Electricity Connection: కొత్త కనెక్షన్.. ఇక ఈజీ
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:32 AM
ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్ కావాలనుకుంటే ఆ మేరకు ఛార్జీలు చెల్లిస్తే చాలు..
రైతుపై తగ్గనున్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ భారం
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్ కావాలనుకుంటే ఆ మేరకు ఛార్జీలు చెల్లిస్తే చాలు.. కరెంట్ కనెక్షన్ లభిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనపు చార్జీలు, విద్యుత్ సిబ్బంది చేతివాటం నుంచి రైతులకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఇప్పటి వరకున్న విధానం ప్రకారం.. వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే రైతు పొలంలో ఉన్న మోటారు నుంచి మూడు విద్యుత్ స్తంభాల లోపు ఉంటే కనెక్షన్ ఇస్తున్నారు. మూడు స్తంభాలు దాటితే ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ (ఓఆర్‌సీ) కింద రైతు విద్యుత్ శాఖకు రూ.45వేల పైన కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం టీజీఈఆర్‌సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ భారం రైతుల మీది నుంచి తొలగిపోనుంది. అంతేకాదు.. అపార్ట్‌మెంట్‌లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో కరెంటు కనెక్షన్ తీసుకోవటం కూడా ఇకపై సులువు కానుంది. ఎస్టిమేషన్స్ పేరిట జరిగే దందాలకు తెర పడే అవకాశం ఉంది. తీసుకునే కరెంటు కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా చార్జీలు చెల్లిస్తే చాలు కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంటు లైనుకు ఒక కిలోమీటర్ లోపు అపార్ట్‌మెంట్/నివాస సముదాయం ఉంటే.. కరెంటు సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక అపార్ట్‌మెంట్ కరెంటు వినియోగం 25 కిలోవాట్లు అనుకుంటే.. కిలోవాట్‌కు రూ.10 వేలచొప్పున.. 25కిలోవాట్లకు రూ.2.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆ అపార్ట్‌మెంట్‌కు అవసరమైన లైన్లు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్ బిగించడం కూడా డిస్కమ్‌దే బాధ్యత. కరెంటు లైనుకు కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం.. పూర్తి ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేసే అధికారం డిస్కమ్‌లకు ఉంటుందని టీజీఈఆర్‌సీ స్పష్టం చేసింది. 150 కిలోవాట్లు లేదా ఆ పైన లోడు కోసం కొత్తగా సరఫరా వ్యవస్థకు వెచ్చించిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ డిస్కమ్‌లకు 2020లో ఆదేశాలు జారీ చేసింది. ఈ వెసులుబాటుతో రెగ్యులేషన్‌ను సవరించాలని డిస్కమ్‌లు ఏడాది కిందట ఈఆర్‌సీని కోరాయి. ఈ నిబంధనలతో నష్టం జరిగిందని డిస్కమ్‌లునిర్ధారణకు వస్తే.. తదుపరి వార్షిక ఆదాయ అవసరాలు పిటిషన్‌లో ట్రూ-అప్ కింద వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీజీఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది.