసిన విషయాన్ని పొందుపరిచారు. ఈనెల 21వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో శ్రీశైలం జలాశయంలో 875.80 అడుగుల నీటి మట్టం ఉందని(ప్రస్తుతం ఈనెల 28న 873.70 అడుగులు), మరోవైపు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఆశించిన స్థాయిలో లేదని, ఈ నేపథ్యంలోనే కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనను నిలిపివేశామని తెలిపారు. తక్షణమే శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదన జరగకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ జెన్‌కోను అడ్డుకోవాలని కోరారు.
వెలిగొండ కోసమేనా...
శ్రీశైలం నుంచి నీటిని తరలించడానికి వీలుగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభించనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి 43.50 టీఎంసీల నీటిని గ్రావిటీతో నల్లమలసాగర్‌కు తరలించి... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపలోని 30 మండలాలకు తాగునీటితో పాటు పాటు 4.47 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా దీని నిర్మాణం చేపట్టారు. తొలిదశలో 10.70 టీఎంసీలు, 1.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నేపథ్యంలో తగినంత నిల్వలు శ్రీశైలంలో ఉండటానికి వీలుగానే ఈ ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ అధికారులు భావిస్తున్నారు.