వీర్య దానం..విపరీత పోకడ
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:15 AM
‘వీర్యదానం’.. ఈ అంశం గురించి ఒకప్పుడు మాట్లాడటానికి కూడా సంకోచించేవారు. కానీ, ఇప్పుడది దేశంలో రూ.వేల కోట్ల వ్యాపారంగా మారింది. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆలస్యపు వివాహాలు, ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు నానాటికీ తీవ్రమవుతున్నాయి.
సంతానలేమితో స్పెర్మ్ బ్యాంకులకు డిమాండ్
దేశంలో సంతానోత్పత్తి సేవల మార్కెట్ రూ.16 వేలకోట్లు
ఐఐటీ, ఐఐఎం, అందమైన డోనర్ల కోసం ప్రీమియం రేట్లు
సోషల్ మీడియా వేదికగా అక్రమ వీర్యదాన దందా
నియంత్రణ లేకపోతే విపరీత పరిణామాలుంటాయి: నిపుణులు
వీర్యం స్ర్కీనింగ్ సరిగా చేయకుంటే పిల్లలకు వ్యాధులు వచ్చే ప్రమాదం
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ‘వీర్యదానం’.. ఈ అంశం గురించి ఒకప్పుడు మాట్లాడటానికి కూడా సంకోచించేవారు. కానీ, ఇప్పుడది దేశంలో రూ.వేల కోట్ల వ్యాపారంగా మారింది. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆలస్యపు వివాహాలు, ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. దీంతో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఆర్ట్) క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మనదేశంలో సంతానలేమి రేటు వేగంగా పెరుగుతోంది. పలు అధ్యయనాల ప్రకారం సుమారు 10-15 శాతం దంపతులు సంతానలేమితో బాధపడుతుండగా, అందులో దాదాపు 40-50 శాతం కేసుల్లో సమస్య పురుషుల్లోనే (తక్కువ శుక్రకణాల సంఖ్య లేదా నాణ్యత లోపం) ఉంటోంది. దీంతో ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్), ఇంట్రాయుటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) కేంద్రాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. దేశంలో అధికారిక, అనధికారిక స్పెర్మ్ బ్యాంకుల ద్వారాఏటా వేల సంఖ్యలో వీర్యం శాంపిళ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
డిజైనర్ బేబీల మోజు.. కాటలాగ్ కల్చర్!
ఒకప్పుడు కేవలం రక్త వర్గం మ్యాచ్ అయితే సరిపోయేది. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో కోరుకుంటూ ప్రత్యేక ఆర్డర్లు ఇస్తున్నారు. చదువు, తెలివితేటలున్న వారి వీర్యానికి మంచి గిరాకీ ఉంటోంది. ముఖ్యంగా ఐఐటీ, ఐఐఎం, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివే యువకుల వీర్యానికి భారీ డిమాండ్ ఉంటోందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే రూపురేఖలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎత్తు (కనీసం 5 అడుగుల 10 అంగుళాలు), తెల్లటి ఛాయ, మంచి శరీరాకృతి, కంటి రంగును బట్టి క్యాటలాగ్‌లను స్పెర్మ్ బ్యాంకులు సిద్ధం చేస్తున్నాయి. కొందరు దంపతులు కుల, మతాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. కళ్లు చెదిరే రేట్లు డిమాండ్ పెరుగుతుండటంతో స్మెర్మ్ రేట్లు కళ్లు చెదిరేలా ఉంటున్నాయి. సాధారణ డోనర్ శాంపిల్ ఖరీదు ఒకలా ఉంటే.. ప్రీమియం, సూపర్ డోనర్ (ఉన్నత విద్యావంతులు, మోడల్స్) శాంపిల్ ధరలు అంతకు ముడింతలు ఉంటున్నాయి. ఈ వ్యాపారంలో ఆర్థిక దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగ యువత పాకెట్ మనీ కోసం, సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా వీర్యదానాన్ని ఎంచుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఒకసారి శాంపిల్ ఇచ్చినందుకు డోనర్‌కు లభించే మొత్తం రూ.1,500 నుంచి రూ 5,000 మాత్రమే ఉంటుండగా.. క్లినిక్‌లు దానిని దంపతులకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయిస్తున్నాయి
ఏఆర్టీ చట్టం-2021 ఏం చెబుతోందంటే..
భారత ప్రభుత్వం తెచ్చిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021లో కఠిన నిబంధనలు ఉన్నాయి. డోనర్ వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వీర్యాన్ని దానం చేయాలి. డోనర్ గుర్తింపును పూర్తిగా గోప్యంగా ఉంచాలి. దంపతులకు డోనర్ ఎవరో తెలియకూడదు. అన్ని స్పెర్మ్ బ్యాంకులు జాతీయ రిజిస్ర్టీలో నమోదు చేసుకోవాలి. డోనర్ ఇచ్చే వీర్యానికి వైద్య పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా హెచ్‌ఐవీ, హెపటైటిస్, జన్యుపరమైన వ్యాధుల స్ర్కీనింగ్ విధిగా నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ, ఈ కఠిన నిబంధనలను తప్పించుకోవడానికి బ్లాక్ మార్కెట్ పుట్టుకొచ్చింది. వీర్యం విక్రయాల కోసం ఫేస్‌బుక్, టెలిగ్రామ్ గ్రూపులు నడుస్తున్నాయి. క్లినిక్‌ల ఫీజులు భరించలేని మధ్యతరగతి దంపతులు, నేరుగా డోనర్లను ఇలాంటి గ్రూపుల ద్వారా సంప్రదిస్తున్నారు. అలాగే సహజ పద్ధతి పేరిట కొన్నిసార్లు డోనర్లతో ప్రత్యక్ష శృంగారం ద్వారా గర్భం దాల్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా నియంత్రణ లేని వీర్య వ్యాపారం భవిష్యత్‌లో తీవ్ర ముప్పులకు దారితీస్తుందని వైద్య, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కన్సాంగ్వినిటీ (సమీప రక్తసంబంధ వివాహాల ప్రమాదం) చోటుచేసుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒకే డోనర్ డబ్బు కోసం పదుల సంఖ్యలో వేర్వేరు ప్రాంతాల్లో వీర్యదానం చేేస్త.. భవిష్యత్తులో ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు తెలియకుండా పెళ్లిళ్లు చేసుకునే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతేకాకుండా సరైన స్ర్కీనింగ్ లేకుండా జరిగే దానాల వల్ల ప్రాణాంతక జన్యు లోపాలు పిల్లలకు బదిలీ అవుతాయి.
1.69 బిలియన్ డాలర్ల మార్కెట్
ప్రపంచ స్పెర్మ్‌బ్యాంక్ మార్కెట్‌లో ఆసియా-పసిఫిక్ ప్రాంతం అత్యంత వేగంగా వృద్థి చెందుతోంది. ఇది 7.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో విస్తరిస్తుండగా, ఇందులో అత్యధిక మార్కెట్ వాటాను మనదేశానిదేనని లెక్కలు చెబుతున్నాయి. 2025 నాటికే భారతదేశ సంతానోత్పత్తి సేవల మార్కెట్ విలువ రూ.16,119 కోట్ల ( 1.69 బిలియన్ డాలర్లు)కు చేరింది. ఇది 12.20 శాతం వృద్ధి రేటుతో 2034 నాటికి 4.91 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో ఏటా మూడు నుంచి మూడున్నర లక్షల వరకు ఐవీఎఫ్ సైకిల్స్ నిర్వహిస్తుండగా, అసలైన డిమాండ్ మాత్రం దాదాపు 10 లక్షల నుంచి15 లక్షల సైకిల్స్ వరకు ఉంటుందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు.