‘అభయహస్తం’తో మెరిసిన అభ్యర్థులు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:01 AM
రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ’రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది.
సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది .. భట్టి అభినందనలు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ సహకారంతో ప్రారంభించిన ’రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేందుకు రెండు నెలల క్రితం దరఖాస్తులు ఆహ్వానించింది. వాటిల్లో 158 మందిని అర్హులుగా గుర్తించి, రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించింది. 158 మందిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరికి ప్రోత్సాహకంగా మరో రూ.లక్ష అందించనున్నారు. ఈ ఏడాది తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో 18 మంది ఓబీసీలు, 8 మంది జనరల్, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. కాగా మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికైన రాష్ట్ర అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.