శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రతికూల వాతావరణం
ABN , Publish Date - Jul 30 , 2026 | 06:53 AM
ఢిల్లీ పర్యటన ముగించుకుని విమానంలో హైదరాబాద్‌కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆందోళనకర పరిస్థితి ఎదురైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌కి ఇబ్బందులు ఏర్పడ్డాయి.
సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం గాల్లో చక్కర్లు
ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండింగ్
శంషాబాద్ రూరల్ (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీ పర్యటన ముగించుకుని విమానంలో హైదరాబాద్‌కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆందోళనకర పరిస్థితి ఎదురైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆ విమానం కొంత సమయం గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయంలో సాయంత్రం 6.15 గంటలకు ఇండిగో 6ఈ 717 విమానంలో సీఎం రేవంత్‌రెడ్డి బయల్దేరారు. రాత్రి 8.30 గంటలకు ఆ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుంది.
అయితే ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీసీ అధికారుల సూచనల మేరకు పైలెట్ విమానాన్ని దాదాపు 23 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. విమానంలో సీఎంతోపాటు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో రాత్రి 8.53 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండైంది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం గాల్లో చక్కర్లు కొట్టినట్లు జీఎంఆర్ ప్రకటించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. విమానం గాల్లో చక్కర్లు కొట్టడంపై సీఎంవో అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.