Share News

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నేరస్థులకు కాదు!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:16 AM

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే నేరస్థులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది బాధితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌  నేరస్థులకు కాదు!
CM Revanth Reddy with dgp anand

  • చట్టాన్ని ఎదిరిస్తే ఎంతటి వారైనా వదలం

  • 2027 చివరికల్లా మొత్తం పోలీసు పోస్టుల భర్తీ

  • ఆహార కల్తీ అతి పెద్ద సమస్యగా మారింది

  • సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడికి పటిష్ఠ చర్యలు

  • పోలీస్‌ అమరవీరుల కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే నేరస్థులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది బాధితులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసు అమరవీరులు సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషా మహల్‌ పోలీసు స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన రేవంత్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ‘అమరులు వారే’ అనే పుస్తకాన్ని అవిషరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. సమస్యలు, కష్టాలతో స్టేషన్‌కు వచ్చే బాధితులను మరిన్ని ఇబ్బందులకు గురి చేయవద్దని, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని, అదే సమయంలో నేరస్థుల పట్ల కఠినంగా పోలీసు వైఖరి ఉండాలని సీఎం స్పష్టం చేశారు.


పోలీసుల ప్రవర్తనే వారిపై ప్రజలకు నమ్మకాన్ని పెంచగలదని, పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో చట్ట పరిధిని దాటి పని చేయవద్దని సూచించారు. పోలీసులకు క్రమశిక్షణే బలమని, నిజాయితీయేగౌరవమని, ప్రజల్లో కలిగిన భరోసా భావనే పోలీసులకు లభించే గొప్ప గుర్తింపు అని సీఎం అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లకు కోటి రూపాయలు పరిహరం ఇస్తున్నామని ప్రస్తావించారు. అమరుల కుటుంబా ల పిల్లలకు వైద్య విద్యలో ప్రత్యేక సీట్లు కేటాయించామని, పోలీసు భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ16 లక్షలు, పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పోలీసు శాఖలో 16 వేలకు పైగా ఖాళీలను గుర్తించగా, ఇప్పటికే ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. వచ్చే ఏడాది చివరిలోపు మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. మంచిరేవులలో 44 ఎకరాల్ల్లో యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ ఏర్పాటు చేశామన్నారు. హోంగార్డుల రోజువారీ వేతనం రూ.1,000కి పెంచామని చెప్పారు. నేర పరిశోధనలో ఏఐకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పోలీసు సమాచార వ్యవస్ధ మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అనుసంధానం చేశామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకంగా మారిన ఆహార కల్తీని అరికట్టడానికి టీజీ సేఫ్‌ వ్యవస్ధను ఏర్పాటు చేయడమే కాకుండా దానిని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


ఆహార కల్తీకి పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలేది లేద న్నారు. మహిళా భద్రతా కోణంలో స్టాండ్‌ విత్‌ హర్‌ అనే ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, మహిళలు, చిన్నారులకు తక్షణ రక్షణ అందించేందుకు స్పందన బృందాలు సిద్ధం చేశామని వివరించారు. చిన్నారుల కేసుల్లో సున్నితంగా వ్యవహరించాలని, బాధితులకు న్యా యం అందించడంలో జాప్యం చేయవద్దని సీఎం పోలీసులకు సూచించారు. పోలీసు శాఖలో యువరక్తం ఇంకా రావాలని కోరారు. అంతకుముందు డీజీపీ ఆనంద్‌ మాట్లాడుతూ, నిజాయితీగా ప్రతి పోలీసు సేవ చేయడమే అమరులకు ఇచ్చే నివాళి అన్నారు. ప్రజల సమస్యలకు చట్టప్రకారం నిజాయితీతో పరిష్కారం చూపాలన్నారు

ఈ వార్తలు కూడా చదవండి..

టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ

Updated Date - Oct 22 , 2026 | 04:17 AM