రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:53 AM
భూవివాదాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. నివీ డెవలపర్స్ అధినేత బాణాల రాంరెడ్డి(48) తన స్వగ్రామంలోని ఫాంహౌస్‌లో బుధవారం సాయంత్రం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
నివీ డెవలపర్స్ అధినేత రాంరెడ్డి బలవన్మరణం
కందుకూరు, పటాన్‌చెరు సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భూవివాదాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. నివీ డెవలపర్స్ అధినేత బాణాల రాంరెడ్డి(48) తన స్వగ్రామంలోని ఫాంహౌస్‌లో బుధవారం సాయంత్రం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాంరెడ్డి కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన బాణాల రాంరెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో స్థిరపడ్డారు. తన బందువు భాస్కర్‌రెడ్డితో కలిసి 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిన రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొంగరకలాన్, మంఖాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించారు. తక్కువ సమయంలోనే అనేక లాభాలు పొందారు. 2018లో నివీ డెవలపర్స్ పేరిట పటాన్‌చెరువులో సుమారు 280ఎకరాల భూమిని డెవల్‌పమెంట్ చేయడానికి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆయన సంపాదించిన డబ్బుతో పాటు దాదాపు రూ.100 కోట్లకు పైగా అప్పులు చేసి మరీ రాంరెడ్డి ఈ వెంచర్‌లో పెట్టుబడి పెట్టారు. కానీ ఆ భూముల్లో కొన్ని ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు రావవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అనుమతులు రాకపోవడంతో అటు రైతుల నుంచి ఇటు అడ్వాన్స్‌లు ఇచ్చిన వారి నుంచి, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అదే సమయంలో వెంచర్‌లో సహ పెట్టుబడిదారైన భాస్కర్ రెడ్డి తన వాటా తీసుకొని ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సమస్యల మరింత పెరిగాయి. ఇక, మొత్తం 280 ఎకరాలలో మొదటి ఫేజ్‌లో డెవలప్ చేసిన ప్లాట్లలో రాంరెడ్డి 10వేల గజాల పాట్లను విక్రయించారు. హెచ్‌ఎండీఏ తనఖాలో ఉన్న ప్లాట్లను తిరిగి తీసుకోవడానికి రాంరెడ్డి హెచ్‌ఎండీఏకు రూ.20 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ప్లాట్లను స్వాధీనం చెయ్యాలంటే ఆ భూమికి సంబంధించిన 1968నాటి లింక్ డాక్యుమెంట్‌లన్నీ తీసుకురావాలని అధికారులు చెప్పారు. అయితే ఆ లింకు డాక్యుమెంట్లు సరిగా లేకపోవడంతోపాటు ఆ పత్రాల్లోని తేడాలను గమనించిన రాంరెడ్డి హతాశుడయ్యారు.
ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో సమస్యలు భరించలేకపోయిన రాంరెడ్డి.. స్వగ్రామం నేదునూరులో తన చెల్లెలికు చెందిన ఫాంహౌస్‌లో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. రాంరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంరెడ్డి బావ కొడూరు ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వెంచర్ డెవల్‌పమెంట్ తీసుకునే సమయంలో ఆ భూమికి సంబంధించి 1968నాటి లింక్ డాక్యుమెంట్‌ను పరిశీలించకుండా అగ్రిమెంట్ చేసుకోవడమే తాను చేసిన తప్పని రాంరెడ్డి ఆత్మహత్య చేసుకునే సమయంలో తన ఫోన్‌లో ఆడియో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనని ఎవరు ఎంత డబ్బు, ఎలా అడిగారు వంటి విషయాలను రాంరెడ్డి వాయిస్‌రికార్డులో వివరించారని పోలీసులు చెబుతున్నారు.
రాజకీయ నేతల జోక్యమే కారణమా?
రాంరెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి కొద్దిపాటి డబ్బుతో నివీ డెవలపర్స్ వెంచర్ ప్రారంభించారు. అయితే, వారిని నమ్మి చుట్టుపక్కల రైతులు ముందుకు వచ్చి తమ పొలాలను డెవల్‌పమెంట్‌కు ఇచ్చారు. అలా దాదాపు 280 ఎకరాలు సేకరించారు. అయితే, 280 ఎకరాల వెంచర్‌పై కొందరు రాజకీయ నేతల కన్నుపడింది. వెంచర్ ప్రారంభించిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు వాటాలు, డబ్బులు భారీగా అడిగినట్లు తెలిసింది. తాము అడిగినంత ఇస్తేనే వెంచర్ ముందుకు వెళుతుందంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అడిగినంత ఇవ్వలేక రాంరెడ్డి కొందరికి కొంత మేర సర్దుబాటు చేసినట్లు తెలిసింది. అయితే మిగతా మొత్తాన్ని ఇవ్వలేకపోవడంతో రోడ్డు సమస్యను సృష్టించినట్లు తెలిసింది. అప్పటి సీఐ వినాయకరెడ్డి ఆధ్వర్యంలో కొందరు రాంరెడ్డితో మాట్లాడినట్టు సమాచారం. కొన్ని రోజుల అనంతరం పెద్దమొత్తంలో ఇళ్ల స్థలాలు కావాలంటూ నేతలు డిమాండ్ చేశారని, దీనిపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా పెట్టారని తెలిసింది. దాంతో సదరు నేతలు కొందరు రైతులను రాంరెడ్డిపై తిరగబడేట్టు చేశారని, డెవల్‌పమెంటుకు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేయించారని సమాచారం. దీనికి సంబంధించి ఆరుగురు రైతులకు సంబంధించిన వాయిస్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే తాను స్థలాల అమ్మానంటూ రాంరెడ్డి చెప్పినా వినకుండా భూములు వెనక్కి ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నట్టు ఉన్న రికార్డులు బయటపడినట్టు సమాచారం. దీంతో రాంరెడ్డి ఆత్మహత్యకు కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కారణమై ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.