అమ్మో.. 131(1ఎ)
ABN , Publish Date - May 19 , 2026 | 05:46 AM
తెలుగు రాష్ట్రాల్లోని బడా బాబుల గుండెల్లో ఇప్పుడు 131 (1ఎ) నోటీసు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సమాధానం చెప్పుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారు.
బడాబాబుల్లో గుబులు పుట్టిస్తున్న ఐటీ సెక్షన్, నోటీసు
దేశంలోనే అత్యధిక నోటీసులు హైదరాబాద్ యూనిట్ నుంచే
రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఇన్వెస్టిగేషన్ విభాగం పరిధిలోకే
అందుకే, రియల్ ఎస్టేట్, బడా బడా వ్యాపారుల్లో ఆందోళన
జవాబు ఎలా చెప్పాలంటూ నోటీస్ అందిన వారి తర్జనభర్జన
నోటీసు తమకూ వస్తుందా అంటూ మిగతా వారిలో గుబులు
దీని కింద నోటీసు అందితే.. చిట్టా మొత్తం విప్పాల్సిందే..
ఈ నోటీసిచ్చే అధికారికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని బడా బాబుల గుండెల్లో ఇప్పుడు 131 (1ఎ) నోటీసు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సమాధానం చెప్పుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ ఏంటా నోటీసు అంటారా? ఆదాయ పన్ను చట్టంలో అత్యంత పవర్‌ఫుల్ సెక్షన్ ఇది. పన్ను ఎగ్గొట్టారన్న అనుమానం వస్తే నోటీసు జారీ చేసే సెక్షన్. ఇప్పటికే నోటీసు వచ్చిన వాళ్లు దానికి జవాబు ఎలా ఇవ్వాలని మల్లగుల్లాలు పడుతుండగా.. తమకు కూడా ఎక్కడ వస్తుందోనని మరి కొంతమందిలో గుబుల్లో నెలకొంది. బడా బాబుల సర్కిళ్లలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అంతేనా.. గత రెండేళ్లలో ఈ సెక్షన్ కింద దేశంలోనే అత్యధిక నోటీసులు హైదరాబాద్ యూనిట్ ఇన్వెస్టిగేషన్ విభాగం నుంచే జారీ అయ్యాయట. దీని పరిధిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. వెరసి, తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్, బడా వ్యాపారస్తుల గుండెల్లో ఇప్పుడు ఈ నోటీసులు గుబులు రేపుతున్నాయి.
ఏంటీ 131 (1ఎ).. ఎందుకంత పవర్‌ఫుల్!
ఆదాయ పన్ను చట్టం కింద రిటర్నులు దాఖలు చేసినప్పుడు వాటికి సంబంధించి కొందరికి నోటీసులు వస్తూ ఉండడం పరిపాటి. పన్ను మదింపు సరిగా లేదని, అన్ని లావాదేవీలు చూపించలేదని అధికారులు భావించినా దానిపై వివరణ అడుగుతూ నోటీసులిస్తారు. కానీ, 131 (1ఎ) మాత్రం ప్రత్యేకం. ‘మీరు మీ ఆదాయాన్ని పూర్తిగా వెల్లడించకుండా.. కొంత దాచేశారు’ అన్న అనుమానం వస్తే చాలు.. ఈ సెక్షన్ కింద నోటీసు జారీ చేయొచ్చు. గతంలో మీకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా.. మీపై ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకున్నా.. మీ ఆదాయ పన్ను చెల్లింపు అంశంలో వివాదం లేకున్నా.. మీరు మీ ఆదాయంలో కొంత దాచేశారన్న అనుమానం వస్తే చాలు.. ఈ నోటీసు ఇవ్వొచ్చు. అంటే వివాదాలుంటేనే నోటీసు రావడం కాదు.

హఠాత్తుగా కూడా నోటీసులిచ్చి మొత్తం విచారణ చేసే అధికారం ఈ సెక్షన్ కింద ఉంటుంది. ఒక వ్యక్తి, నాయకుడు, వ్యాపారస్తుడు ఎవరైనా తమ ఆదాయ లెక్కలను సరిగా చూపించలేదని అనుమానం వస్తే చాలు.. ఈ సెక్షన్ కింద నోటీసు జారీ చేయొచ్చు. అంతేకాదు.. ఇలా నోటీసు ఇచ్చిన వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో, వారి బినామీల ఇళ్లలో సోదాలు చేయవచ్చు. నోటీసు అందుకున్నవారు నిర్ణీత తేదీన తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. వారికి సంబంధించిన సమస్త రికార్డులు తమ ముందు పెట్టాలని అడిగే అధికారం ఉంటుంది. ప్రస్తుత రికార్డులే కాకుండా.. పాత రికార్డులన్నీ కూడా తమ ముందు పెట్టాలనే అధికారమూ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. అనుమానం వస్తే చాలు.. ఎవరికైనా ఈ నోటీసు ఇవ్వొచ్చు. వారికి సంబంధించిన సమస్త ఆదాయ, వ్యయ సమాచారాన్ని తమ ముందు పెట్టాలని అడగొచ్చు. ఇంత అధికారం ఈ సెక్షన్ కింద ఇచ్చే నోటీసుకు ఉండడంతో బడా బాబులు కూడా ఈ నోటీసు వస్తే హడలెత్తిపోతారు.
సివిల్ కోర్టుకున్న అధికారాలుంటాయి
ఈ సెక్షన్ కింద ఇచ్చే నోటీసులకు న్యాయ అధికారాలు కూడా ఉంటాయి. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలే ఈ నోటీసులిచ్చిన అధికారికి కూడా ఉంటాయి. నోటీసు అందుకున్న వ్యక్తి తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీచేయవచ్చు. ఖాతా పుస్తకాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు సమర్పించాలని అడగొచ్చు. వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అడగడం, శోధించడం, ఆధారాల సేకరణ చేయవచ్చు.
పాత చరిత్ర అంతా తవ్వేస్తారు
ఆదాయ పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ విభాగం డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్ట ర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి ఈ నోటీసును జారీ చేయవచ్చు. ఇది ఐటీ అధికారుల చేతిలో పాశుపతాస్త్రం లాంటిదని ఆదాయ పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ నోటీసుల కింద ఫలానా ఏడాదికి సంబంధించిన ఆదాయాన్నే కాదు. గతం నుంచీ ఆదాయపు లెక్కలను, లావాదేవీలను తవ్వేస్తారు. అన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిందే. లేదంటే చట్టం ప్రకారం భారీ జరిమానాలు తప్పవు.