Share News

పవన్‌ సభకు అనుమతి నిరాకరణ

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:55 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

పవన్‌ సభకు అనుమతి నిరాకరణ

  • శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న పోలీసులు.. హైకోర్టును ఆశ్రయిస్తాం: జనసేన

  • ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని మండిపాటు

  • తెలంగాణ నవనిర్మాణ సంకల్పం పేరుతో నేడు హైదరాబాద్‌లో సభకు జనసేన ఏర్పాట్లు

  • తెలంగాణ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి

  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌

  • తెలంగాణపై కుట్రలు మళ్లీ మొదలయ్యాయి: కవిత

హైదరాబాద్‌/హుస్నాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. పోలీసుల నిర్ణయంపై జనసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కును కాలరాస్తున్నారని మండిపడింది. సభకు అనుమతి కోసం మంగళవారం హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది.

మోదీని మెప్పించడానికేనా ఇక్కడ సభ: కాంగ్రెస్‌

పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లో సభ తలపెట్టడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గతంలో పవన్‌కల్యాణ్‌ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని.. అందుకు ఆయన ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి.. ఆ తర్వాత సభ పెట్టుకోవాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు అన్నం తినటం మానేశానని బహిరంగంగా చెప్పి, తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండి పోతున్నాయని విద్వేషాలు రెచ్చగొట్టెలా మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు నవనిర్మాణం పేరుతో సభ ఎలా పెడతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాత సభ పెట్టుకోవాలని సూచించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో రేటు ఫిక్స్‌ చేసుకొని తెలంగాణలో పవన్‌ నటన మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘మీ బాస్‌ మోదీని మెప్పించడానికి ఇక్కడ సభ పెడుతున్నావా..? బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. తెలంగాణలో నువ్వు ఉద్దరించేది ఏంటి? మీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ముందు వారిని ఆదుకో’ అని సూచించారు. బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవ నిర్మాణమా? అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌ పైసలు ఇస్తే ఏ నటన చేయమన్నా చేస్తారని ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ కలిసి, విడిపోయిన రాష్ట్రంగా మాకు ప్రేమ ఉంటది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు. కానీ, నవ నిర్మాణ సభ పెడితే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. పవన్‌ సభపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ మౌనం వెనుక కచ్చితంగా వారి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉందని అన్నారు.


2.jpg

కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్లండి: కవిత

తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం వారి కుట్రలు మళ్లీ మొదలయ్యాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అక్కడి పార్టీలు తెలంగాణలో ఆంధ్రా ప్రాంత నాయకుల విగ్రహాలు పెడుతూ ఆధిపత్యం చూపేందుకు యత్నిస్తున్నాయన్నారు. తమ సహనాన్ని అలుసుగా తీసుకొని నెత్తిమీదికి ఎక్కి ఆడుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టినట్లే తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌, చెన్నారెడ్డి తదితరుల విగ్రహాలు ఆంధ్రా ప్రాంతంలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు-సాధన అంశంపై టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. సినీ నటుడిగా పవన్‌కల్యాణ్‌ వచ్చి బహిరంగ సభ పెడితే ఇబ్బంది లేదని, ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణతో పెట్టుకున్నవాళ్లెవరూ బాగుపడలేదన్నారు. జనసేన రాజకీయంగా విస్తరించాలనుకుంటే కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్లాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గతప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సనం రోజున (మంగళవారం) ఉద్యమకారులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే నెల తర్వాత ఉప్పల్‌ భగాయత్‌లోని 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 02 , 2026 | 04:55 AM