1000 కోట్ల భూకుంభకోణం!
ABN , Publish Date - May 22 , 2026 | 04:10 AM
ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్‌టె ర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో.. దాదాపు రూ.1000 కోట్ల భూకుంభకోణం! రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే....
శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు
ప్రభుత్వానికి సన్నిహితుణ్నని చెప్పుకొంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్‌దందా
94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు ధారాదత్తం
సీసీఎల్‌ఏ ఇవ్వాల్సిన ఉత్తర్వులను శంషాబాద్ తహసీల్దారే ఇచ్చిన చిత్రం
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే ఉత్తర్వులు
మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధం
తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏసీబీ విచారణ!
హైదరాబాద్, మే 21 (ఆంధ్ర జ్యోతి): ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్‌టె ర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో.. దాదాపు రూ.1000 కోట్ల భూకుంభకోణం! రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేటు పార్టీకి కట్టబెట్టారు. మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధమైంది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుణ్నని చెప్పుకొనే వ్యక్తి (ఆయన ఒక సొసైటీ వైస్ చైర్మన్) ఈ భూకుంభకోణం వెనుక ఉన్నట్లు సమాచారం. ‘‘ప్రభుత్వ మద్దతు నాకుంది. నీకెందుకు నేను చూసుకుంటా’’ అంటూ ఆయన ఇచ్చిన భరోసాతో.. ఈ భూములకు సంబంధించి.. రెవెన్యూ కార్యదర్శి, సీసీఎల్‌ఏలు ఇవ్వాల్సిన ఉత్తర్వులను స్థానిక తహసీల్దారే ఇచ్చేయడం గమనార్హం. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. 2023లో ఇక్కడ హెచ్‌ఎండీఏ భూములు వేలం వేసినప్పుడు గజం సుమారుగా రూ.30 వేలు పలికింది. ఇక్కడ ఎకరా ధర రూ.5-8 కోట్ల దాకా ఉంది. ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు ధారాదత్తం చేసిన 94 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు.. అన్యాక్రాంతం చేయడానికి సిద్ధంగా ఉన్న 176 ఎకరాలను కూడా కలిపితే మొత్తం భూమి విలువ రూ.1000 కోట్లపై మాటే. పెద్దషాపూర్ పరిధిలో ఆర్డర్ పాస్ చేసిన 94.73 ఎకరాల భూమి (సర్వే నంబరు 172 నుంచి 180 వరకూ) మీద గతం నుంచి వివాదాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నందున దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే.. ప్రభుత్వ స్థాయిలో జరగాలి. ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిని క్లెయిమ్ చేస్తే కలెక్టర్ ద్వారా తహసీల్దారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఈ కేసులో శంషాబాద్ తహసీల్దారే సీసీఎల్‌ఏ అవతారం ఎత్తారు.తన వెనుక ఒక సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నారనే భరోసాతో బరితెగించారు. ఈ భూములను ఒక పార్టీకి కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రొసీడింగ్స్ జారీ చేసేశారు. ఇది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కోర్టు నుంచి ఇప్పటి వరకు ఫైనల్ డిక్రీ కూడా రాలేదని తెలిసినా కోర్టు పేరు చెప్పి ఉత్తర్వులివ్వడంపై చర్చ జరుగుతోంది.
క్రిమినల్ కేసులు ఉన్నా..
సర్వే నంబరు 626/1 పరిధిలో ఉన్న భూముల విషయంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసినా.. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధిచేకూర్చేలా తహసీల్దార్ వ్యవహరించడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సీఎస్-7 పరిధిలో లేని భూములను సైతం ఆ పరిధిలోకి తెచ్చి అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారని.. ఈ విషయంలో ఏకంగా పై అధికారులను కూడా లెక్క చేయకుండా తహసీల్దార్ వ్యవహరించారని సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిసినా.. తన వెనుక ఉన్న వ్యక్తిని చూసుకుని ఆయన ఈ తెగింపు ప్రదర్శించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ కూడా దృష్టిసారించినట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్‌ను పిలిపించుకుని.. ఆయన ఇచ్చిన ఉత్తర్వులపై కూపీ లాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ అగ్రనేతలు కూడా ఈ కుంభకోణంపైన.. దీని వెనుక ఉన్న వైస్‌చైర్మన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.