Share News

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:18 AM

రాయదుర్గం ఐదు ఎకరాల భూమి వివాదంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది.

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!

  • ప్రత్యామ్నాయ 2.5 ఎకరాలకు అంగీకారం

  • సీఎస్‌తో సమావేశం అనంతరం నిర్ణయం

  • ఎస్‌బీఐతో సర్కారు లావాదేవీలు యథాతథం

  • లీడ్‌ బ్యాంకు హోదా కూడా కొనసాగింపు

  • హైకోర్టు వాయిదా తర్వాత ప్రకటన!

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గం ఐదు ఎకరాల భూమి వివాదంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది. ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ భూములను కూడా తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయంలో ఎస్‌బీఐ సీజీఎం బృందం భేటీ అనంతరం బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాయదుర్గం భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి, ఆర్‌బీఐకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్‌బీఐ సోమవారం చర్చలకు వచ్చింది. బ్యాంకు వ్యవహరించిన తీరుపట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని, ప్రభుత్వ లావాదేవీల నుంచి ఉపసంహరణ, లీడ్‌ బ్యాంకు హోదా తొలగింపు దిశగా యోచిస్తున్నామని సీఎస్‌ వారికి చెప్పారు. ఇదే జరిగితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ఎస్‌బీఐ హైకోర్టులో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎస్‌ చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించారు. బ్యాంకు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేస్తూ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎస్‌బీఐ దిగొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎస్‌బీఐతో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. బ్యాంకులో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కేంద్రం నుంచి వివిధ శాఖలకు వచ్చిన మ్యాచింగ్‌ గ్రాంట్లు, ఇతరత్రా నిధులను బ్యాంకులోనే కొనసాగించనుంది. లీడ్‌ బ్యాంకు హోదాను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఐదెకరాల భూమిని వెనక్కి తీసుకొని, దాని స్థానంలో అదే ప్రాంతంలో మరోచోట 2.30 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. తెలంగాణ రీజియన్‌కు చెందిన ప్రతినిధులు మౌఖికంగా అంగీకరించారు కూడా. ప్రత్యామ్నాయ భూములను ఎస్‌బీఐ ప్రతినిధులు 2026 మే 12న సందర్శించారు. తరువాత ఉన్నతాధికారులు ఒప్పుకోలేదనే కారణంతో వేలం వేసిన భూములు తమవేనని ఎస్‌బీఐ కోర్టుకు ఎక్కింది. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంకు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రత్యామ్నాయ భూములను తీసుకునే అంశంపైనా చర్చ జరిగింది. వాటిపై మళ్లీ మాట మార్చకుండా ఉండాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. హైకోర్టులో పిటిషన్‌ ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని, తదుపరి విచారణ వరకు సమయం ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులు కోరారు. కోర్టు గడువు తరువాత టీజీఐఐసీతో మళ్లీ భేటీ అవుతారు.

Updated Date - Jun 24 , 2026 | 04:18 AM