దుబాయి, ఢిల్లీకి సిట్?
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:43 AM
మొయినాబాద్ ఫాంహౌస్లో కాల్పులు, డ్రగ్స్ కేసు విచారణకు ఏర్పాటైన సిట్.. ఉగాది రోజున కూడా తన విచారణ కొనసాగించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్.. కాల్పులు....
ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపీ
గతంలో దుబాయిలో మరణించిన కేదార్‌తో నిందితులకు సన్నిహిత సంబంధాలపై ఆరా
రోహిత్, రితేశ్, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
మొయినాబాద్ ఫాంహౌస్లో కాల్పులు, డ్రగ్స్ కేసు విచారణకు ఏర్పాటైన సిట్.. ఉగాది రోజున కూడా తన విచారణ కొనసాగించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న సిట్.. కాల్పులు, డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వారి వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిట్ బృందాలు త్వరలో ఢిల్లీ, దుబాయి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి ఆస్తుల పంచాయితీ ఉందనే ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ నిర్మాత, దుబాయిలో పలు వ్యాపారాలు చేసిన సెలగంశెట్టి కేదార్ కొంతకాలం క్రితం దుబాయ్‌లో మరణించారు. కేదార్‌పై హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అలాగే, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేదార్ ద్వారా దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేదార్ దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో మరణించిన సమయంలో రోహిత్ రెడ్డితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీకి కేదార్‌తో సంబంధాలున్న వారు కూడా హాజరయ్యారని అంటున్నారు. దుబాయిలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో వీరంతా రోహిత్ రెడ్డితో చర్చించారనే అనుమానాలు ఉన్నాయి. విచారణ ముందుకు వెళుతున్న కొద్దీ ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరోపక్క, నిందితుల్లో కొందరు ప్రత్యక్షంగా లేదా పరక్షోంగా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నటు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసు మూలాలు దుబాయి, ఢిల్లీలో ఉన్నట్లు తేలింది. దీంతో సిట్ బృందాలు విచారణ నిమిత్తం త్వరలో దుబాయ్, ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ మాఫీయా మూలాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పలు బృందాలు పని చేస్తున్నాయి. అయితే, ప్రధాన నిందితులను కస్టడీకి తీసుకున్న తర్వాత లోతుగా విచారణ మొదలవుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇద్దరు నిందితుల విచారణ
ఉగాది పండుగ రోజు కూడా సిట్ బృందం ఈ కేసు దర్యాప్తులో నిమగ్నమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శరత్, కౌశిక్ రవిని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం విచారించింది. వారి నుంచి వాంగ్మూలాల పత్రాలపై సంతకాలు తీసుకుంది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు బీఆర్‌ఎస్ నేత రోహిత్‌రెడ్డితో పాటు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీపై ఉప్పరిపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వనుంది. ఈ నేపధ్యంలో కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై సిట్ బృందం కసరత్తు చేస్తోంది. రిమాండ్‌లో ఉన్న వారిని కస్టడీకి తీసుకోగానే ఇప్పటి వరకు బయట ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రోహిత్‌రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌శర్మను అధికారులు విచారించనున్నారు. వీరిని ఒక సారి విచారించిన తర్వాత భిన్నమైన సమాచారం ఇచ్చిన నిందితులను ఎదురెదురుగా కూర్చోబెట్టి సాక్ష్యాలతో విచారించే అవకాశముంది. నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి డ్రగ్స్‌ను సిమ్లాలో కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ విచారణలో అది అవాస్తవమని తేలింది. డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో అభిషేక్ సింగ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తేలినట్టు సమాచారం. ఇలా నిందితులు మరికొన్ని విషయాల్లో కూడా పరస్పరం విరుద్ధంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రిమాండ్‌లో ఉన్న వారిని కస్టడీకి తీసుకున్న తరువాత ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి.