హోంగార్డుగా మానేసి.. బంగారం షాపు పెట్టి
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:19 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. గురువారం ఏకకాలంలో పది ఏసీబీ బృందాలు హైదరాబాద్, జహీరాబాద్‌లోని భీమ్‌రెడ్డి బినామీలు, అతని ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే సంస్థల్లో సోదాలు చేశాయి.
బియ్యం కొట్టు నుంచి బిల్డర్‌గా..
భీమ్‌రెడ్డి బినామీలు ఎదిగిన తీరిది..
హైదరాబాద్, జహీరాబాద్‌లో
10 చోట్ల ఏసీబీ సోదాలు
ఓ బినామీ ఇంట్లో రూ.1.35 కోట్లు,
ఇంకొందరి ఇళ్లల్లో పత్రాలు స్వాధీనం
డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్టుతో
ఫోన్లు ధ్వంసం చేసిన బినామీలు
హైదరాబాద్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. గురువారం ఏకకాలంలో పది ఏసీబీ బృందాలు హైదరాబాద్, జహీరాబాద్‌లోని భీమ్‌రెడ్డి బినామీలు, అతని ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే సంస్థల్లో సోదాలు చేశాయి. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో 400 కోట్ల ఆస్తుల మనీట్రయల్‌కు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి తరఫున నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాడనిఆరోపణలు ఎదుర్కొంటున్న పుప్పాలగూడలోని బిల్డర్ వీరబొమ్మ వెంకటేష్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, 14 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. టోలిచౌకిలోని ఒక షట్టర్‌లో గతంలో హోల్‌సేల్ బియ్యం వ్యాపారం చేసిన వెంకటేష్.. భీమ్‌రెడ్డి పరిచయం కావడంతో కోటీశ్వరుడైన క్రమాన్ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు జహీరాబాద్‌లోని భీమ్‌రెడి ఆస్తులు, ఫాంహౌస్ నిర్వహణను చూస్తున్న మాజీ హోంగార్డు లక్ష్మణ్ నాయక్ ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 47.5 ఎకరాలు లక్ష్మణ్ నాయక్, అతని బంధువుల పేరిట భీమ్‌రెడ్డి రిజిస్టర్ చేసి ఆ డాక్యుమెంట్లను తన ఇంట్లో పెట్టుకున్న విషయం గతంలో ఏసీబీ తనిఖీల్లో బయటపడింది
పటాన్‌చెరులో భీమ్‌రెడ్డి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అతని వద్ద లక్ష్మణ్ నాయక్ హోంగార్డుగా పనిచేసి.. ఆ తర్వాత అతనికి నమ్మకస్తుడిగా ఉండి బినామీగా మారాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్‌చెరు నుంచి భీమ్‌రెడ్డి బదిలీ కాగానే హోంగార్డు ఉద్యోగం మానివేసిన లక్ష్మణ్ నాయక్ బంగారు నగల షాపు పెట్టి అత్యంత ధనికుడిగా మారడాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు అతణ్ణి గురువారం ప్రశ్నించి ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారని తెలుస్తోంది. భీమ్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే ఆడిటర్‌కు చెందిన జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక డిజిటల్ సాక్ష్యాధారాలను గుర్తించారు. భీమ్‌రెడ్డి, అతని బినామీల నుంచి ఆడిటర్‌కు వచ్చిన ఈ మెయిల్స్‌లోని వివరాలను పరిశీలిస్తున్నారు. ఆస్తుల కొనుగోలులో నగదు లావాదేవీల సమాచారాన్ని సేకరించారు. భీమ్‌రెడ్డి నివాసం ఇబ్రహీంబాగ్‌లోని వెసెల్లా మెడోస్ కొనుగోలుకు రూ.6 కోట్లు తీసుకున్న మాధవరావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మార్నింగ్ వాక్‌కు అని వెళ్లిన మాధవరావు ఏసీబీ అధికారులు వచ్చిన విషయం తెలిసి ఇంటికి రాకుండా పారిపోయారు. దాంతో ఆయన కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి టెలికం నగర్‌లోని ప్రసాద్‌రావు అనే భీమ్‌రెడ్డి ఆస్తుల కేర్‌టేకర్‌ను సైతం ప్రశ్నించారు. ప్రసాద్‌రావు గతంలో ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేశాడని భీమ్‌రెడ్డి చలవతో అతనిస్థాయి మారిపోయిందని తెలుస్తోంది. భీమ్‌రెడ్డి అరెస్టైన తర్వాత ఆయన బినామీలుగా ఉన్న వారిలో చాలామంది తమ ఫోన్లను పగులగొట్టి దొరక్కుండా పారేసిన విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమ్‌రెడ్డి బినామీల్లో కేవలం ముగ్గురి విచారణ గురువారం పూర్తికాగా ఇంకా చాలామంది ఏసీబీ నజర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి