ఉన్మాది రాజ్‌కుమార్ ఆత్మహత్య
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:25 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్యాపిల్లలతో సహా ఆరుగురిని దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్నన ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు.
6 హత్యల కేసు నిందితుడు గడ్డిమందు తాగి బలవన్మరణం
పెంజర్ల గ్రామంలోని పొలంలో మృతదేహం లభ్యం
గుర్తించి డయల్ 100కు సమాచారమిచ్చిన స్థానికులు
హత్యాకాండకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో
సూసైడ్ నోట్‌నూ స్వాధీనం చేసుకున్న పోలీసులు
అమ్మాయి కుటుంబం వల్ల అప్పులపాలయ్యానని,
విరక్తితోనే హత్యలు చేస్తున్నానని పేర్కొన్న నిందితుడు
చివరి సమయంలో సానుభూతి కోసం ప్రయత్నం!
మారణకాండకు రెండు కత్తులు వాడిన రాజ్‌కుమార్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్యాపిల్లలతో సహా ఆరుగురిని దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్నన ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తన మేనమామ గ్రామమైన పెంజర్లలో ఓ పొలంలో రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన గడ్డిమందు డబ్బా పడి ఉంది. ఓ వెంచర్‌కు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో ఓ మృతదేహం పడి ఉందంటూ స్థానికులు సాయంత్రం 4గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ముఖ కవళికల ఆధారంగా మృతుణ్ని రాజ్‌కుమార్‌గా గుర్తించారు. అతని సోదరుడిని అక్కడికి రప్పించి నిర్ధారించారు. నోటివెంట రక్తం, నురగ ఉండడంతోపాటు శరీరం పూర్తిగా బిగుసుకుపోవడంతో.. అతడు గడ్డిమందు తాగి అప్పటికే ఏడెనిమిది గంటలు గడిచి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్లకు తరలించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్.. ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడి.. ఆమె కుటుంబ సభ్యులు పోక్సో కేసు పెట్టడంతో ఆమెను, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్యను, ఇద్దరు పిల్లలను గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుణ్ని పట్టుకునేందుకు పోలీసులు మూడు రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. దీంతో అనేక చోట్ల నిందితుడి పోలికలు ఉన్న వ్యక్తులను చూసినట్లు పోలీసులకు ఫోన్లు వచ్చాయి. వీటిని కూడా పోలీసులు పరిశీలించి ఫోన్లు వచ్చిన ప్రాంతాలకు వెళ్లి విచారించారు. అయితే అవన్నీ నిజం కాదని నిర్ధారణ అయినట్లు ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. సోమవారం కోదాడ ప్రాంతంలో రాజ్‌కుమార్ పోలికలున్న వ్యక్తిని గుర్తించామని, అతని కోసం ప్రత్యేక పోలీసు బలగాలను అక్కడికి తరలించి గాలింపు చేపట్టామని పేర్కొన్నారు. అయితే ఇంతలోనే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటూ డయల్ 100కు సమాచారం అందిందని, వెంటనే పోలీసులను ఘటనా స్థలికి పంపించామని వివరించారు. సుమారు లీటర్ గడ్డిమందు (హెచ్‌పీవో5) తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
హత్యలకు 2 కత్తులు.. చివరిగా బాలిక హత్య
ఆరుగురిని దారుణంగా హత్య చేసిన రాజ్‌కుమార్.. ఇందుకోసం రెండు కత్తులు ఉపయోగించినట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు మైనర్ బాలిక ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్.. ఆమె తల్లిని, నానమ్మను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అక్కడి నుంచి మైనర్ బాలికను తన వాహనంలో ఎక్కించుకుని తన స్వగ్రామమైన దైవాలగూడకు తీసుకెళ్లాడు. ఆమెను కారులోనే ఉంచి లాక్ వేసి తన ఇంటి తలుపు తట్టి నిద్రిస్తున్న భార్యను లేపాడు. వెంటనే తన కుమారులను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తుండగా భార్య సరిత అడ్డుకోవడంతో ఆమె కడుపులో పొడిచి చంపాడు. అనంతరం ఇద్దరు పిల్లల తలను నరికి హత్య చేశాడు. అనంతరం కారులో మైనర్ బాలికను సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి చంపివేశాడు. రాజ్‌కుమార్ అద్దె కారు తీసుకుని ఈ ఘటనలకు పాల్పడ్డాడు. హత్యల తరువాత కారు యజమానికి యూపీఐ ద్వారా అద్దె చెల్లించాడు. అనంతరం నిందితుడు షాబాద్, షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లోనే తిరిగినట్లు తెలుస్తోంది. అతని మృతదేహం వద్ద గడ్డిమందు డబ్బాతోపాటు జేబులో రూ.1250 నగదు, బస్సు టికెట్లు లభ్యమయ్యాయి.
2 కోట్ల అప్పులు.. గేమ్స్ కోసం 26 సిమ్‌లు
రాజ్‌కుమార్ వ్యసనాలకు అలవాటు పడ్డట్లు తెలిసింది. అమ్మాయిల పిచ్చితోపాటు బెట్టింగ్‌లు, జల్సాలకు భారీ డబ్బు ఖర్చుపెట్టేవాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఇందుకోసం 26 సిమ్‌కార్డులను ఉపయోగించాడు. ఈ దురలవాట్ల వల్ల దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. అయితే సెల్ఫీ వీడియోలో మాత్రం తాను నాశనం కావడానికి బాలిక కుటుంబమే కారణమని ఆరోపించాడు. దీంతో దారుణ హత్యలకు పాల్పడ్డాక చివరకు తన చావు సమయంలో సానుభూతి కోసం ప్రయత్నించాడనే అనుమానాలు కలుగుతున్నాయి.
‘వాణ్ని కాల్చి చంపాల్పింది’
రాజ్‌కుమార్ చేసిన దారుణం వల్ల తమ కుటుంబం సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అతని సోదరుడు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వాడిని చిత్రహింసలు పెట్టి చంపాల్సింది. ప్రశాంతంగా చనిపోయి ఎన్నో కుటుంబాల మనఃశాంతిని హరించాడు. మా తమ్ముడు ఇంత దుర్మార్గుడవుతాడని ఎన్నడూ ఊహించలేదు’’ అని భాస్కర్ అన్నారు. మరోవైపు తన కూతురి జీవితాన్ని దుర్మార్గుడు నాశనం చేశాడని హత్యకు గురైన రాజ్‌కుమార్ భార్య సరిత తల్లి జయమ్మ విలపించారు. ప్రేమ పేరుతో వేధించి, మరో పెళ్లి సంబంధం చూసే పరిస్థితిని కూడా లేకుండా చేశాడని, చివరకు అత్యంత దారుణంగా చంపి తమ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడని కన్నీటి పర్వంతమయ్యారు.
బాధిత కుటుంబానికి 10 లక్షల సాయం
రాజ్‌కుమార్ చేతిలో హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యల ఆద్వర్యంలో దివ్యాంగురాలు మేఘనకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. దివ్యాంగురాలు మేఘన ఆలనాపాలన చూసుకోవాలని బంధువులకు సూచించారు. ఆమెకు ఎలాంటి ఇబ్బందిలేకుండా తాము అండగా ఉంటామన్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు రాజ్‌కుమార్‌ను ఆదివారం ఉదయం కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి అక్కడ హైడ్రామా కొనసాగింది. బైపాస్ రోడ్డులో అడుగడుగునా పోలీసులు మోహరించడంతోపాటు వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు మాత్రం డంపింగ్ యార్డు విషయంపై సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న ఉద్దేశంతోనే తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
స్వగ్రామంలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల నిరాకరణ
రాజ్‌కుమార్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు సోమవారం సాయంత్రం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రాజ్‌కుమార్ ఆత్మహత్యపై అనుమనాలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వ వైద్యురాలు నిరాకరించారు. ఎవరైనా నిపుణులను పిలిపించాలని పోలీసులకు సూచించారు. దీంతో రాత్రి 8:30 గంటల తరువాత నిపుణులు వచ్చాకే పోస్టుమార్టం చేశారు. అనంతరం రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయం పోలీసులు తర్జన భర్జన పడ్డారు. మృతుని సొంత గ్రామంలో నిర్వహించాలని అతని భార్య తరఫు బంధువులు కోరారు. అయితే మృతుని తల్లిదండ్రులు, సోదరుడు తమ గ్రామానికి మృతదేహన్ని తీసురేరావద్దన్నారు. వారికి కొందరు గ్రామస్తులు సైతం మద్దతు తెలిపారు. ఇరువర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో.. చేవెళ్లలోని స్మశాన వాటిలోనే దహనం చేశారు.
‘ఆ కుటుంబాన్ని నమ్మి నాశనమయ్యాను’
మారణకాండకు పాల్పడేందుకు ముందు రాజ్‌కుమార్ సెల్ఫీవీడియో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2:26 నిమిషాల నిడివి కలిగిన సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. హత్యలు జరిగిన రోజు సాయంత్రం 4.55 గంటలకు ఈ వీడియో రికార్డయింది. దాంతోపాటు నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. సెల్ఫీ వీడియోలో, సూసైడ్ నోట్‌లో.. తాను మైనర్ బాలిక కుటుంబాన్ని నమ్మి పోసపోయానని, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. తనను, నా కుటుంబాన్ని ఆ అమ్మాయి అన్నివిధాలా వాడుకుని వదిలేసిందని తెలిపాడు. ఆ అమ్మాయే తనను ప్రేమిస్తున్నానంటూ వెంట పడిందని, తాను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించిందని, దాంతో తాను అంగీకరించానని వివరించాడు. ఓ రోజు ఆ అమ్మాయి తనను కలవడం ఆమె నానమ్మ, తల్లి చూసి.. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారని తెలిపాడు. వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చానని, వారి కోసం రెండు ఎకరాల వరకు భూములు అమ్ముకున్నానని వెల్లడించాడు. చివరికి తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. రూ.50 లక్షలు ఇస్తావా? జైలుకు వెళతావా? అని బెదిరించారన్నాడు. వారి టార్చర్ భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానన్నాడు. తాను ఆదుకున్న కుటుంబమే తనను జైలుకు పంపే ప్రయత్నం చేస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది హత్యలకు పాల్పడుతున్నానని తెలిపారు. పరిస్థితి ఇంతదూరం రావడానికి బాలిక తల్లి, నానమ్మతోపాటు మరో నలుగురు బంధువులు కారణమని పేర్కొన్నాడు. తాము చనిపోతే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో ఆ నలుగురిని కూడా రాజ్‌కుమార్ చంపాలని చూశాడేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మేఘనను ఆదుకోవాలి
ప్రభుత్వానికి షాబాద్‌వాసుల విజ్ఞప్తి
షాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): షాబాద్ దారుణ ఘటనలో అందరినీ కోల్పోయిన దివ్యాంగురాలు మేఘనది దయనీయ పరిస్థితి. పుట్టుకతోనే అంగవైకల్యం, మానసిక వైకల్యంతో ఉన్న మేఘన ఆలన పాలన చూసే తల్లి, నానమ్మ, చెల్లి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో గత మూడు రోజులుగా ఆమెను దగ్గరి బంధువులైన చిన్నమ్మలు, బాబాయి కుటుంబసభ్యులు చూసుకుంటున్నారు. మేఘనను పలువురు రాజకీయ నాయకులు, అధికారులు వచ్చి పరామర్శిస్తున్నారు. మేఘనకు బంధువుల అండ ఉన్నా, ప్రభుత్వం నుంచి కూడా భరోసా అవసరమని షాబాద్ వాసులు కోరుతున్నారు.