Share News

యాదాద్రిలో వేదపాఠశాలకు భూమిపూజ

ABN , Publish Date - May 24 , 2026 | 05:03 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ‘శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేదపాఠశాల’ నిర్మాణానికి శ్రీకారం చుట్టుకుంది. శనివారం ఉదయం 9.38 గంటల ముహూర్తానికి..

యాదాద్రిలో వేదపాఠశాలకు భూమిపూజ

  • కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి

యాదాద్రి, మే23 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ‘శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేదపాఠశాల’ నిర్మాణానికి శ్రీకారం చుట్టుకుంది. శనివారం ఉదయం 9.38 గంటల ముహూర్తానికి.. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి.. సీఎం రేవంత్‌ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రూ.43.80 కోట్ల వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో.. దాదాపు 300 మంది విద్యార్థుల వేద విద్యాధ్యయనానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతరత్రా సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భూమిపూజ నిమిత్తం వచ్చిన కంచి పీఠాధిపతికి, ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం రేవంత్‌ రెడ్డి భూమిపూజాస్థలిలో శంకుస్థాపన, నవగ్రహ పూజ చేశారు. పండితులు చతుర్వేద పారాయణ చేశారు. అనంతరం అదే వేదిక ప్రాంగణంలో యాదగిరిగుట్టపై రూ.56.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న స్వామివారి నిత్యకల్యాణ మండపం, రంగ మండపం, మాఢవీధులకు మెట్లు, వైకుంఠద్వారం నుంచి గల మెట్లమార్గంలో నీడ కోసం పైకప్పు, దీక్షాపరుల మండపాలకు శంకుస్థాపన చేశారు. వాటన్నింటికీ సంబంధించిన శిలాఫలకాలను కంచిపీఠాధిపతితో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం వేదపాఠశాల భూమి పూజ వేదికపై వేదపండితులు సీఎంకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మహావేదాశీర్వచనం జరిపారు. కంచి కామకోటి పీఠ జ్ఞాపికను అందజేసి, శేషవస్త్రాలతో సన్మానించారు. ఆ తర్వాత సీఎం యాదగిరీశుణ్ని దర్శించుకుని, ప్రత్యేక పూజ ల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీఎంకు స్వాగతం పలకని యంత్రాంగం..

వేదపాఠశాల భూమిపూజకు వచ్చిన సీఎం, మంత్రులకు స్వాగతం పలకడానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులే కాదు.. కనీసం సెక్యూరిటీ సిబ్బంది సైతం రాలేదు. దీంతో హెలికాప్టర్‌లోనే అయిదు నిమిషాలపాటు సీఎం నిరీక్షించిన సంఘటన చర్చానీయాంశమైంది. భూమిపూజ ముహూర్తానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కార్యాల యం షెడ్యూలును రూపొందించింది. దాని ప్రకారం ఆయన తొలుత యాదగిరీశుణ్ని దర్శించుకుని, ఆ తర్వాత భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, హైదరాబాద్‌ నుంచి సీఎం బయలుదేరడం ఆలస్యమైంది. దీంతో సీఎం తన షెడ్యూల్‌ను హెలికాప్టర్‌లోనే మార్చుకున్నారు. ఈ విషయం తెలియక.. జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి గోశాల పక్కన హెలీప్యాడ్‌ వద్ద సీఎం హెలికాప్టర్‌ కోసం వేచి ఉన్నారు. కానీ, షెడ్యూల్‌ మారడంతో.. సీఎం హెలికాప్టర్‌ టెంపుల్‌సిటీలోని శాశ్వత హెలీప్యాడ్‌లో ల్యాండ్‌ అయింది. అందులో ఉన్న సీఎం, మంత్రులు.. ఐదు నిమిషాలపాటు అందులోనే వేచి చూసి.. తమను రిసీవ్‌ చేసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో కిందికి దిగి భూమిపూజాస్థలివైపు నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించా రు. ప్రభుత్వవిప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సమాచారం అందుకుని పరుగున ఎదురెళ్లి వారికి స్వాగతం పలికారు. అక్కడున్న క్యారవాన్‌లో సీఎం తన దుస్తులు మార్చుకుని, సంప్రదాయ దుస్తులు ధరించి భూమిఫూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, హెలీప్యాడ్‌ వద్ద సీఎం, మంత్రుల నిరీక్షణకు సంబంధించి రాష్ట్ర సచివాలయ అధికారులు జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో మాట్లాడి ఆరా తీసినట్టు తెలిసింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించి.. హెలీప్యాడ్‌ వద్ద విధుల్లో ఉన్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్టు సమాచారం.

Updated Date - May 24 , 2026 | 05:03 AM