ఇల్లు మారితే ఓటు పోతుందా?
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:05 AM
బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు సర్ భయం పట్టుకుంది. ముఖ్యంగా గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు..
సర్ ప్రక్రియపై అద్దె ఇళ్లలో ఉండేవారి ఆందోళన
కొత్త అడ్రస్‌కు ఓటును మార్చుకోవటంపై ఆరా
జోరందుకున్న సర్.. పట్టణాల్లో నత్తనడక
సర్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించొద్దు: సీఎస్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు సర్ భయం పట్టుకుంది. ముఖ్యంగా గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు.. ఇప్పుడు ఆ చిరునామాలో లేకుంటే తమ ఓటు ఉంటుందా? తీసేస్తారా? అనే సందేహంతో ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇంటి చిరునామాకు సంబంధించిన రుజువు పత్రాలు లేకుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా అద్దె ఇళ్లలో ఉండి అడ్రస్ మారినవారి సందేహాలకు కేంద్రఎన్నికల సంఘం (ఈసీఐ) పలు పరిష్కారాలు చూపింది.
అద్దె ఇంట్లో ఉంటున్నవారు సర్ ప్రక్రియలో ఓటును ఎలా నమోదుచేసుకోవాలి?
అద్దెకు ఉంటున్నవారికి ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఓటరుగా నమోదు చేసుకునే హక్కు ఉంటుంది. అయితే, తమ నివాసాన్ని నిర్ధారించే ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. చిరునామా ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకపోతే బీఎల్‌వోలు స్థానికంగా విచారణ చేసి సంబంధిత ఓటరు ఆ చిరునామాలోనే నివసిస్తున్నారని నిర్ధారించవచ్చు.
దరఖాస్తులో చిరునామా ఎలా నమోదు చేయాలి?
ప్రస్తుతం నివసిస్తున్న అద్దె ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. ఆధార్ కార్డు, ఇతర పత్రాల్లో ఉన్న చిరునామాతో వీలైనంత వరకు సరిపోలేలా ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేవారు ఫారం- 8 సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పోస్టాఫీస్ పాస్‌బుక్, ప్రభుత్వం జారీచేసిన చిరునామా పత్రాలు, ఇంటి అద్దె ఒప్పందం పత్రం, ఇంటి యజమాని ఇచ్చిన నివాస ధ్రువీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, గ్యాస్ కనెక్షన్ పత్రం, బ్యాంకు పాస్‌బుక్, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్‌లోని చిరునామా వివరాలను ధ్రువీకరణగా సమర్పించవ చ్చు.
ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఏ ఫారం సమర్పించాలి?
ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించాలి. అందులో తమ పేరు, వయస్సు, చిరునామా, కుటుంబ వివరాలను ధ్రువీకరించాలి. అవసరమైన గుర్తింపు, నివాస ఆధారాలు జతచేయాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో చోటికి మారినవారు కొత్త చిరునామాలో ఓటరుగా నమోదు కావడానికి ఫారం-6 సమర్పించాలి. పేరు, వయస్సు, ఫొటో, లింగం, బంధుత్వం, చిరునామాలో తప్పులుంటే సరిచేసేందుకు ఫారం-8 సమర్పించాలి. మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలసపోయినవారి పేర్లను తొలగించేందుకు ఫారం-7 సమర్పించాలి. దాంతోపాటు మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర ఆధారాలు ఇవ్వాల్సి రావచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే తగిన ఆధారాలతో ఫారం-6 సమర్పించాలి.
బీఎల్‌వోలు ఇంటికి వచ్చి ఫారం ఇవ్వకపోతే ఏంచేయాలి?
సంబంధిత బీఎల్‌వో, ఈఆర్‌వో, ఏఈఆర్ వో కార్యాలయాన్ని సంప్రదించి ఫారం పొందవచ్చు. ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
సర్ ప్రక్రియలో ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలా?
ఆధార్ ఒక గుర్తింపు పత్రం అయినప్పటికీ, అదిఒక్కటే ఆధారం కాదు. ఎన్నికల సంఘం సూచించిన ఇతర గుర్తింపు, వయస్సు, నివాస ఆధారాలను కూడా సమర్పించవచ్చు.
పల్లెల్లో జోరందుకున్న సర్వే
సర్ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో వేగం పుంజుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా మందకొడిగానే సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ వోలు పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు శనివారం తెలిపారు. ప్రస్తుత ఓటరు జాబితాలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 1,02,75,000 (30.08 శాతం) మందికి ఎన్యుమరేషన్ పత్రాలను అందజేశారు. అయితే, చాలాచోట్ల ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్‌వోలకు బదులుగా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా నియమితులైన బీఎల్‌ఏలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు అందాయి. స్పందించిన ఆయన బీఎల్‌వోల ప్రమేయం లేకుండా బీఎల్‌ఏలు ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేయొద్దని ఆదేశించారు.
సర్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించొద్దు: సీఎస్
సర్ సర్వేలో పాల్గొంటున్న అధికారులకు రెగ్యులర్ విధులను అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, బూత్ స్థాయి సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలకు ఎలాంటి రెగ్యులర్ విధులు అప్పగించవద్దని సూచించారు. వారిని బదిలీ కూడా చేయరాదని స్పష్టంచేశారు. ఒకవేళ ఏ అధికారిని అయినా సర్ విధుల నుంచి మినహాయించాలంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు.