Share News

మెట్రో ఫైళ్లు కదిలించండి

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:26 AM

రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి, హైదరాబాద్‌ మహానగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ (ఫేజ్‌-2), నిర్వహణ....

మెట్రో ఫైళ్లు కదిలించండి

  • మెట్రో ఫేజ్‌-1 తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ, ఫేజ్‌-2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. హైదరాబాద్‌ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి. హైదరాబాద్‌ మెట్రో భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందుకు కదిలించేందుకు స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలి.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కిషన్‌రెడ్డీ.. వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి

  • ఖట్టర్‌.. తక్షణమే ప్రత్యేక చొరవ చూపండి

  • మెట్రో విస్తరణలో జాప్యం లేకుండా చూడండి

  • కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌ అత్యవసర లేఖలు

  • ఫేజ్‌-2 విస్తరణకు తక్షణమే ఆమోదం తెలపాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి ఫేజ్‌-1 బదిలీని వేగిరం చేయాలి

  • ప్రాజెక్టు ఆలస్యమయ్యే ప్రతి నెలా భారీ మూల్యం

  • ఎస్‌బీఐ క్యాప్స్‌ నియామకంలో ఎందుకీ జాప్యం?

  • జూన్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదు

  • లేఖల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి, హైదరాబాద్‌ మహానగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ (ఫేజ్‌-2), నిర్వహణ (ఫేజ్‌-1) విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఫేజ్‌-2 నిర్మాణానికి తక్షణమే పరిపాలన, ఆర్థిక ఆమోదం తెలపాలని, ఫేజ్‌-1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలు పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలకు శనివారం సీఎం వేర్వేరుగా లేఖలు రాశారు. మెట్రో ప్రాజెక్టు అమలులో జరిగే ఆలస్యం వల్ల ప్రతి నెలా ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి ప్రాజెక్టుపై రూ.వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని లేఖల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖల ప్రతిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. ఇందులో.. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. కేంద్ర పట్టణాభివృద్థి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జూన్‌ 23న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో, 24న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో.. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో జరిగిన కీలక సమావేశాలను లేఖలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తుచేశారు.


ఆ సమావేశాల్లో.. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 బదిలీ, ఫేజ్‌-2 విస్తరణపై ఎంతో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇప్పటివరకు వాటిలో ఒక్కటి కూడా అమల్లోకి రాలేదంటూ అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌బీఐ క్యాప్స్‌)కు హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాలనే అంగీకారం కుదిరిందని సీఎం తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్‌ అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాప్స్‌ పరిశీలించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో ఫేజ్‌-2 నిర్మాణానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయని, అందుకే ఫేజ్‌-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, వివిధ నిధుల వనరుల అన్వేషణ, సమగ్ర ఆర్థిక వ్యూహానికి కూడా అదే సంస్థ రూపకల్పన చేయాలని నాటి భేటీలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌)ను వెంటనే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేేసందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మునిసిపల్‌ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్‌ అధికారిగా నియమించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

ఇకపై జాప్యం చేయొద్దు..

జూన్‌లో నిర్ణయం తీసుకుంటే ఇప్పటిదాకా ఎస్‌బీఐ క్యాప్స్‌ను కేంద్రం అధికారికంగా నియమించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదన్నారు. దీంతో మెట్రో ఫేజ్‌-1 బదిలీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, ఇది రోజువారీ నిర్వహణలోనూ ఇబ్బందులకు దారితీస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఎస్‌బీఐ క్యాప్స్‌ నియామకం ఆలస్యం కావడం వల్ల మెట్రో ఫేజ్‌-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు కేంద్ర అనుమతులు కూడా ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. మెట్రో ఫేజ్‌-1 తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ, ఫేజ్‌-2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. ‘హైదరాబాద్‌ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పెండింగ్‌ ఫైళ్లను ముందుకు కదిలించేందుకు కేంద్రం పెద్దలతో మాట్లాడాలి’ అని రేవంత్‌ కోరారు.

Updated Date - Jul 06 , 2026 | 04:02 AM